శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 15, 2020 , 00:27:19

మల్లన్నసాగర్‌ ప్రధాన కాల్వ భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి

మల్లన్నసాగర్‌ ప్రధాన కాల్వ  భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి

  • l అభ్యంతరాలకు వారం, పది రోజుల గడువు 
  • l లబ్ధిదారుల ఎంపికప్రక్రియపై సమీక్షలో 
  • l రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : అర్హులకే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు అందజేస్తామని, త్వరలోనే జాబితా విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులతో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై నోడల్‌ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఏడాదిగా జరిపిన వడపోతలో తేలిన అర్హులు, అనర్హుల వివరాలపై చర్చించారు. జిల్లా నోడల్‌ అధికార బృందం చేపట్టిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రాష్ర్టానికే ఒక మోడల్‌గా నిలిచిందని మంత్రి కితాబిచ్చారు. అర్హులు, అనర్హుల విషయమై అభ్యంతరాలకు వారం, పది రోజులు గడువు ఇచ్చి త్వరలోనే తుది జాబితాను విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పట్టణంలోని ప్రధాన కాలనీల్లో క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలనలో భాగంగా సుభాశ్‌నగర్‌, కాళ్లకుంటకాలనీ, బీడీకాలనీ, టీహెచ్‌ఆర్‌నగర్‌కాలనీ, ఇందిరానగర్‌, ఎన్టీఆర్‌నగర్‌, ఎల్లంకికాలనీ, వికాస్‌ స్కూల్‌, హనుమాన్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో నివాసయోగ్యులైన వారి కుటుంబాల వివరాల నివేదికను సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి వివరించారు. ఆయా ప్రాంతాల్లో పట్టాలు పొందిన వారు, జీవో 58, 59 కింద భూములు ప్రొసీడింగ్‌ పొందిన వారు, గతంలో ప్రభుత్వ పట్టాలు పొందిన వారి కుటుంబాల వివరాలను అధికారులు మంత్రికి తెలిపారు.  అర్హుల జాబితా, అధికారుల విచారణలో వెల్లడైన క్షేత్రస్థాయి స్థితిగతులను, అంశాలను అధికారులు మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ సమక్షంలో వివరించారు.

కాల్వ భూసేకరణ త్వరగా చేయాలి 

కొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ప్రధాన కాల్వ భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కలెక్టరేట్‌లో మల్లన్నసాగర్‌ ప్రధాన కాల్వ, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్‌ ద్వారా వెళ్లే డిస్ట్రిబ్యూటరీ కాల్వలు అంశంపై కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఆర్డీవో అనంతరెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ ఆనంద్‌, ఇరిగేషన్‌ ఈఈ గోపాలకృష్ణ, సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఇరిగేషన్‌ అధికారులతో కాల్వల భూసేకరణ పురోగతిపై సమీక్షించారు. ప్రధాన కాల్వలో 2 ఎల్‌, 3 ఎల్‌, 4 ఎల్‌ డిస్ట్రిబ్యూటరీ కాల్వలపై దృష్టి సారించాలని ఇరిగేషన్‌, తహసీల్దార్లకు మంత్రి సూచించారు. దుబ్బాక ప్రధాన కాల్వలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ వివరాలు ఆరా తీస్తూనే.. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆనంద్‌ను అడిగి తెలుసుకున్నారు. 

మున్సిపల్‌లో కరోనా మరణాలు ఉండొద్దు 

సిద్దిపేట కలెక్టరేట్‌ : మున్సిపల్‌ పరిధిలో కొవిడ్‌(కరోనా వైరస్‌) మరణాలు లేకుండా చూడాల్సిన బాధ్యత కౌన్సిలర్లదేనని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కొవిడ్‌ బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారు వేగంగా కోలుకునేలా చూడాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో కలిసి సిద్దిపేట పట్టణంలో కొవిడ్‌ పరిస్థితిపై సమీక్షించారు. సిద్దిపేట మున్సిపల్‌లో ప్రతి కౌన్సిలర్‌ ప్రతి రోజు కనీసం 50 కుటుంబాల యజమానులతో మాట్లాడాలని మంత్రి సూచించారు. ఎవరైనా కరోనా లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే స్పందించి వారికి వైద్యపరీక్షలు చేయించాలన్నారు. సరైన సమయంలో సరైన చికిత్స అందేలా చేస్తే కరోనా మరణాలు ఉండవని పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్లు తమ వార్డు పరిధిలో కొవిడ్‌ బాధితులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిత్యం వాకబు చేస్తే చివరి నిమిషంలో దవాఖానలపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, జిల్లా వైద్యాధికారి మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రజల మనిషి.. లింగన్న..: కడవరకూ పేదల అభ్యున్నతికి కృషి 

ప్రజల మనిషి రామలింగారెడ్డి అని, కడవరకూ పేదప్రజల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ఆయన అకాల మృతి దుబ్బాక నియోజకవర్గంతోపాటు సిద్దిపేట జిల్లాకు తీరనిలోటన్నారు. సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో శుక్ర వారం జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సర్వసభ్య సమావేశం సంతాప సూచకంగా రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, జడ్పీ సీఈవో శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo