సోమవారం 28 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 19, 2020 , 02:45:06

పంటల సంరక్షణ చర్యలపై అవగాహన

పంటల సంరక్షణ చర్యలపై అవగాహన

నారాయణరావుపేట : మండలంలోని ఇబ్రహీంపూర్‌లో వర్షాలతో దెబ్బతిన్న పంటలను మంగళవారం ఏరువాక తోర్నాల కేంద్రం శాస్త్రవేత్త నాగస్వాతి, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఉమారాణి, శ్వేత పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వివిధ పంటల్లో చేపట్టాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి పంటలో వేరుకుళ్లు నివారణకు 3 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా 1గ్రామ్‌ కార్బండిజమ్‌ మందును లీటర్‌ నీటిలో కలిపి మొక్క మొదళ్లలో తడుపాలని వివరించారు. రసం పీల్చే పురుగు నివారణను మొక్కల కాండంపై మందు పూత ద్వారా నివారించవచ్చన్నారు. ఇప్పుడు వరి నాట్లు వేస్తే నారు కొనలను తుంచాలని సూచించారు.  నారు కొనలను తుంచితే కాండం తొలిచే పురుగును నివారించవచ్చని తెలిపారు. వరి నాట్లు వేసుకునే ముందు పొలంలో కాలిబాటను ప్రతి 2 మీ.లకు 20 సెంమీ బాటలు తీయాలని, దీని వల్ల సుడిదోమ ఉధృతిని తగ్గించ వచ్చన్నారు. అలాగే, కంది పంటను పరిశీలించి, చిత్త పురుగులను గుర్తించారు. చిత్త పురుగు నివారణకు లీటర్‌ నీటిలో క్లోరిఫైరిపాస్‌ 2.5మి.లీ కలిపి పిచికారీ చేయాలని వివరించారు.

అధిక వర్షాలతో పత్తిలో తెగుళ్ల వ్యాప్తి

గజ్వేల్‌ :  వర్షాలతో పత్తి పంటలో తెగుళ్లు ఆశించే అవకాశం ఉందని డివిజన్‌ వ్యవసాయాధికారి అనిల్‌ అన్నారు. మంగళవారం గజ్వేల్‌ వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని వివిధ మండలాల్లో సాగు చేస్తున్న పత్తి పంటలను క్షేత్రస్థాయిలో స్థానిక వ్యవసాయాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్‌ వ్యవసాయ డివిజన్‌ పరిధిలో సుమారు లక్షా 34 వేల ఎకరాల్లో పంటలు సాగు కాగా, ప్రధానంగా పత్తి 80 వేల ఎకరాల్లో సాగు చేశారన్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో  వేరుకుళ్లు, కాండం కుళ్లు, బ్యాక్టీరియా, ఆకుమచ్చ తెగుళ్లతోపాటు ధాతువు లోపాలతో పంటలు నష్టపోయే ప్రమాదం   ఉందన్నారు. రైతులు సత్వరమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మొదటగా పొలాల్లో నిలిచిన వాన నీటిని కాలువలు తీసి బయటకు పంపించాలన్నారు.  పత్తి పంటకు ఎకరా పొలంలో కాఫర్‌ ఆక్సీక్లోరైడ్‌600 గ్రాములు, ప్లాంటామైసిన్‌ 20 గ్రాముల మందులను 2 లీటర్ల నీటిలో కలిపి మొక్క మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలని వివరించారు. తర్వాత మూడో రోజు 19,19,19 కాంప్లెక్స్‌ మందును ఎకరాకు 2కిలోలు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్క ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టిపై రెండు పిచికారీలను వారం, పది రోజుల్లో మరొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుందని వివరించారు. రైతులు  పైన చెప్పిన మూడు సస్యరక్షణ చర్యలను సంబంధిత ఏఈవో సలహాలతో వెంటనే చేపట్టి పత్తి పంటను సంరక్షించుకోవాలని ఆయన వివరించారు.   logo