మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 08, 2020 , 03:10:16

సిబ్బంది కొరతతో ఇబ్బంది

సిబ్బంది కొరతతో ఇబ్బంది

పటాన్‌చెరు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడల్లో పటాన్‌చెరు పారిశ్రామికవాడ ఒకటి. ప్రముఖ ఔషధ పరిశ్రమల యూనిట్లు ఇక్కడే ఉన్నాయి. ఫార్మా, బల్క్‌డ్రగ్‌ ఉత్పత్తులకు దేశంలోనే పటాన్‌చెరు నియోజకవర్గానికి పేరుంది. కొవిడ్‌-19 శరవేగంగా విస్తరిస్తుండటంతో పరిశ్రమల్లోనే కరోనా వైరస్‌ ప్రభావం పడుతున్నది. ప్రొఫెషనల్‌ స్టాఫ్‌, ప్రొడక్షన్‌ సిబ్బందికి కూడా కరోనా సోకుతుండటంతో ఉత్పత్తి ప్రక్రియ ఆగిపోతున్నది. లాక్‌డౌన్‌ సమయంలో భయంతో ఔషధరంగ పరిశ్రమల కార్మికులు స్వరాష్ర్టాలకు వెళ్లిపోయారు. ఈ లోటు కూడా ఉత్పత్తి, ఇతర హౌస్‌ క్లీనింగ్‌ విభాగాల్లోనూ కనిపిస్తున్నది. తక్కువ మ్యాన్‌ పవర్‌తో పరిశ్రమలను అతికష్టంపై యాజమాన్యాలు కంపెనీలను నడిపిస్తున్నాయి. హెల్పర్‌, హౌస్‌ కీపింగ్‌ ఇతర పనుల కోసం రెట్టింపు వేతనాలు ఇచ్చి, పార్ట్‌ టైం వర్కర్లను, అడ్డాకూలీలను పరిశ్రమలకు తీసుకొచ్చి, పనులు చేయిస్తున్నాయి. కార్మికులు ఉత్పత్తికి పాటు పడితేనే దేశానికి మందులు సకాలంలో అందుతాయని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. మరో పక్క కొన్ని పరిశ్రమల్లో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రణాళిక, కార్మికులకు భద్రత కల్పించే సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది మానేస్తున్నారు. పరిశ్రమల యజమానులు కార్మికులకు పూర్తి సురక్షితమైన పరిసరాలను అందజేస్తే పరిశ్రమలు నిరంతర ఉత్పత్తులు అందిస్తాయని పలువురు అంటున్నారు.

ఔషధాల తయారీ ఇక్కడే ఎక్కువ..

ప్రపంచంలో ఎక్కడ మందు కనిపెట్టిన దాని ఉత్పత్తి మాత్రం హైదరాబాద్‌ శివారులోని పటాన్‌చెరులో జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశలు పెట్టుకున్నది. ఫార్మా స్యూటికల్‌ పరిశ్రమలు అహర్నిశలు కొవిడ్‌-19 మందు తయారీపై శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఔషధాలు తయారు చేసే బల్క్‌డ్రగ్‌, ఫార్మా, ఆర్‌అండ్‌డీలు కొవిడ్‌ కారణంగా ఉత్పత్తిలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొవిడ్‌-19 వైరస్‌ కారణంగా ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్న సంగతి విదితమే. సంపూర్ణ లాక్‌డౌన్‌ సమయంలోనూ ఔషధ తయారీ పరిశ్రమలు నడిచాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు కాపాడే మం దుల తయారీని ప్రోత్సహించాయి. నిర్విరామంగా ఈ పరిశ్రమలు కొనసాగాయి. లాక్‌డౌన్‌ను అంచలంచెలుగా విరమిస్తూ పోవడంతో పరిశ్రమల సమస్యలు కూడా పెరుగుతూ పోయాయి. ముఖ్యంగా కొవిడ్‌-19 వైరస్‌కు ఔషధ పరిశ్రమల సిబ్బంది ఎక్కువగా గురవుతున్నారు. దీంతో ఉత్పత్తికి సమస్యలు వస్తున్నాయి. ఒక్కో పరిశ్రమల్లో అనేక కీలకమైన విభాగాలుంటాయి. గత నెల రోజులుగా పరిశ్రమల్లో క్వాలిటీ కంట్రోల్‌ సిబ్బంది, ప్రొడక్షన్‌ సిబ్బంది, ఇతర కీలకమైన సిబ్బందికి కొవిడ్‌ వెలుగు చూస్తున్నది. షిప్టుల ప్రకారం ఉత్పత్తి జరుగుతుండటంతో కొన్ని బ్యాచ్‌లకు తీవ్రత అధికంగా ఉంది. కొన్ని షిప్టులకు కీలకమైన ప్రొడక్షన్‌ సిబ్బంది కరువవుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న సిబ్బందితో అధిక షిప్టులు నడిపిస్తున్నారు.

