శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 24, 2020 , 00:50:42

పైసా ఖర్చు లేకుండా డబుల్‌ బెడ్‌రూం

పైసా ఖర్చు లేకుండా డబుల్‌ బెడ్‌రూం

సిద్దిపేట రూరల్‌: ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని, అందుకే పైసా ఖర్చు లేకుండా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పేదలకు అందిస్తున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్‌ మండలం ఇర్కోడు గ్రామంలో రూ.1.57కోట్లతో నిర్మించిన 25 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లతో పాటు ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంక్‌ను జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. పైసా ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిరుపేదలకు మాత్రమే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదన్నారు. ఇర్కోడు గ్రామం సిద్దిపేట పట్టణానికి సమీపంలో ఉండడంతో ఒక్కో ఇల్లు రూ.15 లక్షల విలువ చేస్తుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 500మందికి డబుల్‌ ఇండ్లు ఇచ్చామన్నారు. అధిక వ్యయం అయినప్పటికీ పేదల సంక్షేమం కోసం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని, లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇర్కోడు గ్రామంలో రూ.12 లక్షలతో సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మించామన్నారు. రూ.2 కోట్లతో నిర్మిస్తున్న పశువుల హాస్టల్‌ను త్వరలోనే ప్రారంభించుకుందామన్నారు. రాబోయే రోజుల్లో ఇర్కోడు మహిళా సంఘాల ద్వారా పప్పు దినుసుల తయారీ, ఆయిల్‌ మిల్‌ లాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రైతుల శ్రేయస్సును కాంక్షించి ప్రభుత్వం చేపట్టిన నియంత్రిత పంట సాగు విధానానికి మద్దతు అందించారన్నారు. అనంతరం ఇర్కోడు గ్రామంలోని చింతలకుంట చెరువులో చేప పిల్లలను మంత్రి హరీశ్‌రావు వదిలారు. అలాగే మండల పరిధిలోని రావురూకుల గ్రామంలో గ్రామ ఫంక్షన్‌ హాల్‌తో పాటు రూ.24 లక్షల వ్యయంతో 11 కి.మీ మేర నిర్మించే సైడ్‌ డ్రైన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాన్ని ప్రారంభించి, చెరువులో చేప పిల్లలు వదిలారు. మండల పరిధిలోని రాఘవాపూర్‌ గ్రామంలోని చెరువులో చేప పిల్లలను వదిలి అనంతరం గ్రామంలోని తోర్నాల-నారాయణరావుపేట రోడ్డుపై రూ.43 లక్షలతో నిర్మించే సైడ్‌ డ్రైన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

స్వరాష్ట్రంలో ఐటీఐకి శాశ్వత భవనం..

ఉమ్మడి రాష్ట్రంలో ఐటీఐ నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వలేదని, స్వరాష్ట్రంలో శాశ్వత భవనం నిర్మించుకుంటున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇర్కోడులో ఐటీఐ కళాశాల కోసం రూ.3 కోట్లతో నిర్మించనున్న అదనపు భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. నాడు సగం పనికి మాత్రమే రూ.2.07 కోట్లు మంజూరు చేశారని, స్వరా ష్ట్రం సాధించుకున్నాక పూర్తి స్థాయి పనుల కోసం అదనంగా రూ.3.70 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. మొత్తం రూ.5.77 కోట్లు మంజూరు కాగా, గతంలో మంజూరైన పనులు మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తవుతాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయి రాం, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, డీపీవో సురేష్‌బాబు, ఎంపీపీ శ్రీదేవి చందర్‌రావు, ఎంపీడీఓ సమ్మిరెడ్డి, తహసీల్దార్‌ పరమేశ్వర్‌, వైస్‌ ఎంపీపీ యాదగిరి, సర్పంచు నీరటి కవిత రవీందర్‌ పాల్గొన్నారు.


logo