సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 30, 2020 , 00:03:29

పంటలు పచ్చగా..

పంటలు పచ్చగా..

  • n జోరందుకున్న కలుపుతీత పనులు
  • n మందులను పిచికారీ చేసే పనుల్లో అన్నదాతలు బిజీ
  • n సర్కారు సాయం ఆసరా  అయ్యిందని రైతన్నల ఆనందం

ఇటీవల కురిసిన వర్షాలకు పైరులు పచ్చబడ్డాయి. పత్తి, వరి చేన్లలో కలుపుతీత పనులు జోరందుకున్నాయి. చీడపీడల నుంచి పంటలను కాపాడుకునేందుకు, పైరు ఎదుగుదలకు మందులను పిచికారీ చేసే పనుల్లో అన్నదాతలు బిజిబిజీగా గడుపుతున్నారు. సర్కారు పెట్టుబడి సాయం ఎంతో ఆసరా అయ్యిందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

పాతికేండ్ల క్రితం నాటిన మొక్కలు నేడు వృక్షాలై రోడ్డుకిరువైపులా పచ్చదనంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అప్పట్లో నీటిపారుదల శాఖ అధికారుల ఆధ్వర్యంలో సింగూర్‌ ప్రాజెక్టు దిగువభాగంలో ప్రధాన రహదారిపై రోడ్డుకిరువైపులా మొక్కలు నాటింది. ఆ మొక్కలు ఇప్పుడు వృక్షాలై రహదారి వెంటపోయే వారికి చల్లని నీడనిస్తున్నాయి. పర్యాటకులు, పాదచారులు సింగూర్‌ ప్రాజెక్టులో కలియదిరిగి చివరికి ఈ చెట్ల కిందకి చేరి పైరగాలిని ఆస్వాదిస్తూ సేదతీరుతున్నారు.  - పుల్కల్‌

హరితహారం కార్యక్రమంలో  భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పోలీస్‌ స్టేషన్‌ కాస్తా హరితవనంలా మారింది. ఈ పోలీస్‌ స్టేషన్‌కు ఓ ప్రత్యేకత ఉన్నది. కంది మండలంలోని ఇంద్రకరణ్‌ పోలీస్‌ స్టేషన్‌ను జిల్లాలో మొదటి సారిగా మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దడం జరిగింది. ఓ వైపు జిల్లాకే మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌గా ఉండి అటు స్టేషన్‌ మొదలుకొని లోపలి వరకు చుట్టూ పచ్చని చెట్లతో చూపరులను కనివిందు చేస్తుంది. స్టేషన్‌లోకి అడుగు పెట్టక ముందే ఎదురుగా రెండు వైపులా ఏపుగా పెరిగిన చెట్లతో పాటు చక్కటి గార్డెన్‌ను ఉంటుంది. అలాగే స్టేషన్‌ లోపల రంగు రంగుల పూల మొక్కలు, ఇతర చెట్లతో కళకళలాడుతూ స్టేషన్‌కు పచ్చలహారం చుట్టినట్టుగా ఉంటుంది. ప్రస్తుతం స్థానిక ఎస్సై బాలస్వామి ఆధ్వర్యంలో నిత్యం చెట్లకు ఇక్కడి సిబ్బంది క్రమం తప్పకుండా నీటిని అందించి వాటిని సంరక్షిస్తున్నారు. పచ్చని చెట్ల గాలి.. చుట్టూ ఆహ్లాదకర వాతావరణం.. ఉండడంతో సందర్శకులు, వివిధ పనుల కోసం వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులు అక్కడ కొద్ది సేపు సేదతీరుతుంటారు. - కందిlogo