ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 08, 2020 , 23:29:10

బ్లాక్‌ రైస్‌, దేశీరకాల వరిసాగు

బ్లాక్‌ రైస్‌, దేశీరకాల వరిసాగు

కన్న తండ్రిని క్యాన్సర్‌ వ్యాధి కబలించడం ఆయనను కలిచివేసింది. విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడి పండించిన పంట ఉత్పత్త్తులతో ప్రజారోగ్యానికి హాని జరుగుతోందని ఆవేదన చెందాడు. దీనికి పరిష్కారం ప్రకృతి సాగు అని నమ్మి, వ్యవసాయంలో ఆ దిశగా తను ‘కృషి’ చేస్తున్నాడు  సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురికి చెందిన రైతు తిరుపతి. తన మూడెకరాల భూమిలో దేశీ రకానికి చెందిన కాలాబట్టి, చిట్టి ముత్యాలు, చింతలూరు సన్నం, దశుమతి రకం వరి రకాలతో ప్రకృతి సేద్యం చేస్తున్నాడు. సొంతంగా జీవామృతాన్ని తయారుచేసి 15 రోజులకు ఒక పర్యాయం పంటకు చల్లి మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరో 50 మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు.  బ్లాక్‌ రైస్‌ వంటి పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని రైతు తిరుపతి తెలిపారు.

వ్యవసాయంలో విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వాడకంతో అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేసేవారి సంఖ్య రానురాను పెరుగుతున్నది. ఇష్టారాజ్యంగా రసాయనిక వాడకంతో భూమి సారవంతం కోల్పోతున్నది. ఇదే పద్ధ్దతిలో వ్యవసాయం కొనసాగిస్తే భూములు చౌడుబారి పోవడం ఖాయమని నమ్మి, దీనికి పరిష్కారంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు సిద్దిపేట జిల్లా నాగపురి గ్రామానికి చెందిన రైతు జక్కుల తిరుపతి. - చేర్యాల

టాన్‌బో ఆర్ట్‌లో వారి పేర్లు...

వరిసాగులో బాక్ల్‌ సీడ్స్‌తో బొమ్మలు వేయడం, పేర్లు రాయడాన్ని టాన్‌బో ఆర్ట్‌ అంటారు. ఈ ఆర్ట్‌ ఎక్కువగా జపాన్‌ దేశంలో కొనసాగుతున్నది. భారత దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రైతు తిరుపతి నాగపురిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల పేర్లను వరి పంటలోబ్లాక్‌ సీడ్స్‌తో రాసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

ప్రజారోగ్యం కోరి ...

రైతు జక్కుల తిరుపతి తండ్రి రాజయ్య రెండేండ్ల క్రితం క్యాన్సర్‌ వ్యాధితో మృతిచెందాడు. రసాయన మందులతో తయారుచేసిన బియ్యం తినడంతో ప్రజలు క్యాన్సర్‌, మోకాళ్ల నొప్పులు, షుగర్‌ తదితర వ్యాధులు బారిన పడుతున్నాయని నిర్ధారణకు వచ్చిన తిరుపతి, వాటిని నివారించాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలో ‘భారత్‌ బీజ్‌ స్వరాజ్‌' అనే సంస్థ వద్ద దేశీ రకానికి చెందిన కాలాబట్టి, చిట్టి ముత్యాలు, చింతలూరు సన్నం, దశుమతి రకం తదితర విత్తనాలను సేకరించాడు. మొదటగా తన బంధువుల వద్ద సాగు చేయడం ప్రారంభించారు.అనంతరం స్వగ్రామమైన నాగపురిలో ఈ ఏడాది తనకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో దేశీ రకానికి చెందిన కాలాబట్టి, చిట్టి ముత్యాలు,చింతలూరు సన్నం తదితర వరిసాగును ప్రారంభించారు. ఆయన సాగు చేయడాన్ని గమనించిన మరో 10 మంది రైతులు, ఇదే తరహాలో వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు,సూచనల మేరకు తెలంగాణ సోనాతో పాటు కంది సాగును శ్రీవరి పద్ధ్దతిలో సాగుచేస్తున్నాడు.బాక్ల్‌ రైస్‌ తదితర వాటిని సాగుచేసిన పొలంలో సొంతంగా తయారుచేసిన జీవామృతాన్ని 15 రోజులకు ఒక పర్యాయం చల్లితే, పంటకు సరిపడా మిత్ర సూక్ష్మజీవులు వృద్ధిచెంది పంటల దిగుబడి పెరుగుతుందని రైతు తిరుపతి తెలిపారు.

