మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 31, 2020 , 23:15:01

‘డబుల్‌' సంబురం

‘డబుల్‌' సంబురం

సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచారుపల్లి ఎస్సీ కాలనీలో 16, గంగిరెద్దుల కాలనీలో 20 డబుల్‌ బెడ్‌ రూం గృహ ప్రవేశాలు శుక్రవారం సంబురంగా జరిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొని గృహ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. నాంచారుపల్లి స్టేజీ రాజీవ్‌ రహదారి వద్ద నుంచి తోర్నాల వరకు దాదాపు 31 కి.మీ మేర బీటీ డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనతోపాటు పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ  రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ప్రభుత్వం ‘డబుల్‌' ఇండ్లను నిర్మించి ఇస్తుందన్నారు. యువత ముందుకొస్తే శిక్షణ ఇప్పించి ఉద్యోగ, ఉపాధి మార్గాలను చూపుతానన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపలేదని మంత్రి పేర్కొన్నారు.  

సిద్దిపేట కలెక్టరేట్‌/సిద్దిపేట అర్బన్‌ :  ‘నిరుపేదలు ఆత్మగౌరవంతో బతుకాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయం. అర్హులైన పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నది..’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్‌ నాంచారుపల్లి ఎస్సీ కాలనీలో 16, గంగిరెద్దుల కాలనీలో 20 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల గృహ ప్రవేశాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని గృహ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ పిట్టలోల్లు, పూసలోల్లు, హోలియదాసరి, గంగిరెద్దులవారు ఇలా అర్హులైన నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి అందజేస్తున్నామన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు, మిగిలిపోయిన పేద వారికి కూడా ఇండ్లు ఇస్తామన్నారు. కరోనా క్లిష్ట సమయంలోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును ఆపలేదన్నారు. గంగిరెద్దుల వారి అభ్యున్నతికి ఎంబీసీ కార్పొరేషన్‌ నుంచి రుణాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. 

  యువత ఆలోచనల్లో మార్పు రావాలి 

యువత ఆలోచనల్లో మార్పు రావాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. యువత ముందుకొస్తే శిక్షణ ఇప్పించి ఉద్యోగ, ఉపాధి మార్గాలను చూపుతానన్నారు. ఉన్నచోట ఉద్యోగం కావాలంటే దొరకదన్నారు. నాంచారుపల్లి గ్రామ శివారులో రైల్వేలైన్‌ వస్తుండడంతో పరిశ్రమలు వస్తాయని, మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల కోసం రూ.10 లక్షలు నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

 మంత్రి హరీశ్‌రావు గొప్ప నాయకుడు 

మంత్రి హరీశ్‌రావు గొప్పనాయకుడని.. రాష్ట్రంలో మొదటి గంగిరెద్దుల సంఘ కాలనీ, భవనం సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో ఏర్పాటైందని, ఇదంతా మంత్రి కృషితో సాధ్యమైందని గంగిరెద్దుల ప్రతినిధులు అన్నారు. 610 జీవో ప్రకారం 35 కులాలను ఎంబీసీలో చేర్చి మా ఉనికిని గుర్తించిన ఏకైక ప్రభు త్వం టీఆర్‌ఎస్‌ అన్నారు. గుడిసె తప్పా భవనాలు ఎరుగని మాకు సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అందించారు.  

  మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం 

శ్రావణ శుక్రవారం నూతన గృహ ప్రవేశం సందర్భంగా మంత్రి హరీశ్‌రావు గ్రామానికి చేరుకోగానే డప్పు చప్పుళ్లు.. మంగళహారతులతో లబ్ధిదారులు ఘన స్వాగతం పలికి కుంకుమ తిలకం దిద్దారు. ప్రతి ఇంటికి మామిడి ఆకులతో   గుమ్మడికాయలు కొడుతూ సంబురంగా గృహప్రవేశాలు చేశారు. బక్రిచెప్యాలలో శాలి వాహన కుమ్మరి సంఘ భవనాన్ని ప్రారంభించిన అనంతరం, సారె పట్టి కుండను తయారు చేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, పంచాయతీ రాజ్‌ డీఈ వేణు, డీఆర్డీవో గోపాల్‌రావు పాల్గొన్నారు. 

 31 కి.మీ మేర బీటీ డబుల్‌ రోడ్డు ..

  సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచారుపల్లి స్టేజీ రాజీవ్‌ రహదారి వద్ద నుంచి నాంచారుపల్లి, బక్రిచెప్యాల, వెల్కటూర్‌, కోనాయిపల్లి, నర్మెట, నంగునూరు, ఘణపూర్‌, కొండంరాజుపల్లి మీదుగా తోర్నాల వరకు దాదాపు 31 కి.మీ మేర రూ.23 కోట్ల 34 లక్షలతో బీటీ డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణంతో నాంచారుపల్లి దశ మారనున్నదన్నారు. 9 గ్రామాలను కలుపుకొని 3 మండలాల పరిధిలో 32 కి.మీ రోడ్డు చుట్టు పక్కల మండలాలైన సిద్దిపేట అర్బన్‌, చిన్నకోడూరు, నంగునూరుతో పాటు 25 గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉండేలా  పనులు ప్రారంభించుకున్నామన్నారు. 

