శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 07, 2020 , 00:42:01

శోకసంద్రంలో దుబ్బాక నియోజకవర్గం

శోకసంద్రంలో దుబ్బాక నియోజకవర్గం

దుబ్బాక/దుబ్బాక టౌన్‌/మిరుదొడ్డి/దౌల్తాబాద్‌: సోలిపేట రామలింగారెడ్డి మృతిచెందటంతో దుబ్బాక నియోజకవర్గం శోకసంద్రంలో మునిగిపోయింది. నిరంతరం నియోజకవర్గ ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే జననేత ఇక లేడన్న వార్తను ప్రజానీకం జీర్ణంచుకోలేకపోతున్నది. ఆయన మృతి నియోజకవర్గ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 15 రోజులుగా హైదరాబాద్‌లోని దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి 1 గంటకు తుది శ్వాస విడిచారు. గురువారం వేకువజామున 6 గంటలకు రామలింగారెడ్డి పార్థీవదేహాన్ని దుబ్బాక నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం కోసం ఆయన స్వగ్రామం దుబ్బాక మండలం చిట్టాపూర్‌కు తీసుకొచ్చారు. వేకువజాము నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించి, కన్నీటి పర్యంతమయ్యారు.

సంతాపకంగా నియోజకవర్గం బంద్‌

రామలింగారెడ్డికి మృతికి సంతాపకంగా గురువారం దుబ్బాక నియోజకవర్గంలో వ్యాపార, వాణిజ్యసంస్థలు స్వచ్ఛంద బంద్‌ పాటించారు. నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్‌, రాయపోల్‌, చేగుంట, నార్సింగ్‌ మండలాల్లో సంపూర్ణ బంద్‌ నిర్వహించారు. గ్రామాల్లో రామలింగారెడ్డి ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసి అశ్రునివాళులర్పించారు.  

చిట్టాపూర్‌లో వంటావార్పు బంద్‌

ఇంతితై అన్నట్లుగా విద్యార్థి నాయకుడి నుంచి ఉద్యమ నేతగా.. జర్నలిస్టుగా..రాజకీయ నేతగా ఎదిగిన రామలింగారెడ్డి మృతిచెందటం చిట్టాపూర్‌ చిన్నబోయింది. తమ గ్రామ ముద్దుబిడ్డ ఇక లేడన్న వార్తతో గ్రామస్తులు పొయ్యి వెలిగించలేదు. వంటావార్పు చేయకుండా పార్థీవదేహంవద్ద బారులుతీరారు. అంత్యక్రియలు ముగిసేంత వరకు గ్రామస్తులు పస్తులుండటం ఆయనపై ఉన్న అభిమానాన్ని తెలుపుతున్నది.

మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో..

రామలింగారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిట్టాపూర్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణలో జరిగాయి. ఉదయం 10గంటల సమయంలో మంత్రి హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి గ్రామానికి చేరుకొని ఏర్పాట్లు చూశారు. భౌతికకాయం వద్ద జనం పోగుకాకుండా మంత్రి చర్యలు తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసి, గ్రామానికి వచ్చిన వారికి మాస్క్‌లు ధరించాలని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు అప్రమత్తం చేశారు. పార్థీవదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు.  


logo