శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 22, 2020 , 23:18:05

క‌రోనాపై ఆందోళ‌న వ‌ద్దు

క‌రోనాపై ఆందోళ‌న వ‌ద్దు

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. గజ్వేల్‌లోని ఆర్వీఎం దవాఖానలో 100 పడకల కొవిడ్‌ బ్లాక్‌ , ల్యాబ్‌ను ప్రారంభించారు. సిద్దిపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ములుగు వద్ద ఈజీఎస్‌ ఉపాధి కూలీలతో మాట్లాడారు. రాజీవ్‌ రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు కల్పించిందన్నారు. కరోనా బాధితులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

ములుగు : విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కొవిడ్‌ వార్డును ఏర్పాటు చేసి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దేశభక్తిని చాటుతున్న ఆర్వీఎం దవాఖాన,  వైద్యకళాశాల సేవలు అభినందనీయమని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం ములుగు మండల పరిధిలోని వంటిమామిడిలో ఆర్వీఎం దవాఖానలో ఏర్పాటు చేసిన కొవి డ్‌-19 వార్డు, అత్యాధునిక ల్యాబ్‌ను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఆర్వీఎం వైద్య కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ యాకయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  వైద్యులను, కొవిడ్‌ వార్డు నర్సులను అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన  సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైరస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొవిడ్‌పై పోరాటంలో తమ ప్రాణాలకు తెగించి వైద్యులు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఒకే రోజూ 600 మందికి పరీక్షలు చేసేలా సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో ఆర్వీఎం ఆధ్వర్యంలో సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో మేము భాగస్వాములమవుతామని ముందుకు వచ్చిన ఆర్వీఎం వైద్య కళాశాల యాజమాన్యానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, గడా ఓఎస్డీ ముత్యంరెడ్డి,  ఆర్వీఎం  సీఈవో శ్రీనివాస్‌రావు, ఎంపీపీ పెద్దబాల్‌ లావణ్య అంజన్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జహంగీర్‌, వీపీజే ఫౌండేషన్‌ చైర్మన్‌ విష్ణుజగతి, టీఆర్‌ఎస్‌ నాయకులు జుబేర్‌పాషా, నర్సంపల్లి అర్జున్‌గౌడ్‌, తహసీల్దార్‌ యాదగిరిరెడ్డి, ఎంపీటీసీ హరిబాబు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

 ఈజీఎస్‌ కూలీలతో మంత్రి మాటామంతీ..

ఆర్వీఎం దవాఖానలో కొవిడ్‌ వార్డును ప్రారంభించిన మంత్రి తిరుగు ప్రయాణంలో  ములుగులో రాజీవ్‌ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలకు పాదులు చేస్తూ, చెత్తాచెదారం తొలిగిస్తున్న ఈజీఎస్‌ కూలీలను చూసి కాన్వాయ్‌ నుంచి దిగారు. కాసేపు కూలీలతో ముచ్చటించి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న ఆసరా పెన్షన్‌, రైతుబంధుతో పాటు కూలీ డబ్బులు సమయానికి అందుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగం గా  సిద్దిపేట హరితవనంగా మారి, ఆహ్లాదాన్ని పంచుతుందని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.  


logo