ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 28, 2020 , 22:57:59

గలగల గంగ.. కదిలిరాంగ..

గలగల గంగ..  కదిలిరాంగ..

  •   తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు ప్రారంభమైన గోదావరి జలాలు
  • l  రెండో పంపు ద్వారా పంపింగ్‌ చేస్తున్న అధికారులు l  రోజువారీగా 7 ఎంసీఎఫ్‌టీ జలాలు

చేర్యాల, నమస్తే తెలంగాణ : తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాల రాక సోమవారం రాత్రి ప్రారంభమైంది. చొక్కరావు ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2లో నిర్మించిన రెండో పంపు ద్వారా గోదావరి జలాలను రిజర్వాయర్‌లోకి దేవాదుల అధికారులు పంపింగ్‌ చేస్తున్నారు. రోజు  7 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్ల గోదావరి జలాలు రిజర్వాయర్‌కు పంపింగ్‌ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం ఒక మోటర్‌ మాత్రమే పని చేస్తుండడంతో 7 ఎంసీఎఫ్‌టీ జలాలు రిజర్వాయర్‌కు చేరుకుంటున్నాయని, మరో రెండు రోజుల్లో రెండో మోటర్‌ ఆన్‌ చేసి మరో 7 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్ల జలాలు పంపింగ్‌ చేయనున్నారు. గోదావరి నది ప్రవహిస్తుండడంతో నీటి పారుదల శాఖ అధికారులు ప్రత్యేక మోటర్ల ద్వారా చలివాగు, బీముని ఘనపూర్‌ మీదుగా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి గండిరామారం రిజర్వాయర్‌, బొమ్మకూరు రిజర్వాయర్‌లకు ఇటీవల గోదావరి జలాలు పంపింగ్‌ ప్రారంభించారు. ఆయా రిజర్వాయర్లలో నీటి మట్టం పూర్తిస్థాయిలో చేరుకోవడంతో జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని బొమ్మకూరు రిజర్వాయర్‌ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు అధికారులు గోదావరి జలాలను పంపింగ్‌ ప్రారంభించారు. రెండు పంపులు నిర్వీరామంగా పని చేస్తే రిజర్వాయర్‌ 15 రోజుల్లో నిండు కుండలా మారనున్నది. 0.3 టీఎంసీల సామర్థ్యం కలిగిన తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు పూర్తి స్థాయిలో గోదావరి జలాలు చేరుకోగానే చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లోని చెరువులకు నీటిని విడుదల చేయనున్నారు. అలాగే తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు ఫేజ్‌-3లో నిర్మించిన పైపులైన్ల ద్వారా  పంపింగ్‌ చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయమై దేవాదుల డీఈఈ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గోదావరి నదిలో నీటి లభ్యత ఉన్నంత వరకు రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్‌ చేస్తామని తెలిపారు.


logo