ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 07, 2020 , 00:14:47

‘అంచనాల’ లింగన్నకు అశ్రునివాళి

‘అంచనాల’ లింగన్నకు అశ్రునివాళి

విప్లవకారుడు.. పోరాటయోధుడు.. సాహితీవేత్త.. జర్నలిస్ట్‌.. ఉద్యమ నాయకుడు.. చైతన్యపరుడు.. అభివృద్ధి ఆకాంక్షుడు.. ఇవన్నీ కలిపితే సోలిపేట.. అలాంటి గొప్ప నేత ఇకలేరన్న విషయాన్ని దుబ్బాక నియోజకవర్గ ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నది. అనారోగ్యానికి గురైన దుబ్బాక ఎమ్మెల్యే, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి(57) చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడువడం అందరినీ కలిచివేస్తున్నది. గురువారం ఆయన స్వగ్రామం చిట్టాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలివచ్చారు. సీఎం కేసీఆర్‌ గ్రామానికి చేరుకొని, రామలింగారెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని, కంట తడిపెట్టారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలుపగా, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కేపీఆర్‌ పాడె మోశారు.

ప్రజా నాయకుడిగా, ప్రజల్లో నుంచి పుట్టుకు వచ్చిన నేత సోలిపేట రామలింగారెడ్డి. ప్రజా సేవకే తాను అంకితం అంటూ నిరంతరం వారి సమస్యలపై పోరాటం చేసిన యోధుడు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, అంచెలంచెలుగా ఎదిగారాయన. దుబ్బాక ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచి, రెండు పర్యాయాలు అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన నేత ప్రజలకు దూరమయ్యారు. అనారోగ్యం కారణంగా బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామమైన చిట్టాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు, అభిమానులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు సోలిపేటకు నివాళులర్పించారు.

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: అనారోగ్యంతో మృతిచెందిన సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ సోలిపేట రామలింగారెడ్డి (57) అం త్యక్రియలు గురువారం ముగిశాయి. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి స్వగ్రామం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ గ్రామానికి సోలిపేట రామలింగారెడ్డి పార్థీవదేహాన్ని తీసుకువచ్చారు. లింగన్న ఇక లేరన్న వార్త తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు చిట్టాపూర్‌కు చేరుకొని ఆయన భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సీఎం కేసీఆర్‌ చిట్టాపూర్‌ చేరుకొని రామలింగారెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తుకు తెచ్చుకొని సీఎం కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబానికి అండగా ఉం టానని భరోసానిచ్చారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పార్థీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్చించారు. సాయంత్రం 3గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర రెండు కిలోమీటర్ల మేర రెండు గంటలపాటు కొనసాగింది. దారి పొడవునా ప్రజలు రామలింగారెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. రామలింగారెడ్డి కుమారుడు సోలిపేట సతీశ్‌రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించారు.  

కడసారి చూడడానికి తరలివచ్చిన ప్రజలు, అభిమానులు 

రామలింగారెడ్డి భౌతిక కాయాన్ని చూడడానికి నియోజకవర్గ నలుమూలల నుంచి కాకుండా ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి, ఇతర జిల్లాల నుంచి పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు, జర్నలిస్టులు తరలివచ్చారు. ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి అంతిమయాత్రలో పెద్దసంఖ్యలో జనం పాల్గొన్నారు. అంతిమయాత్ర పొడవునా లింగన్న జోహార్‌, అమర్‌హై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రామలింగారెడ్డి స్వగ్రామంలో ఏ ఇంటా కూడా వంట చేయలేదు. దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. నిరంతరం తమ మధ్యనే ఉండే నాయకుడు హఠాన్మరణం చెందడం జీర్ణించుకోలేక పోతున్నామని ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు.  

పాడె మోసిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి.. 

అంతిమ యాత్రలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రామలింగారెడ్డి పాడెను మోసి ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో జ్ఞాపకాలను గుర్తుచేసుకొని కన్నీరుపెట్టారు. రామలింగారెడ్డి దవాఖానలో చేరినప్పటి నుంచి నిత్యం దవాఖానకు వెళ్లి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని మంత్రి హరీశ్‌రావు తెలుసుకున్నారు. ఉదయం నుంచి అంత్యక్రియలు పూర్త య్యే వరకు మంత్రి హరీశ్‌రావు అక్కడే ఉన్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. దహన సంస్కారాలు జరుగనున్న ప్రదేశంలో మంత్రి హరీశ్‌రావు వాహనాలను నియంత్రించారు. ప్రజలకు సూచనలు చేస్తూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు.  

ప్రముఖుల నివాళి... 

చిట్టాపూర్‌లో జరిగిన రామలింగారెడ్డి అంత్యక్రియలకు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, కొప్పుల ఈశ్వర్‌, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, భూపాల్‌రెడ్డి మదన్‌రెడ్డి, జోగు రామన్న, క్రాంతికిరణ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్‌,  ఫరీదోద్దీన్‌, రఘోత్తంరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సివిల్‌ సైప్లె కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎస్సీ, ఎస్టీ కమిషనర్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీను, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, వేముల వీరేశం, బీజేపీ నాయకుడు రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నాయకుడు మనోహర్‌రావు,  విశ్వకర్మ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే.శశీధర్‌ శిల్పి, వివిధ జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. 

తాజావార్తలు


logo