ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 15, 2020 , 00:27:15

ఇంటింటా ఇన్నోవేటర్‌కు ఉమ్మడి మెదక్‌ నుంచి మూడు ప్రదర్శనలు ఎంపిక

ఇంటింటా ఇన్నోవేటర్‌కు ఉమ్మడి మెదక్‌ నుంచి  మూడు ప్రదర్శనలు ఎంపిక

  • l పంద్రాగస్టు వేడుకల్లో ప్రదర్శన
  • l వ్యవపాయ రంగానికి ఊతమిచ్చేలా ఆవిష్కరణలు
  • l వీల్‌ బేస్‌డ్‌ ఫర్టిలైజర్‌ స్ప్రేయింగ్‌ పంప్‌,  మోటర్‌ రన్‌ వీడ్‌ రిమూవర్‌ తయారు చేసిన  సంగారెడ్డి జిల్లా యువకులు 
  • l కలుపుతీత యంత్రం తయారు చేసిన సిద్దిపేట   జిల్లా రాఘవాపూర్‌ యువకుడు

సంగారెడ్డి టౌన్‌ : తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం నాంది పలికింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింట ఇన్నోవేటర్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  సమస్యల పరిష్కారానికి నూతన ఆవిష్కరణలు చేపట్టేలా సాధారణ గృహిణి నుంచి పారిశ్రామికవేత్తల వరకు ప్రోత్సహిస్తున్నది. నెల రోజుల నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఆన్‌లైన్‌ ద్వారా ఆవిష్కరణలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. జిల్లా నుంచి 15 ఆవిష్కరణలు స్టేట్‌ ఇన్నోవేటర్‌కు పంపగా, అందులో  రెండు ఆవిష్కరణలు ఎంపికయ్యాయి. వ్యవసాయం అవసరాలకు తక్కువ ఖర్చు, సమయం ఆదా అయ్యేలా ఆవిష్కరణలు రూపొందించారు. వీల్‌ బేస్‌డ్‌ ఫర్టిటైజర్‌ స్ప్రేయింగ్‌ పంప్‌ను మునిపల్లి మండలం మల్లికార్జునపల్లికి చెందిన సంగమేశ్వర్‌ తయారు చేశారు. ఇది పంటలకు స్ప్రే చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది. మోటర్‌ రన్‌ వీడ్‌ రిమూవర్‌ చేనులో కలుపు తీసే యంత్రాన్ని వట్‌పల్లి మండలం గొర్రెకల్‌కి చెందిన విఘ్నేశ్వర్‌ తయారు చేశారు. వీరు చేసిన రెండు వ్యవసాయ పరికరాలు లాభసాటిగా ఉండడంతో, వాటిని జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున వీటిని ప్రదర్శించేందుకు అవకాశం కల్పించారు. ఈ ప్రదర్శనలను పరిశీలించి అందులో రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు. 

పంద్రాగస్టు వేడుకల్లో ప్రదర్శన..

జిల్లా నుంచి ఎంపికైన రెండు ఆవిష్కరణలు వీల్‌ బేస్‌డ్‌ ఫర్టిలైజర్‌ స్ప్రేయింగ్‌ పంప్‌, మోటర్‌ రన్‌ వీడ్‌ రిమూవర్‌ను పంద్రాగస్టు వేడుకల్లో ప్రదర్శించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రెండు ప్రదర్శనలు జిల్లాస్థాయికి ఎంపిక కావడంపై కలెక్టర్‌ హనుమంతరావు హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. 

సిద్దిపేట జిల్లా నుంచి కలుపు తీత యంత్రం ఎంపిక..