ఆర్గానిక్‌ సాగే లక్ష్యం.. 

నాగపురిని ఆర్గానిక్‌ పంటల గ్రామంగా తయారు చేయడమే నా ముందున్న లక్ష్యం. పౌష్టికాహారం తీసుకుంటే రోగాలు దరిచేరవు. అనేక ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్‌ ఎక్కువగా ఉన్న వరి వంగడాలను సాగుచేసి, వాటినే ఆహారంగా భుజిస్తే బాగుంటుంది.అందుకోసం అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావాలి. ముందుకు వచ్చే రైతుల కోసం నావంతుగా సహాయ సహకారాలు అందిస్తా. వివరాలకు 90002 69724 నా నంబర్‌లో నన్ను సంప్రదించవచ్చు.

అనేక ప్రయోజనాలు... 

ఆవుపేడ, మూత్రం, బెల్లం, శనగపిండి, మట్టి తదితర వాటితో తయారు చేసిన జీవామృతంతో సాగుచేస్తున్న బ్లాక్‌ రైస్‌(నల్ల బియ్యం)లో పుష్కలంగా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో బీ6, బీ12, ఈ విటమిన్లతో పాటు క్యాన్సర్‌, మోకాళ్ల నొప్పులు తగ్గించే ఫైబర్‌ సైతం అధిక శాతం ఉంటుంది. షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. శరీరంలో ఇన్సులిన్స్‌ లెవల్స్‌ను కంట్రోలు చేయడం ద్వారా ఉభకాయ సమస్య రాకుండా కాపాడుతుంది. ఈ బియ్యంలో ఉండే ఆంథోనియాసిన్స్‌ మహిళల్లో వచ్చే క్యాన్సర్ల బారి నుంచి కాపాడుతుంది. ఈ బియ్యం గంజిని తలకు పట్టిస్తే వెంట్రుకలు బలంగా, అందంగా తయారవుతాయని, ఈ గంజిని ముఖానికి తరుచుగా వాడుకుంటే మచ్చలు, మొటిమలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం, కంటి, గుండె సమస్యల పరిష్కారంలో నల్లబియ్యం బాగా పనిచేస్తాయని పౌష్టికాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. నల్ల బియ్యం తిన్న వారికి పెద్దపేగులో ఉన్న సమస్య తొలగిపోవడంతో పాటు సగటున మనిషికి కావాల్సిన కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం అందించడంతో పాటు ైగ్లెమిక్స్‌ ఇండెక్స్‌ నల్లబియ్యంలో తక్కువగా ఉండడంతో షుగర్‌ను నిరోధిస్తుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన 50 మంది రైతులు తిరుపతిని కలవడంతో, వారికి ఉచితంగా విత్తనాలు అందించాడు.తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి ఇచ్చే ఈ వంగడాలను రైతులు సాగు చేయడం ద్వారా మానవుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు భూసారం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చన్నారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు నల్లబియ్యం, చిట్టి ముత్యాల బియ్యాన్ని తినడం ద్వారా రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక ఎలాంటి రోగాలు లేని వారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సోనామసూరి, బీపీటీలకు బదులుగా, చింతలూరు సన్నం బియ్యంతో వండిన అన్నం తింటే ఎంతో ప్రయోజనం ఉంటుందని రైతు తిరుపతి అంటున్నారు.logo