ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 13, 2020 , 23:26:19

గజ్వేల్‌ పరిశుభ్రతకు పెద్దపీట

గజ్వేల్‌ పరిశుభ్రతకు పెద్దపీట

  • l మరో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్లు
  • l  పట్టణంలో ముమ్మరంగా యూజీడీ పనులు
  • l  హరిత పనులపై ప్రత్యేక దృష్టి

గజ్వేల్‌ : పట్టణాన్ని పరిశుభ్రతకు మారుపేరుగా నిలుపాలని సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు మున్సిపల్‌ పాలక వర్గం సభ్యులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. ఇప్పటికే పట్టణంలో రూ.100 కోట్ల వ్యయంతో అండర్‌ డ్రైనేజ్‌ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా.. మరోవైపు ప్రజలకు వివిధ రకాల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. గజ్వేల్‌ పట్టణంలో ఇప్పటికే జాతీయ స్థాయి సౌకర్యాలు సమకూరగా, ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తున్నారు. ఇందులో భాగం గా క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా గజ్వేల్‌ మారాలన్నది సీఎం లక్ష్యం. ఇందులో భాగంగా పట్టణంలో ఇప్పటికే పలుచోట్ల మరుగుదొడ్ల వసతి కల్పించారు. అలాగే, మరో మూడు ప్రాం తాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. సంగాపూర్‌ రోడ్డు పాత కూరకాయల మార్కెట్‌ సమీపంలో బయో టాయిలెట్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. బయోడిజాస్టర్‌ పద్ధ్దతిలో పనిచేసే బయో టాయిలెట్లు పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ముట్రాజ్‌పల్లి రోడ్డుకు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ సమీపంలో టాయిలెట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. 

రోడ్లపై కలుపు మొక్కల తొలిగింపు

పట్ణణంలోని అన్ని అంతర్గత రోడ్లతోపాటు రేడియల్‌ రోడ్లపై కలుపు మొక్కలతోపాటు చెత్తాచెదారం తొలిగింపు పనులు జరుగుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటగా.. అవి ఇప్పుడు ఏపుగా పెరిగి, ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు గజ్వేల్‌ను అన్ని సౌకర్యాలు ఉన్న అందమైన పట్టణంగా మార్చుతున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి పేర్కొంటున్నారు. మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో గజ్వేల్‌లో యూజీడీ పనులు పూర్తవుతాయని తెలిపారు. గజ్వేల్‌ పట్టణాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించడానికి సీఎం సిద్ధంగా ఉన్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ తెలిపారు.   


logo