ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 12, 2020 , 02:56:18

ఆర్థికంగా ఎదిగేందుకే రాష్ట్ర వ్యాప్తంగా 80 కోట్ల చేప పిల్లల పంపిణీ

ఆర్థికంగా ఎదిగేందుకే రాష్ట్ర వ్యాప్తంగా 80 కోట్ల చేప పిల్లల పంపిణీ

  • చేపలు దళారులకిచ్చి మోసపోవద్దు
  • జిల్లాలో 1596 చెరువుల్లో 5 కోట్ల చేప పిల్లలు
  • రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, రూ.16లక్షల నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని  ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

రామాయంపేట: మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకే తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందజేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామంలోని ఊర చెరువులో కోటి 76లక్షల చేప పిల్లలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి వదిలిపెట్టారు. అనంతరం రూ.16లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, రూ.30లక్షలతో సీసీ రోడ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. జిల్లావ్యాప్తంగా 1596 చెరువులకు గాను 5 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అందజేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 400 చెరువులకు 80కోట్ల చేపపిల్లలను అందజేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణలో నీలి విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. జిల్లాలోని హల్దీ, ఘణపురం చెరువుల్లో త్వరలో  చేప పిల్లలు, రోయ్యలను కూడా వదులుతామన్నారు. ప్రమాదవశాత్తు మత్స్యకారులు మృతి చెందితే  రూ.6లక్షల ఎక్స్‌గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు.  దళారులకు చేపలను ఇచ్చి మోసపోవద్దన్నారు. వలలు, టీవీఎస్‌ వాహనాలు, చేపలు తీసుకెళ్లేందుకు  వాహనాలను సబ్సిడీపై ఇస్తున్నామని పేర్కొన్నారు.

ప్రగతి ధర్మారం అభివృద్ధికి రూ.కోటి 64లక్షలు

ప్రగతి ధర్మారం అభివృద్ధికి రూ.కోటి 64లక్షలు  ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గ్రామానికి చెందిన సీఎం ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్‌ 191 జీవో ప్రకారం గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా ఈ నిధులను కేటాయించారన్నారు. ఆయా ప్రతులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి అందజేశామన్నారు. ఈ నిధులను గ్రామంలోని ఫంక్షన్‌ హాల్‌ ఇతర అభివృద్ధికి వినియోగించాలని తెలిపారు.

డాక్టరమ్మా కరోనా పరీక్షలు చేస్తున్నారా..

సమావేశానికి హాజరైన ప్రగతి ధర్మారం పీహెచ్‌సీ డాక్టర్‌ ఎలిజబెత్‌రాణిని మంత్రి హరీశ్‌రావు పలుకరించారు. డాక్టరమ్మా.... కరోనా పరీక్షలు చేస్తున్నారా... ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారా.... అంటూ పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతోనూ మంత్రి మాట్లాడారు. లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తనకేమీ కాదులే అనుకుంటూ పోతే రోగం ముదిరి ఇబ్బందులు పడుతారన్నారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, తహసీల్దార్‌ శేఖర్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి రాజ్‌నారాయణ, రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, జడ్పీటీసీ సంధ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా డైరెక్టర్‌, రామాయంపేట పురపాలక వైస్‌ చైర్‌పర్సన్‌ పుట్టి విజయలక్ష్మి, సర్పంచ్‌ బొడ్డు శంకర్‌, పీఏసీఎస్‌ రామాయంపేట చైర్మన్‌ బాదె చంద్రం తదితరులు పాల్గొన్నారు. 

రవాణా వ్యవస్థతో ఆర్థికాభివృద్ధి

మెదక్‌ అర్బన్‌/ పాపన్నపేట: మెదక్‌ జిల్లాలో రూ.112 కోట్లతో 170 కిలో మీటర్ల మేర 22 రోడ్లు మంజూరయ్యాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం హవేళిఘనపూర్‌ మండలంలోని సర్దన పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ముత్తాయిపల్లి వయా బూర్గుపల్లి  రోడ్డు వరకు రూ.3 కోట్ల 46.20 లక్షలతో ఎనిమిదిన్నర కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ రవాణా వ్యవస్థతో ప్రజల ఆర్థిక అభివృద్ధికి సంబంధాలు ఎంతగానో ముడిపడి ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పాపన్నపేట మండల కేంద్రం నుంచి కొల్చారం మండలం రంగంపేట వరకు రూ.5.50 కోట్లతో నిర్మిస్తున్న చేస్తున్న డబుల్‌రోడ్డు పనులకు, మెదక్‌ బొడ్మట్‌పల్లి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పాపన్నపేటలోకి రూ.57లక్షల రూర్బన్‌ నిధుల నుంచి ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతంర పాపన్నపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పాపన్నపేట బస్టాండ్‌ నుంచి గ్రామంలోకి సీసీ రోడ్డు పనులకు రూ.57లక్షలు మంజూరయ్యాయని వెల్లడించగా, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి జోక్యం చేసుకొని నిధులు సరిపోవని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి మరో రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, పీఆర్‌ఈఈ వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ పాపన్నపేట మండలాధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, జడ్పీటీసీ షర్మిల శ్రీనివాస్‌రెడ్డి, పాపన్నపేట సర్పంచ్‌ గురుమూర్తిగౌడ్‌, ఎంపీటీసీ శ్రీనివాస్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ గౌస్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు కుమ్మరి జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

మధనానంద ఆశ్రమంలో ప్రత్యేక పూజలు

కొల్చారం: మండలంలోని రంగంపేట శివారులోని మంజీరా నది తీరంలోని మధనానంద ఆశ్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డిలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాధవానంద సరస్వతీ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మాధవానంద సరస్వతీస్వామి సోదరుడు రఘురామశర్మ కుమారుడి వివాహం ఇటీవల జరిగింది. మంత్రి ఈ వివాహానికి హాజరు కాకపోవడంతో మంగళవారం ఆశ్రమానికి వచ్చిన వారు వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో రంగంపేట, తుక్కాపూర్‌ సర్పంచ్‌లు బండి సుజాత రమేశ్‌, మాధవి శ్రీశైలం, కౌడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్‌ వై.మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గౌరీశంకర్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ సత్తార్‌, డీసీఎంఎస్‌ ఉపాధ్యక్షుడు అరిగె రమేశ్‌, తుక్కాపూర్‌ ఆంజనేయిలు, ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ తలారి దుర్గేశ్‌, నాయకులు రవితేజరెడ్డి, దుర్గేశ్‌గౌడ్‌, సత్యాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. logo