సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 20, 2020 , 23:51:59

సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రజలకు రక్షణ

సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రజలకు రక్షణ

  • n సీసీ కెమెరాలన్నీ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయాలి 
  • n ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట టౌన్‌: సిద్దిపేట జిల్లా అన్నింటిలో ఆదర్శంగా ఉన్నది. సీసీ కెమెరాల ఏర్పాటులోనూ ఆదర్శంగా ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.  ఒక్క సీసీ కెమెరా ఐదుగురు పోలీసులతో సమానమన్నారు.  ఇండ్లల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని సేఫ్‌ సిద్దిపేటకు ప్రజలు సహకరించాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. గురువారం సిద్దిపేట పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సీపీ జోయల్‌ డెవిస్‌తో కలిసి సీసీ కంట్రోల్‌ రూంను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. గతంలో జరిగిన నేరాలను సీసీ కెమెరాలతో ఏ విధంగా చేధించారు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల పనితీరుపై సీపీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ.2 కోట్ల 14 లక్షలతో  పట్టణంలో 550 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూంను సిద్దిపేటలో నిర్మించామన్నారు. వెజిటేబుల్‌, నాన్‌వేజ్‌ మార్కెట్‌, రంగనాయకసాగర్‌ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాంకు సూచించారు. 

అన్ని గ్రామాల్లో  ఏర్పాటు..

కాళ్లకుంట కాలనీ, నర్సపురం డబుల్‌ బెడ్రూం, రంగనాయకపురం, మెట్టుబండలు, మెడికల్‌ కళాశాల, లింగారెడ్డిపల్లి, రంగధాంపల్లి, గాడిచర్లపల్లి గ్రామాల్లో త్వరగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న అన్నీ సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌రూంకు అనుసంధానం చేస్తామన్నారు.  సీపీ జోయల్‌ డెవిస్‌ మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు కృషితో ప్రత్యేక నిధులతో పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4205 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 464 గ్రామాల్లో, 5 మున్సిపాలిటీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 2014నుంచి ఇప్పటి వరకు సీసీ కెమెరాల ద్వారా 210 కేసులు చేధించామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్‌ చైర్మన్‌, అడ్మిన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌, సీసీఎస్‌ ఏసీపీ సురేందర్‌, ట్రాఫిక్‌ ఏసీపీ బాలాజీ, వన్‌టౌన్‌ సీఐ సైదులు, టూటౌన్‌ సీఐ పరశురామ్‌గౌడ్‌, రూరల్‌ ఎస్సై శంకర్‌ పాల్గొన్నారు. 

ప్రతి రైతుకూ రైతుబంధు :  -పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి 

సిద్దిపేట రూరల్‌/నారాయణరావుపేట: ప్రతి రైతుకూ రైతుబంధు అందాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాబోయే రోజుల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలో విపంచి కళా నిలయంలో సిద్దిపేట రూరల్‌, నారాయణరావుపేట మండలాల్లోని 195 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు రైతు రాజు అని  నినాదంగా ఉం డేది. తెలంగాణ ప్రభుత్వం రైతును రాజుగా చేసి చూపిస్తున్నదన్నారు. అవినీతి లేకుండా, పారదర్శకంగా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి రైతులకు బీమా అందిస్తున్నదన్నారు. 20 ఏండ్లలో ఇంత మంచి కాలం కాలేదు,  జిల్లాలో 2700 చెరువులు నిం డాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మి షన్‌ కాకతీయతో చెరువులకు పూర్వవైభవాన్ని తెచ్చిందన్నారు. గతేడాది లక్షా 20 వేలు సాగు అయితే, ఈ ఏడాది 2 లక్షల 30 వేలకు వరిసాగు పెరిగిందన్నారు. కరోనాపై భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని మంత్రి అన్నారు. కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

సీఎం సహాయ నిధి .. నిరుపేదలకు వరం 

సిద్దిపేట కలెక్టరేట్‌:  సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని తన నివాసంలో 53 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదన్నారు.  పట్టణంలోని 19 మందికి రూ.6 లక్షల 5 వేలు, సిద్దిపేట రూరల్‌ మండలంలో 10 మందికి రూ. 2 లక్షల 57 వేలు, సిద్దిపేట అర్బన్‌ మండలంలో ముగ్గురికి రూ. 67 వేలు, చిన్నకోడూరు మండలంలో ఏడుగురికి రూ.లక్షా 66 వేలు, నంగునూరు మండలంలో 10 మందికి రూ.2 లక్షల 42 వేలు నారాయణరావుపేట మండలంలో నలుగురికి రూ.లక్షా 64 వేలు అందజేశామన్నారు. 

 రైతులకు పరిహారం.. 

ఇటీవల విద్యుత్‌ షాక్‌కు గురై రెండు బర్రెలు మృతి చెందాయి. విషయాన్ని రైతులు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకురాగా, ఆర్థిక సాయం అందించారు. సిద్దిపేట అర్బన్‌ మండలం ఎన్సాన్‌పల్లికి చెందిన తడ్కపల్లి యాదవ్వకు రూ.40వేలు, సిద్దిపేట రూరల్‌ మండలం ఇర్కోడుకు చెందిన బంధారం భాగవ్వకు రూ.40 వేలు అందజేశారు. పంపిణీ కార్యక్రమంలో కౌన్సిలర్లు, విద్యుత్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు. 


logo