శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 09, 2020 , 23:47:28

జీవాలు ప‌దిల‌మేనా

జీవాలు ప‌దిల‌మేనా

వ్యవసాయంతో పాటు పశు పోషణ, పాడి పరిశ్రమ రంగం రోజురోజుకూ విస్తరిస్తున్నది. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశమున్నది. జీవనాధారాలైన మూగజీవాలు అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలి. ఇందుకోసం ముందు జాగ్రత్తలు ఎంతో అవసరం. సకాలంలో జాగ్రత్తలు పాటిస్తే పశువులకు సోకే వ్యాధులను నివారించవచ్చు.. వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి. పశువులకు రకరకాల వ్యాధులు సోకుతుంటాయి. తద్వారా పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గడం, దుక్కిదున్నే పశువులు పని సామర్థ్యం కోల్పోవడం, పడ్డలు, పెయ్యలు, ఎదకు రాకపోవడం, చనిపోయే ప్రమాదాలు కూడా లేకపోలేదు. వానకాలంలో పశువులకు సోకే వివిధ వ్యాధులు, వాటి నివారణకు తీసుకునే జాగ్రత్తలను తెలుసుకుందాం...

కురంవ్యాధి (ఎపిమెరల్‌ ఫీవర్‌)

వర్షాకాలంలో తరచూ వచ్చే వ్యాధుల్లో ఈవ్యాధి ఒకటి. ఈ వ్యాధి సోకడం వల్ల అధిక జ్వరం, కండరాల వణుకు, కాళ్లనొప్పితో పశువులు బాధపడుతుంటాయి. ఇలా బాధపడే పశువులకు ‘కురం వ్యాధి’ సోకిందని గ్రహించాలి. రెబ్డో వైరస్‌ ద్వారా దేశీ, విదేశీ జాతి పశువులన్నింటిలో ఈ వ్యాధి సోకుతుంది. ఈగలు, దోమల కాటు ద్వారా పశువుల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో ఈగలు, దోమల బెడద ఎక్కువగా ఉన్నందున కురం వ్యాధి తరుచూ కన్పిస్తోంది. ఈ వ్యాధి వల్ల పశువుల్లో మరణాలు తక్కువే అయినప్పటికీ వ్యాధి సోకిన దుక్కిదున్నే పశువులు పని చేయలేవు. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గుతుంది. పశువుల్ని ఈగలు, దోమలు కాటు వేసిన  తర్వాత లక్షణాలు 2-10 రోజుల్లో కనపడుతాయి. వ్యాధిని కలిగించే వైరస్‌ పశువు రక్తంలో అభివృద్ధి చెంది కాళ్లు, కండరాలు, వినాల గ్రంథులకు వ్యాపిస్తుంది. పశువులు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, అధిక జ్వరం కలిగి ఉంటాయి. బలవంతంగా పశువుల్ని లేపినా నొప్పి వల్ల అతి కష్టంగా నడుస్తాయి. నొప్పి ఒక కాలు నుంచి మరో కాలికి గంటల వ్యవధిలో మారుతుంది. వ్యాధి గ్రస్థ పశువులు ఆకలి కోల్పోతాయి. మేత తినవు, నెమరు వేయవు, నీరసంగా ఉంటాయి. ముక్కు నుంచి స్రవాలు, నోటి నుంచి చొంగ, కళ్లనుంచి నీరు కారుతుంది. మెడ, కండరాలు గట్టిగా ఉంటాయి. ఈ సమయంలో బలవంతంగా మందులు తాగిస్తే, న్యూమోనియాతో 2-3 శాతం  పశువులు మృతి చెందే ప్రమాదమున్నది. 

దొమ్మవ్యాధి (ఆంత్రాక్స్‌)..

పశువుల్లో ప్రమాదకరమైన వ్యాధి దొమ్మవ్యాధి. ఈవ్యాధి సోకడంతో అధిక సంఖ్యలో పశువులు మృతి చెందుతాయి. బాసిల్లస్‌ ఆంధ్రాసిన్‌ అనే బాక్టీరియా సూక్ష్మజీవుల ద్వారా సోకుతుంది. పశువుల నుంచి మనుషులకు కూడా వ్యాపిస్తుంది. మనుషుల్లో సోకే దొమ్మవ్యాధిని “మలిగ్పంట్‌ ఫివర్‌” అంటారు. దొమ్మవ్యాధి ఎక్కువగా వాతావరణ ఉష్ణోగ్రత 60 డిగ్రీల ఫారన్‌పై బడిన వెచ్చని వాతావరణ పరిస్థితుల్లో, ఉష్ణమండల ప్రాంతాల్లో సోకుతుంది. వర్షాకాలం తరువాత కొద్దిరోజులకు వ్యాధి సోకే అవకాశమున్నది. ప్రపంచం అంతా విస్తరించి ఉన్న ఈవ్యాధి మన రాష్ట్రంలో, ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో కనపడుతుంది. దొమ్మ వ్యాధి పశువులు, గొర్రెల్లో ఎక్కువగానూ, గుర్రాలు, మేకల్లో తక్కువగానూ సోకుతుంది. ఎక్కువగా తోళ్లు, ఉన్ని, ఎముకలు, మొదలగు పశు ఉత్పత్తులతో వ్యాపారం చేసే వ్యక్తులకు, కళేబరాల్ని కోసే వారికి సోకుతుంది. ఇవే కాకుండా ఇతర వ్యాధులు వర్షాకాలంలో ఎక్కువగా సోకే అవకాశం ఉంది. పశుపోషకులు, పాడిపరిశ్రమ నిర్వాహకులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నది.
చికిత్స: వ్యాధి లక్షణాలను  బట్టి చికిత్స చేయించాలి. యాంటి పైరెటిక్స్‌, అనాల్జెసిక్స్‌, కాల్షియం, యాంటీ బయోటిక్స్‌ మొదలగునవి వాడాలి. వ్యాధి ఒక ప్రాంతంలో పశువులకు ఎంత త్వరగా  ప్రారంభమై వేగంగా వ్యాపిస్తుందో, అంత త్వరగా కొన్ని వారాల్లో పశువులు కోలుకుంటాయి. వ్యాధి నివారణకు వర్షాకాలంలో ఈగలు, దోమల్ని నిర్మూలించాలి. మురుగు నీరు నిల్వ ఉండకుండా, పాకల్లో రొచ్చు, చెత్తా చెదారం చేరకుండా, పాకలు పొడిగా ఉండేలా జాగ్రత్తపడాలి. పశువుల్ని ప్రతిరోజు గ్రూమింగ్‌ చేస్తుండాలి. పశువుల కొట్టాల వద్ద రాత్రి వేళల్లో వేపాకు కాల్చడం వల్ల  ఈగలు, దోమల బెడద తగ్గుతుంది. వ్యాధులతో నీరస పడిన పశువులకు తేలికగా జీర్ణమయ్యే పశు గ్రాసాల్ని, సమీకృత దాణాను ఇవ్వాలి. 

గొంతు వాపు వ్యాధి(హెచ్‌.ఎస్‌)

వర్షాకాలంలో  పశువులకు సోకే వ్యాధుల్లో “గొంతు వాపు” ప్రధానమైనది. దీనినే గురక వ్యాధి, కంఠమడ అని కూడా పిలుస్తారు. జూన్‌ నుంచి సెప్టెంబరు మాసాల్లో ఇది ఎక్కువగా సోకుతుంది. గాలికుంటు వ్యాధి ప్రబలిన గ్రామాల్లో గొంతువాపు కూడా ఎక్కువగా సోకుతుంది. దీనికి ముఖ్య కారణం ఆయా గ్రామాల్లో పశువుల్లో వ్యాధి ప్రబలడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడమే. గడిచిన 4 దశాబ్దాల కాలంలో సంభవించిన మరణాలు 46-55శాతం గొంతువాపు వ్యాధి వల్ల సంభవించినవే. గొంతువాపు సోకిన పశువుల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగ కారుతుంది. గొంతు, మెడ వాస్తాయి. శ్వాస కష్టమై, గురక శబ్దంతో 24 గంటల్లో  పశువు మృతి చెందుతుంది. వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా వీలైనంత త్వరగా చేయాలి. సాధారణంగా రక్త పరీక్షల ద్వారా వ్యాధి కారక బైపోలార్‌ బాక్టీరియా గుర్తించి వ్యాధి నిర్ధారిస్తున్నారు. పశువు శారీరక ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సేకరించిన రక్తంలోనే బాక్టీరియా కనిపిస్తుంది. దీనిని వేరు చేసి, గుర్తించడం తేలికైన పనేమికాదు మూలగతో సహా పశువు ఎముకను ఐస్‌లో ఉంచి పరీక్షకు పంపితే 3 రోజుల్లో వ్యాధి నిర్దారణ సాధ్యమవుతోంది.

చికిత్స.. 

ఇటీవల ఎన్నో కొత్త మందులు, యాంటి బయోటిక్స్‌ లభిస్తున్నాయి. సల్ఫాడిమిన్‌, ఇంటాసెఫ్‌ టాజు, ఎక్సెప్ట్‌ మొదలగు ఇంజక్షన్లు బాగా పనిచేస్తాయి. వ్యాధి తీవ్రతను బట్టి పశువైద్యుల సలహాలు వాడాలి.

నివారణ..

ప్రతి ఏడాది గొంతువాపు సోకే ప్రాంతాల్లో తొలకరిలోనే ముందు జాగ్రత్తగా పశులన్నింటికీ టీకాలు వేయిస్తే 7-10 రోజుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది 6-12 మాసాల పాటు వ్యాధిరాకుండా ఉంటుంది. గ్రామాల్లో పశువులు మరణిస్తున్న సందర్భాల్లో టీకాలు వేయకూడదు. తప్పనిసరి వేయించాల్సి వస్తే ఆరోగ్యమైన పశువులకు టీకాలు వేసి, బూస్టర్‌ డోస్‌ తప్పక చేయాలి.  నివారణగా సల్ఫాడిమిన్‌ ఇంజక్షన్‌ వాడాలి. గొంతువాపు త్వరగా వ్యాపించే అంటు వ్యాధి. ఈ వ్యాధి సోకిన పశువుల్ని విడిగా ఉంచాలి. మరణించిన పశుకళేబరాన్ని, అవి తినగా మిగిల్చిన గడ్డిని నీటి ప్రవాహాల్లో, బీళ్లలో పడేయకుండా లోతైన గొయ్యి తీసి పాతి పెట్టాలి. చలిగాలులు, అధిక వర్షాలు, చాలా దూరం ప్రయాణించినప్పుడు పశువుల శారీరక, మానసిక ఒత్తిళ్లకు లోనై వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. తద్వారా త్వరగా వ్యాధి బారిన పడుతాయి. అందువల్ల సక్రమ యాజమాన్య పద్ధతులను ఆచరిస్తూ పోషకాలతో కూడిన పశుగ్రాసాన్ని అందించాలి. 

వానకాలంలో అప్రమత్తంగా ఉండాలి...

జిల్లాలో ఆవులు 1,26,615, గేదెలు 1,77,912, గొర్రెలు 8,01,259, మేకలు 1,83,442 ఉన్నాయి. వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. వ్యాధులు సోకిన వెంటనే పశువైద్యులను సంప్రదించి వైద్యం చేయించాలి. అప్రమత్తంగా వ్యవహరించకపోతే పశువులకు నష్టం వాటిల్లే ప్రమాదమున్నది. సకాలంలో పశువులకు, గొర్రెలకు టీకాలు వేయించాలి. ముఖ్యంగా పశువులను శుభ్రమైన వాతావరణంలో ఉంచాలి. పోషక విలువలు కలిగిన పశుగ్రాసం అందివ్వాలి.   
- డా.సత్యప్రసాద్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి


logo