గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Aug 04, 2020 , 23:56:00

తటాకాలు నిండు కుండలు

తటాకాలు నిండు కుండలు

  • నిండుతున్న చెరువులు, కుంటలు
  • పెరుగుతున్న భూగర్భజలాలు
  • హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
  • కొనసాగుతున్న వరినాట్లు

సిద్దిపేట జిల్లాలోని చెక్‌డ్యాంలు నీళ్లతో నిండుగా కళకళలాడుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండగా మత్తడి దుంకుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగి బోరు, బావుల్లో నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంతో సాగునీటి తంటాలు తప్పినట్లే. ఎన్నో ఏండ్ల తర్వాత చెరువులు అలుగులు పారుతుండడంతో అన్నదాతల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నారు. నంగునూరు మండలం రాజగోపాల్‌పేట చెరువు 32 ఏండ్ల తర్వాత అలుగు పారింది. ఇటీవల వర్షాలు బాగా కురువడంతో గోదావరి జలాలకు తోడుగా వరద నీళ్లు చెరువులు, చెక్‌డ్యాంల్లోకి చేరడంతో జలకళను సంతరించుకున్నాయి.  సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నంతో సిద్దిపేట జిల్లాలోని నీటి తటాకాలు నిండు కుండలా మారాయి. రంగనాయక సాగర్‌ నుంచి వస్తున్న గోదావరి జలాలతో పాటు నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు వరద నీరు వస్తుండడంతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండుతున్నాయి. జలవనరులు మత్తడి దుంకుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగి బోరు, బావుల్లో నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. నంగునూరు మండలం రాజగోపాల్‌పేట చెరువు 32 ఏండ్ల తర్వాత అలుగు పారగా, అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. చెక్‌డ్యాంల అలుగులు పొంగిపొర్లుతుండటంతో అన్నదాతలు ఆనందంగా ఏరువాక సాగుతున్నారు. అదనంగా పొలాలను అచ్చుకట్టుకోవడం, నాట్లు వేయడం వంటి పనుల్లో బిజిబిజీగా గడుపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంతో సాగునీటి తంటాలు తప్పాయని రైతులు పేర్కొంటున్నారు.

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : సిద్దిపేట జిల్లాలో 3,484 చెరువులు ఉన్నాయి. అందులో 2,225 చెరువుల్లో 25 శాతం, 577 చెరువుల్లో 50 శాతం , 326 చెరువుల్లో 75 శాతం నీరు చేరింది. 302 చెరువులు నిండగా, 54 చెరువులు అలుగుపారుతున్నాయి. ఇవి గాక సుమారు 120 చెక్‌డ్యాంల్లో పుష్కలంగా నీరు నిల్వ ఉన్నది. చెక్‌డ్యాంలు అలుగులు పొంగిపొర్లుతుండడంతో అన్నదాతలు ఆనందంగా ఏరువాక సాగుతున్నారు. అదనంగా పొలాలను అచ్చుకట్టుకోవడం, నాట్లు వేయడం వంటి పనుల్లో బిజిబిజీగా గడుపుతున్నారు. 

చెరువులు, కుంటల్లో చేరుతున్న నీరు..

రంగనాయక సాగర్‌ నుంచి వస్తున్న గోదావరి జలాలతో పాటు నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు వరద నీరు వస్తుండడంతో చెరువులు, కుంటలు, చెక్క్‌ డ్యాంలు నిండుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్‌, రూరల్‌, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో మొత్తం 842 చెరువులు ఉన్నాయి. వీటిలో 34 చెరువులు 75 శాతం, 220 చెరువుల్లోకి 75 నుంచి 100 శాతం వరకు నీళ్లు చేరాయి. 14 చెరువులు అలుగు పారుతున్నాయి. ఎక్కువగా నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లోనే అధికంగా చెరువులు నిండాయి. 400 ఎకరాల విస్తీర్ణంలో  ఉన్న నంగునూరు మండలం రాజగోపాల్‌పేట పెద్ద చెరువు సుమారు 32 ఏండ్ల తర్వాత నిండి అలుగు పారుతున్నది. ఈ చెరువును కాకతీయుల కాలంలో నిర్మించారు. చెరువు నీటి నిల్వ సామర్థ్యం 100 ఎంసీఎఫ్‌టీలు. సిద్దిపేట నియోజకవర్గంలోనే పెద్దచెరువుగా చెప్పుకోవచ్చు. చెరువులో నీళ్లు ఉండడంతో 15 గ్రామాల సాగునీటికి కొదువలేదు.  ప్రస్తుతం 21 ఫీట్లతో మత్తడి దుంకుతున్నది. గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేల్‌, వర్గల్‌, కొండపాక, ములుగు, మర్కూక్‌, జగదేవ్‌పూర్‌ మండలాల్లో 898 చెరువులు ఉన్నాయి. వీటిలో 186 చెరువుల్లో 75 శాతం, 26 చెరువుల్లో 75 నుంచి 100 శాతం వరకు నీళ్లు చేరగా, నియోజకవర్గంలో 21 చెరువులు అలుగు పారుతున్నాయి. జగదేవ్‌పూర్‌, మర్కూక్‌, కొండపాక మండలాల్లో ఎక్కువగా చెరువులు నిండాయి. వర్గల్‌ మండలంలో 25 శాతం మాత్రమే అన్ని చెరువుల్లోకి నీళ్లు వచ్చాయి. దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌, రాయిపోల్‌, మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట మండలాల్లో మొత్తం 1049 చెరువులు ఉన్నాయి. వీటిలో 75 చెరువుల్లో 75, 15 చెరువుల్లో 75 నుంచి 100 శాతం నీళ్లు చేరాయి. తొగుట మండలంలోని 6 చెరువులు నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని హుస్నాబాద్‌, అక్కన్నపేట, కొహెడ మండలాల్లో మొత్తం 370 చెరువులున్నాయి. వీటిలో 14 చెరువులు 75 శాతం, 18 చెరువులు 75 నుంచి 100 శాతం నిండాయి. కోహెడ మండలంలోని 8 చెరువులు అలుగు పారుతున్నాయి. జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లో 223 చెరువులు ఉన్నాయి. వీటిలో 47 చెరువుల్లో 75 శాతం, 12 చెరువుల్లో వంద శాతం నీళ్లు వచ్చాయి. అన్ని మండలాల్లో కలిపి మొత్తం 05 చెరువులు అలుగు పారుతున్నాయి. మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలంలో 102 చెరువులు ఉండగా, 91 చెరువులకు 25 శాతం నీళ్లు చేరాయి. మరో 11 చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. 

చెక్‌డ్యాంల్లో నీరు పుష్కలం..

సిద్దిపేట, హుస్నాబాద్‌, జనగామ నియోజకవర్గం పరిధిలోని పెద్దవాగు, మోయతుమ్మెద వాగుపై నిర్మించిన 25 చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. సిద్దిపేట వాగుపై నిర్మించిన 28, గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల మీదుగా వెళ్తున్న కుడ్లేరు వాగుపై నిర్మించిన 38, హల్దీ వాగుపై నిర్మించిన 10 చెక్‌డ్యాంలు నిండాయి. జిల్లాలోని మరికొని వాగులపై నిర్మించిన చెక్‌డ్యాంలు నక్కవాగుపై 07, ఎల్లమ్మవాగుపై 04, చిన్న వాగుపై 05, కోనేటి వాగుపై 03 చెక్‌ డ్యాంలను కలుపుకొని సుమారుగా 120 చెక్‌డ్యాంలూ గంగమ్మ చేరికతో కళకళలాడుతున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది.  


తాజావార్తలు


logo