శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 13, 2020 , 23:26:21

విస్తారంగా.. వానలు

విస్తారంగా.. వానలు

  • n బుధవారం రాత్రి  నుంచి కురుస్తున్న వర్షం
  • n రెండు రోజులుగా ముసురు 
  • n అలుగు పారుతున్న చెరువులు, కుంటలు
  • n పొంగిపొర్లుతున్న  వాగులు, వంకలు
  • n మెదక్‌లో 16.8, సిద్దిపేటలో 28,  సంగారెడ్డిలో 7.3  మిల్లీ మీటర్ల  వర్షపాతం
  • n హర్షం వ్యక్తం చేస్తున రైతాంగం

బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. చెక్‌డ్యాంలు మత్తడి దుంకుతున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులు  కళకళలాడుతున్నాయి. 

మెదక్‌/ సిద్దిపేట కలెక్టరేట్‌/ సంగారెడ్డి టౌన్‌ : జిల్లాలో రెండు రోజులుగా ముసురుతో వర్షం కురుస్తుండగా, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలకు నీరు చేరి చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వారం రోజులుగా మోస్తరుగా, అప్పుడప్పుడు భారీ వర్షాలు కురువడంతో చెరువుల్లో, కుంటల్లో నీరు చేరింది. వరణుడు కరుణిస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అలుగు పారుతున్న చెరువులు..

మెదక్‌ జిల్లాలో 2681 చెరువులుండగా, 90 చెరువులు అలుగు పారుతున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న బంగ్లా చెరువు, నాయకుని చెరువు, రామాయంపేటలో రెండు చెరువులు  ఆయా మండలాల్లో అనేక చెరువులు పూర్తిగా నిండిపోయి, మత్తళ్లు దుంకుతున్నాయి. అక్కడక్కడ పొలాల్లోకి నీరు చేరడంతో పంటలు దెబ్బతిన్నాయి. మెదక్‌ పట్టణంలోని రాందాస్‌ చౌరస్తాలో రోడ్లన్నీ జలమయయ్యాయి.

రెండు రోజులుగా ముసురు..

సిద్దిపేట జిల్లాలో రెండు రోజులుగా ముసురు కమ్ముకుంది. చిరుజల్లులతో పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. తొగుట మండలం వెంకట్‌రావుపేటకు చెందిన పాత్కుల నర్సింహులు ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మిరుదొడ్డిలోని కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చేర్యాల మండలంలోని చెరువులు నిండుకుండలా మారాయి.

సంగారెడ్డిలో విస్తారం..

సంగారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. న్యాల్‌కల్‌ మండలంలో పలుచోట్ల పంట పొలాల్లో వరద నీళ్లు నిలిచిపోయాయి. మినుము, పెసర పంటలు దెబ్బతినే అవకాశం ఉందని, కంది, పత్తి, చెరుకు, సోయాబీన్‌ పంటలకు మేలు జరుగుతుందని రైతులు తెలిపారు. కోహీర్‌ మండలంలోని గొటిగార్‌పల్లి పెద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా వర్షపు నీరు చేరుతున్నది. జహీరాబాద్‌లో ముసురు వాన కురవడంతో ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాలేదు. అల్లాదుర్గం మండలంలో నీళ్లు లేక ఆగిపోయిన వరినాట్లు పూర్తయ్యాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కలుపు తీయడం, మందు చల్లడం వంటి పనులు కొనసాగుతున్నాయి.

మెదక్‌లో 16.8 మి.మీ. వర్షపాతం..

మెదక్‌ : మెదక్‌ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 16.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నిజాంపేటలో 41.8 మి.మీ., మెదక్‌లో 37.5, నార్సింగిలో 34, చిన్నశంకరంపేటలో 33.3, చేగుంటలో 34.2, మనోహరాబాద్‌లో 15.4, తూప్రాన్‌లో 13.6, రామాయంపేటలో 14.9, హవేళిఘనపూర్‌లో 18.7, పాపన్నపేటలో 15.2, రేగోడ్‌లో 11.2, పెద్దశంకరంపేటలో 10.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.

సిద్దిపేటలో 28మి.మీ. వర్షపాతం..

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సరాసరిగా 28.0 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తొగుట మండలంలో 51.4 మి.మీ, అత్యల్పంగా ములుగులో 8.4 మి.మీ వర్షం కురిసింది. దుబ్బాకలో 26.3 మి.మీ, సిద్దిపేట రూరల్‌లో 37.5, చిన్నకోడూరులో 17, బెజ్జంకిలో 27.9, కోహెడలో 37.8, హుస్నాబాద్‌లో 33.8, అక్కన్నపేటలో 18.2, నంగునూరులో 24.5, సిద్దిపేట అర్బన్‌లో 34.8, మిరుదొడ్డిలో 32.4, దౌల్తాబాద్‌లో 30.9, రాయిపోల్‌లో 12.7, వర్గల్‌లో 20.6, మర్కూల్‌లో 17.8, జగదేవ్‌పూర్‌లో 21.4, గజ్వేల్‌లో 16.1, కొండపాకలో 45.3, కొమురవెల్లిలో 40.3, చేర్యాలలో 22.7, మద్దూరులో 34.1, నారాయణరావుపేటలో 34.3 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సంగారెడ్డిలో 7.3 మి.మీ. వర్షపాతం..

సంగారెడ్డి టౌన్‌ : సంగారెడ్డి జిల్లాలో గురువారం 7.3మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గుమ్మడిదల మండలంలో 18.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.  మరో 11మండలాల్లో సాధారణం కంటే అత్యధికంగా వర్షం పడింది. సిర్గాపూర్‌, కల్హేర్‌ మండలాల్లో 13.2 మి.మీ., నారాయణఖేడ్‌ మండలంలో 11.8, కంగ్టి మండలంలో 11.4, పటాన్‌చెరు, పుల్‌కల్‌ మండలాల్లో 9.2, జిన్నారం మండలంలో 8.4, నాగిల్‌గిద్ద, మనూర్‌, మొగుడంపల్లి మండలాల్లో 7.4, అందోల్‌ 7.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

సింగూరు ప్రాజెక్టు @ 2.240 టీఎంసీలు

పుల్కల్‌ :  సింగూరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. గురువారం ప్రాజెక్టులోకి 516 క్యూసెక్కుల నీరు చేరిందని జల వనరుల శాఖ ఏఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులోకి ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 2.125 టీఎంసీల నీరు చేరడంతో తాగునీటి కోసం మిషన్‌ భగీరథ పథకానికి ప్రతి రోజు 25 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో పూర్తి నీటి మట్టం 1717 అడుగులు కాగా, ప్రస్తుతం 1683 అడుగులు ( 2.240 టీఎంసీల)  నీరుంది. 


logo