శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 26, 2020 , 02:02:58

‘ఇక నుంచి ఆన్‌లైన్‌లో బోధన’

‘ఇక నుంచి ఆన్‌లైన్‌లో బోధన’

మనోహరాబాద్‌ : కరోనా వైరస్‌ విస్తరిస్తున్నందున ఇక నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని మెదక్‌ డీఈవో రమేశ్‌బాబు తెలిపారు. శనివారం శివ్వంపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆయన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ హెచ్‌ఎంలంతా ఉపాధ్యాయులను మానిటర్‌ చేయాలన్నారు. మొదటగా పదో, తొమ్మిదో తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. తరగతికి ఓ వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేసి, రోజుకో సబ్జెక్ట్‌ బోధించాలన్నారు. ఫోన్‌ సౌకర్యం లేని విద్యార్థులు తోటి విద్యార్థితో కలిసి తరగతుల్లో పాల్గొనేలా చూడాలన్నారు. విద్యాబోధన అనంతరం నోట్స్‌ రాయించడం, వాటిని పరిశీలించడం, నెలకోసారి స్లిప్‌టెస్టులు నిర్వహించడం వంటివి ఉపాధ్యాయులే స్వయంగా విద్యార్థుల ఇంటికి వెళ్లి చేయించాలన్నారు. సబ్జెక్టుల్లో ముఖ్యమైన పాఠాలు బోధించేలా చూడాల్సిన బాధ్యత హెచ్‌ఎంలదే అన్నారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయుల కొరత ఉంటే పక్క గ్రామ పాఠశాలల ఉపాధ్యాయులతో వీడియో రికార్డులను చేయించి, గ్రూపుల్లో ఉన్న విద్యార్థులకు అందుబాటులోకి తేవాలన్నారు. విద్యతో పాటు కొవిడ్‌-19పై కూడా ప్రతి రోజు అవగాహన కల్పించాలన్నారు. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 70శాతం పాఠశాలల్లో పుస్తకాలను అందించామని, మిగిలినవి వారం రోజుల్లో అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్‌ మెంబర్‌ మన్సూర్‌, జడ్పీటీసీ మహేశ్‌గుప్త, ఎంపీపీ హరికృష్ణ, ఎంఈవో బుచ్యా నాయక్‌, ఆలయ కమిటీ డైరెక్టర్‌ హరిశంకర్‌గౌడ్‌, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.logo