సిద్దిపేట రూరల్‌ : సిద్దిపేట రూరల్‌ మండలం రాఘవాపూర్‌ గ్రామానికి చెందిన కొమ్మిడి బాలకిషన్‌రెడ్డి  తయారు చేసిన కలుపు తీత యంత్రం జిల్లా నుంచి ఇంటింటా ఇన్నోవేటర్‌ ప్రదర్శనకు ఎంపికైంది. పాత బైక్‌ ఇంజిన్‌ను ఉపయోగించి ఇనుప ఫ్రేమ్‌ వెల్డర్‌,  మోటర్‌ సైకిల్‌ చైన్‌, చక్రం, క్లబ్‌, గేర్‌ రాడ్‌ సాయంతో ఎక్స్‌లేటర్‌ అమర్చి ఈ యంత్రాన్ని తయారు చేశారు. కూలీల కొరత కారణంగా ఇబ్బంది పడకుండా ఈ యంత్రం తయారు చేసినట్లు బాలకిషన్‌రెడ్డి వెల్లడించారు. ఒక లీటర్‌ పెట్రోల్‌ ద్వారా ఒక ఎకరా కలుపు తీయవచ్చన్నారు. కలుపు తీయడమే కాకుండా దుక్కి దున్ని చదును చేసుకోవచ్చన్నారు. ఈ యంత్రం తయారు చేయడానికి సుమారు రూ.10 వేలు ఖర్చు అయ్యిందని బాలకిషన్‌రెడ్డి తెలిపారు.

తక్కువ ఖర్చు, సమయం ఆదా..

వీల్‌ బేస్‌డ్‌ ఫర్టిలైజర్‌ స్ప్రేయింగ్‌ పంప్‌తో తక్కువ ఖర్చు, సమయం ఆదా అవుతుంది. వీల్‌ బేస్‌డ్‌ ఫర్టిలైజర్‌ స్ప్రేయింగ్‌ పంప్‌ తయారీకి కేవలం రూ.2 వేల నుంచి రూ.2,500 మాత్రమే ఖర్చు అవుతుంది. రైతులు బరువు మోయకుండా స్ప్రేయర్‌ పంపును వీల్‌పై ఉంచి చేనులో పిచికారీ చేయవచ్చు. 15 లీటర్ల మందును గంటలో ఎకరానికి స్ప్రే చేయవచ్చు.

- సంగమేశ్వర్‌, మల్లికార్జునపల్లి

మోటర్‌ రన్‌ వీడ్‌ రిమూవర్‌ రైతులకు మేలు..

మార్కెట్‌లో పవర్‌ వీడర్లు ఉన్నా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. మోటర్‌ రన్‌ వీడ్‌ రిమూవర్‌తో రైతులకు ఎంతో మేలు. రోజుకు ఐదు ఎకరాల్లో కలుపు తీయవచ్చు.  రూ.110ల పెట్రోల్‌తో ఎకరం చేను కలుపు తీయవచ్చు. దీని తయారీకి రూ.13 వేలు మాత్రమే ఖర్చు అవుతుంది. మోటర్‌ రన్‌ వీడ్‌ రిమూవర్‌ జిల్లాస్థాయి ప్రదర్శనకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. 

- విఘ్నేశ్వర్‌, గొర్రెకల్‌, వట్‌పల్లి మండలం

రెండు ఆవిష్కరణలు ఎంపిక..

సంగారెడ్డి జిల్లా నుంచి వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉండే రెండు ఆవిష్కరణలు ఎంపిక కావడం సంతోషకరం. వ్యవసాయ అవసరాలకు సమయం, శ్రమ, ఖర్చును తగ్గించేలా రూపొందించారు. వారికి అభినందనలు. నూతన ఆవిష్కరణలు చేసే వారికి రాష్ట్ర ఇన్నోవేటర్‌ సెల్‌ మంచి అవకాశం కల్పించింది. జిల్లా నుంచి 15 నూతన ఆవిష్కరణలు ఆన్‌లైన్‌ ద్వారా పంపించగా, పరిశీలించి రెండును ఎంపిక చేశారు. వీరు తయారు చేసిన ఆవిష్కరణలు పంద్రాగస్టు రోజున ప్రదర్శిస్తారు. రాష్ట్రవ్యాప్త ప్రదర్శనలు పరిశీలించి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లాలో తయారు చేసిన ఆవిష్కరణలు రాష్ట్ర స్థాయికి వెళ్లాలని ఆశిస్తున్నా. 

- కలెక్టర్‌ హనుమంతరావు


logo