సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 21, 2020 , 23:18:24

ఊరూర ఉద్య‌మంలా వైకుంఠధామాలు

 ఊరూర ఉద్య‌మంలా వైకుంఠధామాలు

మనిషి చనిపోతే కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి చాలా గ్రామాల్లో వైకుంఠధామాలు (శ్మశాన వాటికలు) లేక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్‌ యార్డులు లేక అనేక పల్లెల్లో చెత్త ఎక్కడపడితే అక్కడ పారవేస్తుండడం ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. ఈ కష్టాలను దూరం చేయడానికి పల్లెపల్లెనా వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఈ పనులు సిద్దిపేట జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో 95 శాతం పైగా పూర్తయ్యాయి. నెలాఖరు నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడానికి యంత్రాంగం కృషి చేస్తున్నది. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులు పరుగులు పెట్టిస్తున్నారు.  

సిద్దిపేట, నమస్తే తెలంగాణ:  వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులు  సిద్దిపేట జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో 95శాతం పైగా పనులు పూర్తయ్యాయి. జిల్లాలో నెలాఖరు నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తేవడానికి యంత్రాంగం కృషిచేస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 489 గ్రామపంచాయతీలకు గాను, 236 వైకుంఠధామాలు, 337 డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తిచేశారు. త్వరలోనే మిగితావి పూర్తిచేసేందుకు టార్గెట్‌ పెట్టుకున్నారు.రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.  అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. కలెక్టర్‌ పి. వెంకట్రామ్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ త్వరితగతిన పనులు పూర్తిచేసేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. 

పల్లెపల్లెనా...

సిద్దిపేట జిల్లాలో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులు  కొనసాగుతున్నాయి. జిల్లాలో 487 వైకుంఠధామాలు మంజూరు కాగా, ఇప్పటి వరకు 236 పూర్తిచేశారు. మిగతావి వివిధ దశలో ఉన్నాయి. 489 డంపింగ్‌ యార్డులకు గాను, ఇప్పటి వరకు 337 పూర్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేల్‌, వర్గల్‌, ములుగు, మర్కూక్‌, కొండపాక, జగదేవ్‌పూర్‌ మండలాల్లో దాదాపుగా పూర్తి కావచ్చాయి. చాలాచోట్ల వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల పనులు చివరి దశలో ఉన్నాయి. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను, ప్రజాప్రతినిధులను పరుగులు పెట్టిస్తున్నారు. తడి,పొడి చెత్తను వేరు చేసి ట్రాక్టర్లు, ఆటోరిక్షాల ద్వారా డంపింగ్‌ యార్డులకు తరలిస్తున్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరును అందించారు.ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ట్రాక్టర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. గ్రామాల్లో నిర్మించే డంపింగ్‌యార్డులకు ఉపాధిహామీ పథకంలో నిధులు మంజూరు చేశారు. పుట్టెడు దుఃఖంతో ఆఖరి మజిలీకి వచ్చే వారికి కాస్త ఉపశమనం కలిగే విధంగా వైకుంఠధామాలు నిర్మిస్తున్నారు. వైకుంఠధామాల్లో బర్నింగ్‌ ఘాట్స్‌, అస్తికలు భద్రపరుచుటకు, నీటి వసతి వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆహ్లాద వాతావరణం కోసం మొక్కలు నాటుడుతున్నారు. 


logo