సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 22, 2020 , 00:14:27

రైతుకు సిద్ధమవుతున్న ‘వేదిక’

రైతుకు సిద్ధమవుతున్న ‘వేదిక’

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. 322 రైతు వేదికల భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజారు చేసింది. ఒక్కో రైతు వేదికను రూ. 22 లక్షలతో నిర్మిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో రైతు వేదిక భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. మెజార్టీ వ్యవసాయ క్లస్టర్లలో 60 శాతానికి పైగా వేదికల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్‌ రెండో వారంలోగా అన్ని రైతు వేదికలను పూర్తిచేసి, వినియోగంలోకి తెచ్చేలా యంత్రాంగం చర్యలు చేపడతున్నది.

ముమ్మరంగా పనులు... 

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణానికి  మే 29న మంత్రి హరీశ్‌రావుతో కలిసి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు. అనంతరం ఆయా నియోజకవర్గాలలో స్థానిక ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పనులను ప్రారంభించారు. రైతులంతా ఒక్క దగ్గర సమావేశమై, మార్కెటింగ్‌, వ్యవసాయంలో నూతన విధానాలు, సస్యరక్షణ చర్యలు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతో అనేక అంశాలపై చర్చించుకోవడానికి రైతు వేదికలు ఉపయోగపడనున్నాయి. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో రైతు వేదిక నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో తొలుత ఎర్రవల్లి, గజ్వేల్‌, మిట్టపల్లి, రాయ్‌పోల్‌, గౌరారం వేదికలను అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతు వేదిక భవనాల చుట్టూ 3 వరుసల్లో 8 ఫీట్ల ఎత్తుగల మొక్కలతో గ్రీన్స్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నారు.రైతు వేదిక భవన నిర్మాణాలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమీక్షలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల కలెక్టర్లు, ఆయా జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నిర్మాణాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి రైతు వేదిక భవన నిర్మాణానికి 500 సిమెంట్‌ బ్యాగులను ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో సిమెంట్‌, స్టీల్‌ తదితర సామగ్రిని పంపిణీ చేశారు. 

నిర్మాణాల పురోగతిపై ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌... 

రైతు వేదికల భవనాల నిర్మాణాలపై సిద్దిపేట కలెక్టర్‌ పి.వెంకట్రామ్‌రెడ్డి నిరంతరం పర్యవేక్షణ చేయడంతో పాటుగా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడా తప్పిదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఇంజినీర్లదేనని చెబుతున్నారు. ప్రతి వారంలో మూడు రోజులు మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు రైతు వేదికల పర్యవేక్షణ ఫొటోలను వాట్సాప్‌లో పంపించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. రైతు వేదికల నిర్మాణాలపై ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ప్రతినెలా 3వ, 18వ తేదీల్లో నిర్మాణ పనులకు బిల్లుల చెల్లింపులు చేయనున్నారు. 

అన్ని సౌకర్యాలతో...

ఒక్కోరైతు వేదికను 2,046 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 22 లక్షలు మంజూరు చేసింది. ఇందులో రూ. 12 లక్షలు వ్యవసాయశాఖ నుంచి కాగా, మిగతా రూ.10 లక్షలు ఉపాధిహామీ పథకం ద్వార మెటీరియల్‌ కంపోనెట్‌ కింద నిధులు విడుదల చేస్తారు. క్లస్టర్‌ పరిధిలోని రైతులు, రైతుబంధు కమిటీ సభ్యులు, గ్రామ, మండల కమిటీ కోఆర్డినేటర్లు అంతా ఒకేచోట కూర్చుండి చర్చించుకునేందుకు వీలుగా, హాల్‌ను 1,496 చదరపు అడుగుల వీస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ హాల్‌లో సుమారు 154 మంది వరకు రైతులు కూర్చోవచ్చు. హాల్‌తో పాటు రెండు గదులు టాయిలెట్స్‌ నిర్మిస్తున్నారు. ఇందులో ఒక గదిలో వ్యవసాయశాఖ అధికారి కూర్చుంటారు. ఆ గదిలోనే కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకునే విధంగా కంప్యూటర్లు, టీవీలు ఏర్పాటు చేస్తారు. అవపరమైన ఫర్నిచర్‌ తదితర సౌకర్యాలను సమకూర్చుతారు. రైతుబంధు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోని రైతులకు అందుబాటులో ఉండి సూచనలు, సలహాలు, మార్కెటింగ్‌ తదితర అం శాల్లో తోడ్పాటును అందించడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను రైతులకు చేరేలా చూస్తారు.


logo