గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 10, 2020 , 23:33:17

స్కూళ్లు, కాలేజీల్లో డిజిటల్‌ బోధన

స్కూళ్లు, కాలేజీల్లో డిజిటల్‌ బోధన

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు తమ విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకున్నది. విద్యా బోధనలో మార్పులు చేసి, విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు బోధించాలని నిర్ణయించింది. విద్యాసంవత్సరం ఇప్పటికే మూడు నెలలు నష్టపోయింది. ఇంకా ఇలాగే కొనసాగితే విద్యార్థులు నష్టపోతారని, అందుకు గానూ రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, పాఠశాలల్లో డిజిటల్‌ విద్యను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని మంత్రి వర్గ సమావేశం తీర్మానించింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే, అమలు కానున్నది.

సంగారెడ్డి టౌన్‌ :  రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు తమ విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకున్నది. విద్యా బోధనలో మార్పులు చేసి, విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు బోధించాలని నిర్ణయించింది. విద్యాసంవత్సరం ఇప్పటికే మూడు నెలలు నష్టపోయింది. ఇంకా ఇలాగే కొనసాగితే విద్యార్థులు విద్యలో నష్టపోతారని, అందుకు గాను రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, పాఠశాలల్లో డిజిటల్‌ విద్యను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని మంత్రి వర్గ సమావేశం బుధవారం తీర్మానించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ విద్యాబోధనకు టీశాట్‌, యాదగిరి చానళ్ల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డిజిటల్‌ విద్యాబోధనను ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లాలో 1263 పాఠశాలలు, 20 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇప్పటికే పదో తరగతిలో విద్యార్థులకు కలెక్టర్‌ హనుమంతరావు నేతృత్వంలో వెయ్యి మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నారు. అలాగే, ఇంటర్‌ బోర్డు అధికారులు తమ లెక్చరర్లకు ఆన్‌లైన్‌ విద్యావిధానంపై రెండు విడుతలుగా శిక్షణను ఇచ్చారు. 2020-21 విద్యాసంవత్సరం నష్టపోకుండా ఆన్‌లైన్‌ డిజిటల్‌ పాఠాలను బోధించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యామ్నాయ క్యాలెండర్‌ రూపకల్పన చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. 

జిల్లాలో డిజిటల్‌ బోధన ప్రారంభం..

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో అక్షరమాల పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ ఫాం పైలెట్‌ స్టడీ ప్రాజెక్టు కార్యక్రమం ద్వారా పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యా బోధన ప్రారంభించారు. కలెక్టర్‌ హనుమంతరావు ఆధ్వర్యంలో అక్షరధాన్‌ సంస్థ డిజిటల్‌ ప్లాట్‌ ఫాం కార్యక్రమాన్ని తయారు చేశారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన అన్ని సబ్జెక్టులను ఆన్‌లైన్‌ ద్వారా బోధిస్తున్నారు. విద్యార్థులు స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించారు. ప్రతి విద్యార్థికి ముందుగానే యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ ఇచ్చారు. విద్యార్థులకు సమయాన్ని నిర్దేశించి పాఠాలు బోధిస్తున్నారు. కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశాలతో జిల్లాలో మొదటగా నాలుగు మండలాల్లోని పదో తరగతి విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారు. నాలుగు మండలాల్లోని వెయ్యి మంది విద్యార్థులకు ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ ద్వారా అక్షరమాల లర్నింగ్‌ సౌకర్యం కల్పించారు. పదో తరగతి విద్యార్థులను ఎంపిక చేయడమే కాకుండా వారికి ఇప్పటికే యూజర్‌ ఐడీ, పాస్‌ వార్డు కేటాయించారు. 

జిల్లాలో నాలుగు మండలాలు ఎంపిక..

విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధించేందుకు అక్షరమాల డిజిటల్‌ ప్లాట్‌ ఫాం పైలెట్‌ స్టడీ ప్రాజెక్టు కింద నాలుగు మండలాలు ఎంపిక చేశారు. జిల్లాలోని మునిపల్లి, సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్‌ మండలాల్లో మొదటగా ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. నాలుగు మండలాల్లో వెయ్యి మంది పదో తరగతి విద్యార్థులకు అక్షరమాల ఆన్‌లైన్‌ లర్నింగ్‌ ప్రాజెక్టులో ప్రవేశం కల్పించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పదో తరగతికి సంబంధించిన పాఠ్యాంశంతో పాటు ఇతర సమాచారం కూడా పొందుపర్చారు. ప్రతి రోజు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించడంతో పాటు సమయాన్ని కేటాయించారు. సమయం ప్రకారం విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను బోధిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో డిజిటల్‌ పాఠాలు బోధించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

జిల్లాలో 20 ప్రభుత్వ కళాశాలలు..

జిల్లాలో 20 ప్రభుత్వ కళాశాలలున్నాయి. విద్యార్థులకు అన్ని సబెక్టుల్లో విద్యా బోధనను ఆన్‌లైన్‌ ద్వారా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కళాశాలల్లో మొదటగా వొకేషనల్‌ లెక్చరర్లకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వారితో విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు బోధించేలా తర్ఫీదు ఇచ్చారు. అలాగే, జనరల్‌ కేటగిరి విద్యార్థులకు కూడా డిజిటల్‌ పాఠాలు బోధించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులను ఇవ్వనుండడంతో వారికి కూడా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ విద్యా బోధనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికారులు డిజిటల్‌ విద్యాభోదనపై దృష్టి సారించారు.
logo