శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 04, 2020 , 02:33:43

పచ్చిరొట్ట భూమికి అమృతం

పచ్చిరొట్ట భూమికి అమృతం

  • l జీలుగతో నేల సారవంతం l తగ్గనున్న పెట్టుబడి ఖర్చులు
  • l సబ్సిడీపై విత్తనాల పంపిణీ lరైతులకు అధికారుల అవగహన   

నిజాంపేట : తక్కువ సమయం, విస్తీర్ణంలో అధిక దిగుబడిని పొందేందుకు రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులను వాడుతున్నారు.  దీని వల్ల  భూములు సహజ సారాన్ని కోల్పోయి విషతుల్యంగా మారుతున్నాయి. రానురాను  దిగుబడి తగ్గిపోయి భూములుగా నిస్సారంగా మారుతున్నాయి.  పూర్వం రైతులు నేలను సారవంతం చేయడానికి  వరినాటు వేసే 10 రోజుల ముందు పొల్లాలో ఆముదం, సుబాబుల్‌, సీతాఫలం చెట్ల ఆకులను వేయడంతో పాటు  పశువుల పేడను వెదజల్లేవారు.  ప్రస్తుతం పశుసంపద తగ్గడంతో ఎక్కువ మంది రైతులు రసాయన ఎరువులపైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో రైతులు పచ్చిరొట్ట, జీవామృతంపై దృష్టిసారించాలని, సేంద్రియ వ్యవసాయం వల్ల భూసారం పెరగడంతో పాటు దిగుబడి ఎక్కువ వస్తుందని వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

పచ్చిరొట్ట ప్రయోజనాలు..

1. పచ్చిరొట్ట(జీలుగు, జనుము)ను భూమిలో కలియదున్నడంతో పంటకు కావాల్సిన పోషకాలను నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది.

2. పంటలకు సూక్ష్మ పోషకాల లోపం ఉండదు.

3.  నాణ్యతతో కూడిన అధిక దిగుబడి పొందవచ్చు.

4.  జీలుగ, జనుము, పిల్లిపెసర, పెసర వంటి  మొక్కల వేర్లపై బుడిపెలుగా ఉన్నా ప్రదేశాలలో రైజోబియం బాక్టీరియా  పంటకు కావాల్సిన నత్రజనిని నేరుగా అందింస్తూ నేల సారవంతానికి తోడ్పడుతుంది.

5.  జీలుగ సాగుతో భూమిలో చౌడు తగ్గుతుంది. 

6. రసాయన ఎరువుల వాడకం తగ్గి పెట్టబడి ఖర్చు తగ్గుతుంది.

సబ్సిడీపై పంపిణీ..

 రైతులకు ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలను స్థానిక ఆగ్రోస్‌, పీఏసీఎస్‌ కేంద్రాలు, విత్తన దుకాణాల ద్వార సబ్సిడీపై అందజేస్తుంది. సబ్సిడీపై 280 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు.  

 నేల సారవంతం: మండల వ్యవసాయ అధికారి సతీష్‌ 

జీలుగను భూమిలో కలియ దున్నడం వల్ల భూమి సారవంతంతో పాటు అధిక దిగుబడి పొందవచ్చు. చౌడు నేలలకు ఎంతో ఉపయోగకరం. రసాయన ఎరువుల ఖర్చును తగ్గిస్తుంది. పశువుల పేడ, జీలుగ సాగు వల్ల నేలకు తగిన పోషకాలు అందుతాయి. 


logo