బుధవారం 30 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 05, 2020 , 23:56:41

బ్యాంకుల వైపు వెళ్లని రైతులు

బ్యాంకుల వైపు వెళ్లని రైతులు

  • n దీనితో వడ్డీ భారం పడే అవకాశం
  • n 2018, డిసెంబర్‌ 11 వరకు ఉన్న లక్ష రుణం మాఫీ
  • n రూ.25వేలు మొదలుగా మాఫీ వర్తింపు
  • n విడుతల వారీగా మాఫీ కొనసాగింపు
  • n రెన్యూవల్‌ చేయించుకోవడంలో ఆసక్తి చూపని రైతులు
  • n సంగారెడ్డి జిల్లాలో రూ.1034 కోట్ల రుణాలు ఇచ్చే లక్ష్యం
  • n ఇప్పటి వరకు రైతులు తీసుకున్నది రూ.320 కోట్లు మాత్రమే..

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను రెన్యూవల్‌, రీ షెడ్యూల్‌ చేసుకోవడంలో రైతులు ఆసక్తి చూపడం లేదు. దీనితో రైతులపై వడ్డీ భారం పడే అవకాశమున్నదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలో 2020 సంవత్సరానికి గాను రూ.1,034 కోట్లు బ్యాంకుల ద్వారా రైతులకు పంట రుణంగా అందించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ.320 కోట్లు మాత్రమే రైతులు తీసుకున్నారు. ప్రభుత్వం లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్‌ 11కు ముందు రుణాలను విడుతల వారీగా మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. విడుతల వారీగా ఈ మాఫీ వర్తిస్తుందని అధికారులు సూచించగా రైతులు మాత్రం బ్యాంకుల వెళ్లి రెన్యూవల్‌ చేయించుకోకపోవడంతో వడ్డీ భారీ పడుతుందని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి రైతు తక్షణమే బ్యాంకులకు వెళ్లి పంట రుణాలకు సంబంధించి రెన్యూవల్‌, రీ షెడ్యూల్‌ చేయించుకోవాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి నరసింహరావు కోరారు.

రెన్యూవల్‌ చేయించుకోని రైతులు...

రుణ మాఫీ కోసం చూస్తున్న రైతులు తమ రుణాలకు సంబంధించి రెన్యూవల్‌, రీషెడ్యూల్‌ చేయించుకోవడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రభుత్వం విడుతల వారీగా రూ.25వేల చొప్పున రుణమాఫీకి సంబంధించిన అందించే మొత్తాన్ని రైతుల ఖాతాల్లోనే వేస్తామని, అయితే రుణాలు రెన్యూవల్‌ చేయించుకోకపోవడంతో వడ్డీ భారంపడుతుందని సూచిస్తున్నారు. రీషెడ్యూల్‌, రెన్యూవల్‌ చేయించుకోవడం ద్వారా ఖాతా కొత్తగా ఉండడంతో పాటు పావలా వడ్డీ వర్తిస్తుంది. రెన్యూవల్‌ చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2020 ఏడాదికి గాను రైతులకు పంట రుణంగా రూ.1,030 కోట్లు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రుణ మాఫీ వస్తుందని ఎదురుచూస్తూ రైతులు బ్యాంకుల వైపు వెళ్లడం లేదు. ఇప్పటి వరకు కేవలం రూ.320 కోట్లు మాత్రం రైతులు రుణాలుగా తీసుకున్నారు. 

వ్యవసాయశాఖ బ్యాంకుబాటు

రుణాల రెన్యూవల్‌ విషయంలో రైతులకు అవగాహన కల్పించడానికి జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకుబాట పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు. అన్ని గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ జిల్లా అధికారి నరసింహరావు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రుణం ఉన్న ప్రతి రైతు బ్యాంకుకు వెళ్లి తమ రుణాలను రెన్యూవల్‌ చేయించుకోవాలని సూచించనున్నారు. రైతులకు అవగాహన కల్పించి అందరూ రెన్యూవల్‌ చేయించుకోవడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నామని నరసింహరావు తెలిపారు. ప్రతిరైతు రెన్యూవల్‌ చేయించుకుంటేనే వడ్డీ భారం తగ్గుతుందని జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్‌ మోహన్‌రెడ్డిలు రైతులకు విజ్ఞప్తి చేశారు. తమ పంట రుణాన్ని సంవత్సరంలోగా 7 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి 3 శాతం వడ్డీ రాయితీ వస్తుందని, దీనితో రైతులు కేవలం 4 శాతం మాత్రం వడ్డీకట్టినట్లు అవుతుందన్నారు. రుణాన్ని రెన్యూవల్‌ చేయడంతో బ్యాంకులు మళ్లీ సాధ్యమైనంత వరకు వారి పంటను, భూమి విస్తీర్ణాన్ని పరిగణంలోకి తీసుకుని రైతులకు రుణాన్ని పెంచి ఇస్తారని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మోహన్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.


logo