మానవ వనరులు కరువు

పటాన్‌చెరు ప్రాంతంలో అధిక శాతం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులే నివసిస్తారు. కొన్ని నెలలుగా లాక్‌డౌన్‌ కారణంగా భయంతో చాలామంది ఫార్మా, బల్క్‌డ్రగ్‌ యూనిట్లలో పనిచేసే కార్మికుల స్వరాష్ర్టాలకు వెళ్లిపోయారు. ఈ ప్రభావం అనేక పరిశ్రమలపై పడుతున్నది. ప్రొడక్షన్‌ను ఎలాగోలా తీస్తున్నామనుకుంటే, ఇతర పనులకు కూడా మనుషులు కరువవుతున్నారు. సాధారణ హెల్పర్లు, కూలీలు, ఇతర స్కిల్‌ పనులకు మనుషులు దొరకడం లేదు. కొవిడ్‌ కారణంగా అడ్డా కూలీలు సైతం పనులకు రావడం లేదు. దీంతో అర్జంట్‌ ఆర్డర్లు ఉన్న పరిశ్రమలు రెట్టింపు సొమ్ము ఆశ చూపి, పనులకు తీసుకుని వచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఇప్పుడు పాశమైలారం, కాజీపల్లి, పటాన్‌చెరు, రుద్రారం, గడ్డపోతారం, బొల్లారం, గుమ్మడిదల, ఆర్సీపురం ఇండస్ట్రియల్‌ ఏరియా ల్లో పరిశ్రమల్లో పనులు చేసేందుకు మనుషులు కరువవుతున్నారు. కొవిడ్‌ కూడా అతివేగంగా విస్తరిస్తుండటంతో పరిశ్రమల్లో పని చేస్తున్న సిబ్బంది, కార్మికులు కూడా ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కార్మికులు, పరిశ్రమల సిబ్బంది బయట కొవిడ్‌ వైరస్‌ ప్రభావానికి లోనవుతున్నారు. రోడ్డుపై వస్తున్న సమయంలో, బజార్లలో, బస్సుల్లో కొవిడ్‌ వైరస్‌ వ్యాపిస్తున్నది. కొన్ని పరిశ్రమల్లో కొవిడ్‌ను నియంత్రించే వ్యవస్థ కూడా లేకపోవడం కార్మికులను భయాందోళనకు గురిచేస్తున్నది. పరిశ్రమల్లో కార్మికులు సురక్షితంగా ఉండేలా పరిశ్రమల యాజమాన్యాలతో చర్యలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌పై, కార్మికశాఖ అధికారులపై ఉంది. మూడు షిప్టులను కూడా కార్మికులకు రక్షించుకుంటూ నడిచేలా చూడాల్సి ఉంది. పరిశ్రమల్లో కొవిడ్‌ కారణంగా ఉత్పత్తి తగ్గితే ప్రాణాలు కాపాడే మందుల ధరలు పెరిగే అవకాశం ఉంది. మందులకు కొరత కూడా రావచ్చు. అధికారులు కార్మికుల రక్షణ కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాల్సి ఉన్నది. కొవిడ్‌ సోకిన కార్మికులు త్వరగా రికవరీ అయ్యేలా పరిశ్రమల యాజమాన్యాలు, వైద్యాధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.logo