సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 08, 2020 , 03:09:35

అర్బన్‌ పార్కులకు స్థలాల గుర్తింపు

అర్బన్‌ పార్కులకు స్థలాల గుర్తింపు

రామాయంపేట : మున్సిపాలిటీల్లో అర్బన్‌ పార్కులకు స్థలాలను గుర్తించి, పనులను ప్రారంభించామని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. శుక్రవారం రామాయంపేటకు విచ్చేసిన ఆయన పట్టణ శివారులోని పట్టుపరిశ్రమ కేంద్రంలో రెండు ఎకరాల స్థలాన్ని అర్బన్‌ పార్కుగా గుర్తించి ట్రాక్టర్లతో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి నమూనాలో పార్కులను నిర్మిస్తామన్నారు.  ఒక్కో ఎకరంలో నాలుగు వేల మొక్కలను నాటుతామన్నారు.  ఎక్కువ శాతం ఔషధ మొక్కలను నాటనున్నట్లు తెలిపారు.  పార్కుల్లోకి మేకలు, గొర్రెలు రాకుండా వెదురు బొంగులతో బయో ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపాలిటీలో వెయ్యి జనాభాకు ఒక టాయిలెట్‌ను నిర్మిస్తున్నామన్నారు. రామాయంపేటలో 17 టాయిలెట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా టాయిలెట్ల నిర్మాణం ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తవుతాయన్నారు. అదనపు కలెక్టర్‌ వెంట రామాయంపేట కమిషనర్‌ శేఖర్‌రెడ్డి, బిల్‌ కలెక్టర్‌ కాలేరు ప్రసాద్‌, నవాత్‌ ప్రసాద్‌, బల్ల శ్రీనివాస్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

తూప్రాన్‌లో విరివిగా మొక్కలు నాటాలి

తూప్రాన్‌ రూరల్‌ :  తూప్రాన్‌ పట్టణం చూడముచ్చటగా కనిపించేలా విరివిగా మొక్కలు నాటాలని జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, ఆర్డీవో శ్యాంప్రకాశ్‌, కమిషనర్‌ ఖాజామోజియొద్దీన్‌, తహసీల్దార్‌ శ్రీదేవిలతో కలిసి తూప్రాన్‌ పట్టణంలో అదనపు కలెక్టర్‌ పర్యటించారు. జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల దరఖాస్తు కౌంటర్‌లను పరిశీలించారు. అనంతరం  పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించే స్థలాలను, గోల్డెన్‌ పార్కులోని నర్సరీని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు.  

రైతు వేదికల నిర్మాణాలు, ప్రకృతి వనాలపై దృష్టి సారించాలి 

తూప్రాన్‌ డివిజన్‌ పరిధిలోని తూప్రాన్‌, మనోహరాబాద్‌, వెల్దూర్తి, చేగుంట, నార్సింగి మండలాల్లో కొనసాగుతున్న రైతు వేదికల నిర్మాణాలపై దృష్టి సారించాలని తూప్రాన్‌ ఆర్డీవో శ్యాంప్రకాశ్‌కు అదనపు కలెక్టర్‌ నగేశ్‌ సూచించారు. రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల్లో ప్రకృతివనాలను నిర్మించాలని సూచించారు. 


logo