మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 08, 2020 , 23:11:30

కలిసి కట్టుగా కరోనాను ఎదుర్కొందాం

కలిసి కట్టుగా కరోనాను ఎదుర్కొందాం

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: కరోనా రోగులకు మానసికంగా.. వైద్య పరమైన భరోసాను ఇవ్వాలి. కరోనా వ్యాధి వ్యాప్తిని అరికడుదాం. ఇందుకోసం జిల్లా వైద్య శాఖ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలిసి సమష్టి బాధ్యతతో పనిచేద్దామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిక యం త్రాంగం, జిల్లా ప్రజాప్రతినిధులకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దిశా నిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసం నుంచి  శనివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దవాఖానలో వంద, ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎంలో వంద పడకల దవాఖానల్లో కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కరోనా రోగిని నవ్వుతూ పలుకరించాలని, వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలని సూచిస్తూ, వైద్యుడంటే దేవుడితో సమానమని,, ఓపిక, సహనం, మానవత్వం, ప్రేమను చాటిచెప్పే సమయమిదన్నారు.  వైద్య వృత్తి గొప్పతనాన్ని చాటి చెప్పాలని వైద్య బృందానికి మంత్రి హితబోధ చేశారు. జిల్లాలోని రెండు దవాఖానల్లో కరోనా రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్య బృందంలో సమన్వయలోపం రాకుండా, ప్రతి రోజు రోగికి ఉదయం, సాయంత్రం రౌండ్స్‌ వేసి రోగులను కావాల్సిన  బాధ్యత ఉన్నదని గుర్తుచేశారు. ప్రతిరోజు 4 సార్లు ఫోన్‌ కాల్‌ చేసి మాట్లాడాలని ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలకు, మెడికల్‌ ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు. ముందుగా డాక్టర్లు వెళ్తే నర్సులు వెళ్తారని, ప్రతి కరోనా పేషెంట్లను ఆత్మీయంగా కలువాలని జనరల్‌ ఫిజీషియన్లు ఆదేశించారు. వీరిలో డ్యూటీ డాక్టర్లు, ఆర్‌ఎంవో పీపీఈ కిట్స్‌తో కరోనా రోగుల వార్డుల్లో తప్పనిసరిగా మూడు రౌండ్స్‌ చేయాలని సూచించారు. గ్రామ స్థాయిలో కరోనా పరీక్షలు చేయించాలని, ప్రతి పీహెచ్‌సీ కేంద్రంలో ప్రతీరోజు తప్పనిసరిగా పరీక్షలు చేయాలని వైద్యారోగ్య శాఖ బృందాన్ని మంత్రి ఆదేశించారు. కరోనా వ్యాధి నిర్ధ్దారణకు వచ్చే వారికి పీహెచ్‌సీ పరిధిలో ర్యాపిడ్‌ టెస్టులు చేయాలని సూచించారు. పాజిటివ్‌ అని తేలితే సదరు రోగికి ఐసొలేషన్‌ కిట్‌ చేతికి ఇవ్వాలన్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ర్యాండమ్‌గా పలువురు కరోనా పాజిటివ్‌ రోగులతో ఫోన్‌ లైన్‌లో మాట్లాడాలని పేర్కొంటూ.. ప్రతి రోగిని ఆత్మీయంగా పలుకరిస్తే, 50 శాతం రోగం నయమవుతుందన్నారు. కరోనా పరీక్షలు చేయమనే మాట రావొద్దని, జిల్లాలోని 34 పీహెచ్‌సీ కేంద్రాలు, సిద్దిపేట, గజ్వేల్‌ ఆర్వీఎం దవాఖానలో సైతం పరీక్షలతో పాటు చికిత్స అందించాలని సూచించారు.   

జిల్లాలో కొవిడ్‌-19 నియంత్రణకు పటిష్ట చర్యలు 

జిల్లాలో కొవిడ్‌-19 నియంత్రణకు చర్యలు పటిష్టంగా అమలు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులు ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజమ్మీల్‌ఖాన్‌, జిల్లా వైద్యాధికారి డా.మనోహర్‌, డీపీవో సురేశ్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీవోలు, వైద్యాధికారులతో హైదరాబాద్‌ నుంచి మంత్రి జిల్లాలో కొవిడ్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పాజిటివ్‌ కేసులు, యాక్టివ్‌ కేసులు, కొవిడ్‌ శ్యాంపిల్స్‌ సేకరణ, వైరస్‌ వ్యాప్తి కట్టడికి అమలు చేయాల్సిన వ్యూహం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంపై టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపై అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. గ్రామ పీహెచ్‌సీ, జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయతంతో కొవిడ్‌ను అరికట్టేందుకు కృషిచేయాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగి వ్యాధి లక్షణాలు ఉంటే జిల్లా కొవిడ్‌ దవాఖానకు బాధితులను పంపివ్వాలన్నారు. వ్యాధి లక్షణాలు లేకుండా హోం ఐసొలేషన్‌లో ఉంచాలన్నారు.  హోం ఐసొలేషన్‌ ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజు రెండుసార్లు మెడికల్‌ ఆఫీసర్లు ఫోన్‌ చేసి తెలుసుకోవాలన్నారు. ప్రతి రోజు ఏఎన్‌ఎం, ఆశవర్కర్లు హోం ఐసొలేషన్‌ ఉంటున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకోవాలన్నారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వారిని వెంటనే జిల్లా కొవిడ్‌ దవాఖానకు తరలించి చికిత్స అందేలా చూడాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఎవరైనా కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో బాధపడుతుంటే వారిని గుర్తించి పరీక్షలు చేయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వైరస్‌ బారినపడే అవకాశం ఎక్కువగా ఉండే వృద్ధుల రక్షణకు, ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారి రక్షణకు ప్రాధాన్యం ఇచ్చే అంశం, మరణాలు నివారించేందుకు కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ చర్యలు తదితర అంశాలపై కూడా అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచనలు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించి కేసులను సకాలంలో గుర్తించే చర్యలను ప్రోత్సహించడం, రోగులను సకాలంలో చికిత్సకు తరలించడం వంటి చర్యలపై మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచనలు చేశారు. 


logo