మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 13, 2020 , 00:23:15

‘సార్‌' సేవలు చిరస్మరణీయం

‘సార్‌' సేవలు చిరస్మరణీయం

  • l సిద్దిపేట ప్రాంత విద్యాభివృద్ధిలో  పేర్ల వీరేశం సారు పాత్ర ఎనలేనిది
  • l కొండపాక అభివృద్ధికి విశేష కృషి
  • l ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన గురువు
  • l సామాజిక సేవలోనూ ముందున్న సార్‌

ఆయనకు వేలాది మంది శిష్యులు, ఎంతోమంది విద్యాభిమానులు. ఆ సార్‌ను చూడగానే శిష్యుల ప్రేమాభిమానాలు అంతా ఇంతా కాదు. 20 ఏండ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందినప్పటికీ, అదే భావనతో గురుభక్తి చాటుతారు. అలాంటి గొప్ప స్థానాన్ని పొందిన కొండపాక గ్రామానికి చెందిన పేర్ల వీరేశం సార్‌ ఎంతోమంది మదిలో నిలిచిపోయారు. విద్యాభివృద్ధితో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తేవడానికి ఆయన విశేషంగా కృషిచేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలో ఎంతోమంది విద్యార్థులకు ఆయన అండగా నిలిచి భవిష్యత్తుకు దారిచూపారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్‌ సైన్స్‌ అధ్యాపకునిగా పనిచేసి, ఎంతో మంది శిష్యుల ఉన్నతికి బాటలు వేశారు. ఇటీవల ఆయన కన్నుమూసి భౌతికంగా దూరమయ్యారు. కానీ, ఆయన శిష్యుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.  

కొండపాక : ఉపాధ్యాయుడిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచలంచెలుగా ఎదిగి, డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేసి 20 ఏండ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు పేర్ల వీరేశం సార్‌. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించడం,నిరంతరం వారి అభివృద్ధికి పరితపించడం ఆయనలోని ప్రత్యేకత. ఆయన వద్ద విద్యనభ్యసించిన వేలాది మంది విద్యార్థులు, ప్రస్తుతం వివిధ రంగాల్లో మంచి స్థానాల్లో స్థిరపడ్డారు. పేర్ల వీరేశం సార్‌ తాను పనిచేసిన ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థుల మన్ననలను పొందడంతో పాటు వారిలో పరివర్తన తీసుకురావడానికి విశేషంగా కృషిచేశారు. ఒకవైపు విద్యాభివృద్ధితో పాటు తన సొంత గ్రామం కొండపాకలో అభివృద్ధి కార్యక్రమాలకు విశేషంగా తోడ్పాటును అందించారు. 

విద్యార్థుల సంఘం ఏర్పాటులో ప్రధాన పాత్ర 

కొండపాకలో చదివిన పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటులో పేర్ల వీరేశం సార్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఈ పాఠశాలలో చదివినవారు దేశవిదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. వారందరినీ ఏకతాటిపైకి తేవడానికి ఆయన ఎంతో కృషిచేశారు. పూర్వ విద్యార్థుల సహకారంతో గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి పాటుపడ్డారు. గ్రామానికి సంబంధించిన పురాతన చరిత్రను వెలుగులోకి తేవడానికి కృషిచేశారు. ఏటా పూర్వ విద్యార్థులందరూ కలుసుకునేలా కృషి చేశారు. మూడేండ్ల క్రితం కొండపాక ప్రభుత్వ పాఠశాల స్వర్ణోత్సవాలు ఆయన సారథ్యంలోనే నిర్వహించారు.

రుద్రేశ్వరాలయ పునర్నిర్మాణంలో.. 

రుద్రేశ్వరాలయ పునర్నిర్మాణానికి పేర్ల వీరేశం సార్‌ కృషిచేశారు. వందల ఏండ్ల చరిత్ర కలిగిన రుద్రేశ్వరాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో, ఆలయ పునర్నిర్మాణం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది. 

‘హరిత భారతి’.. 

మొక్కలు నాటి వృక్ష సంపదను పెంపొందించడం కోసం పేర్ల వీరేశం సార్‌ ఇరవై ఏండ్ల క్రితమే ‘హరిత భారత్‌' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడు ఆయన ఆధ్వర్యంలో నాటిన మొక్కలు ఇప్పుడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆనాడు నాటిన మొక్కలు.. నేడు వృక్షాలుగా మారి ఎంతోమందికి నీడను,ఆహ్లాదాన్నిస్తున్నాయి.

పేద విద్యార్థుల కోసం.. 

పేద విద్యార్థులతో పాటు చదువులో వెనుకబడ్డ వారిని పేర్ల వీరేశం సార్‌ అండగా ఉండేవారు. విద్యార్థులు బడి మానేయకుండా నిరంతరం కృషిచేసేవారు. పేద విద్యార్థులను ప్రోత్సహించేవారు చదువులో వెనుకంజలో ఉన్నవారు, ఇంగ్ల్లిషు నేర్చుకునే వారి కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి, ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు.  

సామాజిక కార్యక్రమాలు ఎన్నో...

విద్యాభివృద్ధితో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కొండపాక గ్రామ అభివృద్ధికి పేర్ల వీరేశం సార్‌ ఎంతో కృషిచేశారు. నిరుపేదల ఇండ్ల నిర్మాణం కోసం తనవంతుగా సొంత స్థలాన్ని కేటాయించారు. ‘మిషన్‌ కాకతీయ’ ప్రారంభం సమయంలో ప్రభుత్వం చేస్తున్న ఓ మంచి కార్యక్రమానికి తనవంతుగా లక్ష రూపాయలను విరాళంగా మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. 


logo