ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 24, 2020 , 00:50:40

రైల్వే నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

రైల్వే నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ పనులు వేగవంతం చేయాలని, పనులు వేగంగా జరుగాలంటే శాఖల మధ్య సమన్వయం అవసరమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ ఆర్డీలో రైల్వే, రెవెన్యూ, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ప్రధాన మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన రైల్వేలైన్‌ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం నుంచి వెళ్తున్నదని, పనుల్లో జాప్యం జరుగొద్దని సూచించారు. మనోహరాబాద్‌ రైల్వేలైన్‌  ప్రాం తం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నదని, ఆరు రిజర్వాయర్ల మీదుగా ఈ లైన్‌ వెళ్తున్నదని మంత్రి వివరించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ లైన్‌ నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిదని రైల్వే శాఖ సైతం కితాబిచ్చిందని చెప్పారు. గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌ పనులు పూర్తయ్యాయని, ప్రయోగాత్మకంగా నడుపాలని, గజ్వేల్‌-దుద్దెడ భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ నెలాఖరులోపు రైల్వేలైన్‌కు సంబంధించిన భూసేకరణ పనులు పూర్తిచేయాలన్నారు. గజ్వేల్‌- దుద్దెడ లైన్‌లో 28 కి.మీ గానూ 5కి.మీ పని ఇంకా చేయాల్సి ఉందని, వెం టనే పూర్తి చేసేలా చొరవ చూపాలని సూచించారు. సిద్దిపేట రైల్వేస్టేషన్‌ పనులు ప్రారంభించి, అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. దుద్దెడ రైల్వేస్టేషన్‌ వద్ద కలెక్టర్‌, పోలీసు కార్యాలయాలు వస్తున్నాయని, రైల్వేస్టేషన్‌ పనులు వేగవంతం చేయాలని సూచించారు. 

అప్రమత్తంగా మరమ్మతులు చేపట్టాలి 

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు కోతకు గురయ్యాయని, కొన్నిచోట్ల కాజువేలు పొం గిపొర్లుతున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండి మరమ్మతు పనులు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను మంత్రి ఆదేశించారు. కొన్నిచోట్ల లోలెవల్‌ బ్రిడ్జి పనులు ఉన్నాయని, వాటి స్థానంలో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాలన్నారు. సీఎం కేసీఆర్‌ అనుమతితో వీటిని చేపడుదామని పేర్కొన్నారు. మెదక్‌ జిల్లాలో వర్షాలు ఎక్కువ లేకపోవడంతో రోడ్లు పెద్దగా దెబ్బతినలేదన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్లను పరిశీలించి, ఎక్కడైనా మరమ్మతులు అవసరమైతే తక్షణం చేపట్టాలని సూచించారు. సం గారెడ్డి పరిధిలోనూ ఈ వర్షాలకు రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించి గుంతలు పూడ్చాలన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్ల వెంట మొక్కలను నాటాలన్నారు. రోడ్‌లో డ్రైన్లు లేక వర్షంనీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

గజ్వేల్‌ రింగు రోడ్డు పనులు వేగవంతం చేయాలి 

గజ్వేల్‌ రింగు రోడ్డు పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రింగు రోడ్డులో ముట్రాజ్‌పల్లి, పాత ఆర్డీవో ఆఫీసు, పిడిచెడ్‌ రోడ్‌, రిమ్మనగూడ రోడ్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. గజ్వేల్‌, పాండవుల చెరువురోడ్డు దారుణంగా దెబ్బతిందని,  వెంటనే బాగు చేయాలని సూచించారు. దుబ్బాక కెనాల్‌ నిర్మాణం కోసం 552 ఎకరాల భూసేకరణను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, కెనాల్‌కు సంబంధించి 17 డిస్ట్రిబ్యూటరీల కోసం 850 ఎకరాల భూసేకరణ వెంటనే చేపట్టాలని మంతి హరీశ్‌రావు అన్నారు. కలెక్టర్‌ సెప్టెంబర్‌ తొలివారంలోగా ఈ భూములు ఇరిగేషన్‌ శాఖకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెయిన్‌ కెనాల్‌ 46కిలో మీటర్లకు గానూ కెనాల్‌ లైనింగ్‌, స్ట్రక్టర్స్‌ 16 కిలోమీటర్ల వరకు పూర్తి అయ్యిందని, మిగిలిన 39కిలో మీటర్ల బ్యాలెన్సింగ్‌ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును పరిశీలించాలన్నారు. గుత్తేదారులు పనులు ఆపకుండా పర్యవేక్షణ జరుపాలన్నారు. సమీక్షలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo