ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 08, 2020 , 23:40:37

నిరాడంబరతకు నిలువుటద్దం

నిరాడంబరతకు నిలువుటద్దం

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: అనారోగ్యంతో శనివారం హైదరాబాద్‌లో మృతిచెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, సిద్దిపేట మాజీ ఎంపీ నంది ఎల్లయ్యకు ఉమ్మడి మెదక్‌ జిల్లాతో అనుబంధం ఉంది. ఈయన సిద్దిపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. మెట్రిక్యులేషన్‌ వరకు చదువుకున్న ఆయన, వివాదాలకు దూరంగా ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు. అందరితో కలుపుగొలుపుగా ఉండి, కాంగ్రెస్‌ పార్టీలో వివిధ పదవులను నిర్వర్తించారు. 

రాజకీయ ప్రస్థానం.. 

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య ఆరుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈయన అత్యధికంగా ఐదుసార్లు సిద్దిపేట పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1977లో తొలిసారిగా (ఎస్సీ రిజర్వుడ్‌) సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. అప్పట్లో సిద్దిపేట ఎంపీగా పనిచేసిన జి.వెంకటస్వామి శాసనమండలికి వెళ్లడంతో సిద్దిపేట లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి నంది ఎల్లయ్యను కాంగ్రెస్‌ పార్టీ బరిలోకి దింపింది. మంచి మెజార్టీతో విజయం సాధించారు. అక్కడి నుంచి ఆయన వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. సిద్దిపేట లోక్‌సభ పరిధిలోకి సిద్దిపేట, గజ్వేల్‌, నర్సాపూర్‌, దొమ్మాట (దుబ్బాక), రామాయంపేట, మేడ్చల్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభా స్థానాలు వచ్చేవి. సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి మొదటిసారిగా నంది ఎల్లయ్య 1977-80లో ఎన్నికయ్యారు. అక్కడి నుంచి వరుసగా రెండోసారి 1980- 84, (1984-89లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయరామారావు విజయం సాధించారు.) మూడోసారి 1989-91, నాలుగో సారి 1991-96, ఐదోసారి 1996- 98 వరకు సిద్దిపేట లోక్‌సభా స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014 నుంచి 2019 వరకు నాగర్‌కర్నూల్‌ నుంచి నంది ఎల్లయ్య ప్రాతినిధ్యం వహించారు. లోక్‌సభా స్థానాల పునర్విభజనలో భాగంగా సిద్దిపేట లోక్‌సభ స్థానం 2008లో రద్దు అయ్యింది. 

సిద్దిపేట ప్రాంత అభివృద్ధికి కృషి..

సిద్దిపేట లోక్‌సభ స్థానం ప్రజలు నంది ఎల్లయ్యను ఐదుసార్లు పార్లమెంట్‌కు పంపారు. దీంతో ఈ ప్రాంతానికి ఎంతోకొంత అభివృద్ధి చేసి పెట్టాలనే తపనతో ఆయన ముందుకు వెళ్లేవారు. అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో కలిసి పలు అభివృద్ధి పనుల్లో పాలుపంచుకున్నారు. కేంద్రప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి వెచ్చించారు. ప్రధానంగా సిద్దిపేటలో టీవీ రిలే కేంద్రం, మాతాశిశు సంక్షేమ కేంద్రం, గ్రామాల్లో బస్‌షెల్టర్లు, ప్రధాన పట్టణాల్లో టెలిఫోన్‌ ఎక్చేంజ్‌లు, గ్రామాల్లో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ సౌకర్యం కల్పించారు. పలు అభివృద్ధి పనులు చేపట్టడంలో తనవంతు పాత్ర పోషించారు. నిరాడంబర వ్యక్తిత్వం, సౌమ్యునిగా, అందరితో కలుపుకొని పోయే వ్యక్తిగా ఆయనకు పేరుంది.  

మంత్రి హరీశ్‌రావు సంతాపం... 

సిద్దిపేట మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతిపట్ల మంత్రి హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. నంది ఎల్లయ్య పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్న సమయంలో ఆయనతో కలిసి పనిచేసిన అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి  గుర్తుచేసుకున్నారు. 6 సార్లు ఎంపీగా, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన నంది ఎల్లయ్య రాజకీయాల్లో నిరాడంబరతను చాటుకున్నారని, మంచి మనసున్న వ్యక్తిత్వం గల వారని, ఆయన చేసిన సేవలను కొనియాడారు. వారి  ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

 కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు : దరిపల్లి చంద్రం 

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య అకాల మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు దరిపల్లి చంద్రం అన్నారు. సిద్దిపేట పార్లమెంట్‌ పరిధిలో అన్ని విధాలా అభివృద్ధి చేశారన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి నంది ఎల్లయ్య మరణం తీరని లోటన్నారు. ఈ సందర్భంగా నంది ఎల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో చిన్నకోడూరు మం డల అధ్యక్షుడు మిట్టపల్లి గణేశ్‌, నాయకులు ఉమేశ్‌, రాజేశ్‌, అత్తు, వంగరి నాగరాజు తదితరులు ఉన్నారు. 

టీఎన్జీవోల సంతాపం ..

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి పట్ల టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్‌, కార్యదర్శి కోమాండ్ల విక్రమ్‌రెడ్డిలు సంతాపం వెలిబుచ్చారు. రాజకీయాల్లో నిస్వార్థపరునిగా, నిరాడంబరునిగా నంది ఎల్లయ్య పేరు తెచ్చుకున్నారన్నారు. ప్రజల మనిషిగా సిద్దిపేట ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

నంది ఎల్లయ్య మరణం బాధాకరం.. 

సిద్దిపేట మాజీ పార్లమెంట్‌ సభ్యులు నంది ఎల్లయ్య మరణం బాధాకరమని కాంగ్రెస్‌ నాయకులు వంగ హన్మంత్‌రెడ్డి, శివప్ప, ప్రభాకర్‌వర్మ, బొమ్మల యాదగిరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల వారు సంతాపాన్ని ప్రకటించారు. సిద్దిపేట నుంచి 8 సార్లు పోటీచేసి, 5 సార్లు గెలుపొందిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కరీమొద్దీన్‌, వహీద్‌ఖాన్‌, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. 

1967లో సిద్దిపేట లోక్‌సభ స్థానం ఏర్పాటు..

సిద్దిపేట లోక్‌సభ నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది.అంతకు ముందు మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉండేది.1967లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట, దొమ్మాట, గజ్వేల్‌, రామాయంపేట, నర్సాపూర్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ స్థానాలతో కలిపి సిద్దిపేట లోక్‌సభ స్థానం 1967లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఈ స్థానానికి ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ మూడు సార్లు, టీడీపీ ఒకసారి, తెలంగాణ ప్రజాసమితి పార్టీలకు ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. తొలుత 1967లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా జి.వెంకటస్వామి గెలుపొందారు. 1969లో తెలంగాణ ప్రజాసమితి ఉవ్వెత్తున ఎగిసి పడిం ది. అదే సమయంలో వెంకటస్వామి పార్ట్టీలో చేరారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి పార్టీ తరపున ఆయన పోటీచేసి విజయం సాధించారు. తర్వాత కొన్నాళ్లకు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి మొదటి సారిగా నంది ఎల్లయ్య 1977-80 నుంచి (1984-89 మినహా )వరుసగా 1996- 98 వరకు ప్రాతినిధ్యం వహించారు. 2009 లోక్‌సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పుర్విభజన జరగడంతో సిద్దిపేట లోక్‌సభ స్థానం మారిపోయింది. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి కేపీఆర్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.logo