శనివారం 08 ఆగస్టు 2020
Siddipet - Aug 01, 2020 , 23:40:29

ప్రకృతి అందాలకు నిలయం సంజీవరాయుడి గుట్ట

ప్రకృతి అందాలకు నిలయం సంజీవరాయుడి గుట్ట

కనుచూపు మేర పచ్చని పంట పొలాలు, నలువైపులా చెరువులు.. అల్లంత దూరానా కనిపించే గ్రామాలు, ఆ పక్కనే గౌరవెల్లి రిజర్వాయర్‌.. రాళ్లు, ఎత్తైన చెట్లతో కూడిన సహజ అందాలు భక్తులతో పాటు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి.  సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి శివారు వీటికి నెలవు.  ఈ గ్రామ శివారులో దాదాపు వెయ్యి మీటర్ల ఎత్తులో ఉన్న సంజీవరాయుడి గుట్టపైన రెండు సొరికెల నడుమ సంజీవరాయుడు, బండకు ముందు భాగంలో ఆంజనేయస్వామి కొలువై ఉన్నారు. భక్తులు కాలినడకన గుట్టపైకి చేరుకుని, కోనేరులో స్నానమాచరించి ఆ దేవుళ్లను దర్శించుకుంటారు. ఈ గుట్ట సహజ అందాలకు నిలయం. పక్షుల కిలకిల రావాలు, కొండెంగల ఆటలు ఇలా ఎన్నో మనకు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడి కోనేరులో అన్ని కాలాల్లో నీరు ఉంటుంది. ఈ గుట్టపై నుంచి చూస్తే కరీంనగర్‌ జిల్లా లోయర్‌ మానేరు డ్యాం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రావణమాసంలో భారీగా భక్తులు గుట్టకు వచ్చి దేవుళ్లను దర్శించుకుంటారు. ఈ గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఇక్కడికి ఒకసారి వచ్చిన వారికి మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. 

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామ పరిధిలో సంజీవరాయుడి గుట్ట ఉంది. భూమి నుంచి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో ఈ గుట్ట ఉంటుంది. గుట్టపైకి రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొంత మేర సౌకర్యం కల్పించారు. గుట్ట రాళ్ల మధ్య నుంచి భక్తులు కాలినడకన పైకి చేరుకుంటారు. ఈ గుట్టపైన ఆంజనేయస్వామి, సంజీవరాయుడి గుడి ఉంది. బండకు ఒకవైపు ఆంజనేయస్వామి విగ్రహం, వెనుక వైపు ( రెండు బండల మధ్యన ) సంజీవరాయుడి విగ్రహం చెక్కబడి ఉంది.ఇక్కడికి వచ్చిన భక్తులు సొరికెల మధ్యనకు వెళ్లి సంజీవరాయుడిని దర్శించుకుంటారు. ఆంజనేయుడి విగ్రహం వద్ద వినాయకుడితో పాటు శివలింగం, నంది విగ్రహాలు ఉన్నాయి. ఏటా శ్రావణ మాసంలో వేలాదిగా భక్తులు వస్తారు.ఎత్తైన గుట్టను ఎక్కి స్వామి వారిని దర్శించుకుంటారు.    

గుట్టపై కోనేరు..

సంజీవరాయుడి గుట్టపైన కోనేరు ఉంది. ఇది సుమారుగా 10 నుంచి 15 మీటర్ల లోతు వరకు ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు. ఏ కాలంలోనైనా ఈ కోనేరులో నీళ్లు నిండుగా ఉంటాయి. భక్తులు కోనేరు వద్ద కొబ్బరికాయను కొట్టి స్నానాలు ఆచరించి ఆంజనేయస్వామి, సంజీవరాయుడిని దర్శించుకుంటారు. రెండు సొరికెల మధ్యన కనీసం మనిషి వెళ్లడానికి కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ, ఆ రెండు సొరికెల నడుమన ఈదుకుంటూ సంజీవరాయుడి దర్శనం చేసుకుంటారు. ఇలా చేయడంతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. స్థానిక గొల్లకుర్మలు శ్రావణ మాసంలో వరద పాశం కోనేరు పైభాగంలోని బండపైన పోస్తారు. గుట్ట పైభాగంలో రాతి కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. గతంలో పూర్వీకులు గుట్ట పడమర భాగంలో ఉన్న రేగొండ దర్వాజ నుంచి ఉప్పుగర్జా సొరంగం వరకు వెళ్లి, అక్కడి నుంచి మరో సొరంగం ద్వారా కల్కి చెరువులోకి వెళ్లి నీళ్లు తెచ్చుకునే వారని తెలుస్తోంది. 

