గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 02, 2020 , 23:15:01

రైతు వేదికల నిర్మాణానికి సరిపడా ఇసుక సరఫరా

రైతు వేదికల నిర్మాణానికి  సరిపడా ఇసుక సరఫరా

హుస్నాబాద్‌ : జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాల నిర్మాణానికి కొరత లేకుండా ఇసుకను రవాణా చేయిస్తున్నట్లు ఆర్డీవో జయచంద్రారెడ్డి తెలిపారు. జిల్లాలో పలుచోట్ల నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులతోపాటు ఇసుక రవాణాను ఆయన పర్యవేక్షించారు. కోహెడ మండలంలోని మోయె తుమ్మెద వాగు నుంచి ఇసుకను తరలించే వాహనాల వే బిల్లులను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి ఆదేశాలతో జిల్లాలోని రైతు వేదికలతోపాటు ఇతర ప్రభుత్వ నిర్మాణాలకు కోహెడ మండలంలోని మోయెతుమ్మెద వాగు నుంచి ఇసుకను రవాణా చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో  119 రైతు వేదికల నిర్మాణానికి గడిచిన పది రోజుల్లో 360 లారీల ఇసుకను ఇప్పటికే సరఫరా చేశామన్నారు. జిల్లా సాండ్‌ కమిటీ, మైనింగ్‌ శాఖ మోయెతుమ్మెద వాగు నుంచి ఇసుకను తరలించడానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీంతోపాటు బెజ్జంకి, కోహెడ మండలాల్లోని గాగిల్లాపూర్‌, తోటపల్లి, రామచంద్రాపూర్‌, వరికోల్‌ గ్రామాల శివారు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరుగకుండా జిల్లావ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, బెజ్జంకి తహసీల్దార్‌ పర్యవేక్షణలో రెండు అధికార బృందాలను నియమించామన్నారు. లారీ లోడ్‌ కాగానే వెంటనే దాని ఫొటో తీసి కలెక్టర్‌కు వాట్సాప్‌ చేస్తున్నట్లు, పలుచోట్ల వే బిల్లులను తనిఖీ చేస్తామని ఆర్డీవో చెప్పారు. జీవో నంబర్‌ 6 ద్వారా రైతు వేదిక నిర్మాణాలకు సరఫరా చేసే ఇసుకకు చార్జీలు ఉండవని, మిగతా అన్ని ప్రభుత్వ నిర్మాణాలకు చార్జీలు ఉంటాయన్నారు. ఇసుక రవాణాలో జరిగే అవకతవకలపై తనకు ఫిర్యాదు చేయాలని, లేదా 7331187577 ఫోన్‌ నంబరుకు వాట్సాప్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.  


logo