శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 04, 2020 , 02:32:10

30ఏండ్ల తర్వాత..

30ఏండ్ల తర్వాత..

  • n గోదావరి జలాలు, వరద నీటితో నిండిన రాజగోపాల్‌పేట పెద్ద చెరువు
  • n మత్తడి దుంకడంతో రైతన్నల ముఖాల్లో ఆనందం
  • n 15 గ్రామాల రైతులకు మేలు 
  • n సాగుకు ఇక ఢోకా లేదని ధీమా 

నంగునూరు : ఒకటి కాదు.. రెండు కాదు.. 30 ఏండ్ల తర్వాత నంగునూరు మండలం రాజగోపాల్‌పేట పెద్ద చెరువు జలకళను సంతరించుకుంది. ప్రభుత్వం ఇది వరకే రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ కుడి కాల్వ ద్వారా రాజగోపాల్‌పేట చెరువులోకి నీటిని వదిలింది. దీనికి తోడు రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో వర్షం నీరు, గోదావరి జలాలు కలుపుకొని చెరువు మత్తడి దుంకుతుంది. ఏండ్ల తరువాత చెరువు మత్తడి దుంకుతుండడంతో రైతన్నల ముఖాల్లో సంబురం నెలకొంది. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చొరవతో రిజర్వాయర్ల ద్వారా చెరువులు నింపడంతో ఇన్నేండ్లు ఇబ్బందులు పడ్డ రైతాంగం.. ఇక సాగునీటికి గోస తీరిందని సంతోషపడుతున్నారు.  నంగునూరు మండలం రాజగోపాల్‌పేట పెద్ద చెరువు సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీనిని కాకతీయుల కాలంలో నిర్మించారు. ఈ చెరువులో నీటి నిల్వ సామర్థ్యం 100 ఎంసీఎఫ్‌టీలు. సిద్దిపేట నియోజకవర్గంలోనే పెద్దచెరువుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నిండుకుండలా చెరువు జలకళను సంతరించుకోవడంతో 15 గ్రామాల రైతులకు సాగునీటికి ఉపయోగకరంగా మారింది. ప్రస్తుతం 21 ఫీట్లతో మత్తడి పారుతుంది. చెరువు నిండడంతో రాజగోపాల్‌పేట గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మత్తడి దుంకిన నీరు పాలమాకుల చెరువు నుంచి దర్గపల్లి చెరువు, పల్లె చెరువు, అక్కడి నుంచి శనిగరం డ్యాంలోకి వెళ్తాయి. ప్రభుత్వం రిజర్వాయర్లను త్వరితగతిన పూర్తి చేసి ఏండ్లుగా నిండని చెరువులను సైతం నింపుతూ సాగునీటి గోస తీర్చిందని ప్రభుత్వానికి రుణపడి ఉంటామని రైతులు చెబుతున్నారు. బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు వస్తాయని ఇక సాగుకు గోస పడాల్సిన అవసరం లేదని, చేతినిపండా పని ఉంటుందని పలువురు సంబురం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిండడంతో మత్స్యకారులకు సైతం ఉపాధి దొరుకనున్నది.


logo