దేవతలందరూ కొలువై ఉన్నారు..

సంజీవరాయుడి గుట్ట దిగువ భాగంలో సమ్మక్క-సారలమ్మ, కొద్ది దూరంలో మల్లికార్జునస్వామి, పక్కనే ఎల్లమ్మతల్లి పుట్ట, వేప చెట్టు కింద పోచమ్మతల్లి కొలువై ఉన్నారు. గుట్టపై నుంచి చూస్తే కల్కిదేవి గుడి, కల్కి చెరువు, చామంతుల దేవి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు దేవుళ్లను దర్శనం చేసుకొని, వంటలు చేసుకొని భోజనాలు చేసి వెళ్తారు. ఈ గుట్టకు నాలుగు దిక్కులా చెరువులు ఉన్నాయి. కల్కి, చామంతుల, నక్కలకుంట, తాళ్లకుంట అనే చెరువులు మనకు కనిపిస్తాయి. ఈ గుట్టపై నుంచి చూస్తే కరీంనగర్‌ జిల్లా లోయర్‌ మానేరు డ్యాం స్పష్టంగా కనిపిస్తుంది. 

పక్కనే గౌరవెల్లి రిజర్వాయర్‌..

సంజీవరాయుడి గుట్టపక్కనే గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మిస్తున్నారు. మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకువచ్చి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి సీఎం కేసీఆర్‌ గౌరవెల్లి రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. వచ్చే దసరా నాటికి పనులు పూర్తిచేసి గౌరవెల్లి రిజర్వాయర్‌లో గోదావరి జలాలు నింపాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. భవిష్యత్తులో ఈ ప్రాంతం మంచి పర్యాటక ప్రదేశం కానున్నది. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 

ప్రకృతి అందాలు..

సంజీవరాయుడి గుట్టపైకి వెళ్లిన వారు ప్రకృతిని చూసి ముగ్ధులు కావాల్సిందే. గుట్ట చుట్టూ ఉన్న పచ్చని చెట్లు, విభిన్న ఆకారంలో ఉన్న బండరాళ్లు చూడ ముచ్చటగా ఉంటాయి. గుట్టపై నుంచి ఎటుచూసినా పచ్చని పంట పొలాలు,   గ్రామాలు కనిపిస్తాయి. ఒక హెలికాప్టర్‌ ద్వారా వీక్షిస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. గుట్టకు నలువైపులా ఉన్న చెరువులు, పక్షుల కిలకిల రావాలు, కొండెంగల ఆటలు ఇలా ఎన్నో మనకు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన వారికి మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. 

సంజీవరాయుడి గుట్టకు దారి ఇలా..

సిద్దిపేట నుంచి హన్మకొండకు వెళ్లే దారిలో పందిళ్ల స్టేజీ వద్ద దిగాలి. అక్కడి నుంచి పందిళ్ల స్టేజీ మీదుగా గోవర్ధనగిరి నుంచి గుట్టకు చేరుకోవచ్చు. హుస్నాబాద్‌ నుంచి గోవర్ధనగిరి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోవర్ధనగిరి ఊరిలో నుంచి బొడిగపల్లె వెళ్లే దారిలో కుడివైపున సంజీవరాయుడి గుట్ట కనిపిస్తుంది. ఆ ఊరి నుంచి గుట్టకు వెళ్లేందుకు శ్రావణమాసంలో ప్రత్యేకంగా ఆటోలు నడుపుతుంటారు. సొంత వాహనాల్లో, కాలినడకన అనేక మంది వెళ్తుతుంటారు. 


logo