 సెగ్రిగేషన్‌ షెడ్లు, వైకుంఠధామం, కుల సంఘ భవనాలు ప్రారంభం 

సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచారుపల్లి, బక్రిచెప్యాలలో సెగ్రిగేషన్‌ - వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాలు, 40 వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ ట్యాంకు, బక్రిచెప్యాలలో శాలి వాహన కుమ్మరి సంఘ భవనం, రెడ్డి కమ్యూనిటీ హాల్‌ భవనాలు ప్రారంభించారు. ఎల్లుపల్లిలో గ్రామ ఫంక్షన్‌ హాల్‌, యూత్‌ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్‌ షెడ్డు - వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. నాంచారుపల్లి షెడ్డులో మరో రెండు నాడెం కంపోస్టు పిట్స్‌ నిర్మించాలని ఏపీవో నర్సింగరావుకు సూచించారు. తడి పొడి చెత్త వేరు చేసి ఇచ్చేలా అవగాహన కల్పించాలని సర్పంచ్‌ కల్పనానర్సింహులుకు సూచించారు. సెగ్రిగేషన్‌ షెడ్లలో సేంద్రియ ఎరువుకు సిద్ధం చేసిన చెత్తను నాడెం కంపో స్టు పిట్‌లో వేశారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకొని బక్రిచెప్యాల గ్రామ మహిళా సం ఘ ప్రతినిధి మంత్రికి రాఖీ కట్టారు. 

  కరోనా మహమ్మారిని ఎదుర్కొందాం

  కరోనా మహమ్మారిని సమష్టిగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఉపాధ్యాయ శిక్షణా పరిశోధన కేంద్ర భవనంలో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని నారాయణరావుపేట, సిద్దిపేట గ్రామీణ మండలాలకు చెందిన 110 మంది లబ్ధిదారులకు రూ.కోటి 10 లక్షల 12 వేల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి అందజేశారు. జడ్పీచైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ పాలసాయిరాం పాల్గొన్నారు. 

సిద్దిపేటలో రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవనం 

 ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ స్థలంలో రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవనాన్ని నిర్మించుకొని ప్రారంభించుకున్నామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులోని కేసీఆర్‌ నగర్‌లో రూ.48 లక్షలతో నిర్మించిన క్రిస్టియన్‌ అండ్‌ ఫాస్టర్‌ కమ్యూనిటీ భవనం, రూ.45 లక్షలతో నిర్మించిన గంగిరెద్దుల కమ్యూనిటీ భవనాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాంతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవులకు కమ్యూనిటీ భవనాలను గజ్వేల్‌, సిద్దిపేటలలో నిర్మించుకొని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.  

 జిల్లా ఆర్‌అండ్‌బీ భవనం ప్రారంభం 

జిల్లాకేంద్రం సిద్దిపేట బ్యాంకు కాలనీలో జిల్లా ఆర్‌అండ్‌బీ భవన కార్యాలయాన్ని శుక్రవారం మంత్రి హరీశ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గదులన్నీ కలియతిరిగి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రధాన రహదారుల నిర్మాణాల అంశంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈకి సూచించారు. అంతకు ముందు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్‌అండ్‌బీ ఈఈ సుదర్శన్‌, స్థానిక కౌన్సిలర్‌ ఉమారాణి ఐలయ్య పాల్గొన్నారు. 

  స్టీల్‌ బ్యాంకును ప్రారంభించిన మంత్రి 

పట్టణంలోని 11, 7వ వార్డుల్లో స్టీల్‌ బ్యాంకులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో చేసుకునే సత్యనారాయణ వ్రతాలకు వచ్చే అతిథులందరికీ స్టీల్‌ పాత్రల్లోనే భోజన ప్రసాదాలను అందించినట్లు 11వ వార్డు మహిళ రాజక్క మంత్రికి తెలిపింది. ఈ మేరకు మంత్రి చేతుల మీదుగా స్టీల్‌ బ్యాంకు సామ గ్రి బుకింగ్‌ చేశారు. 

  200 మంది వీధి వ్యాపారులకు  రుణ మంజూరు పత్రాల అందజేత 

 కరోనాతో ఇబ్బందులు పడ్డారు. ఇక మిత్తీలకు తెచ్చి అప్పుల పాలు కావొద్దు.. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో 4వ విడుతలో భాగంగా 200 మంది వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రూ. 20 లక్షల ఆత్మనిర్బర్‌ నిధి రుణ మంజూరు పత్రాలను అందజేశారు. 


logo