శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 20, 2020 , 23:34:44

అధునాత‌న హంగుల‌తో గులాబి భ‌వ‌నాలు

అధునాత‌న హంగుల‌తో గులాబి భ‌వ‌నాలు

  • సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో పూర్తయిన నిర్మాణాలు
  • ఒక్కో భవనానికి రూ.60 లక్షలు అందించిన అధినేత కేసీఆర్‌
  • అదనంగా ఖర్చు చేసిన పార్టీ స్థానిక నేతలు
  • నిర్మాణాలను స్వయంగా పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు
  • ఇక వీటిలోనే పార్టీ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు
  • వెయ్యి మందికి పైగా కూర్చునేలా సౌకర్యవంతంగా నిర్మాణం
  • ఈ నెల 25 నుంచి కార్యాలయాల ప్రారంభోత్సవం

టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయా(తెలంగాణ భవన్‌)లు సకల హంగులతో సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లా కేంద్రాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కో భవనానికి పార్టీ రూ.60 లక్షలు అందించింది. మంత్రి హరీశ్‌రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల పర్యవేక్షణతో కార్యాలయాల నిర్మాణం వేగంగా జరిగింది. పార్టీ ఆఫీసు బాగుండాలనే లక్ష్యంతో స్థానిక నాయకులు ఇష్టంగా అదనంగా ఖర్చు చేయగా, ఈ నెల 25 నుంచి జిల్లా పార్టీ ఆఫీసులను ప్రారంభించడానికి టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తున్నది. ఇతర జిల్లాలతో పోల్చితే, ఉమ్మడి మెదక్‌లో త్వరగా పూర్తయ్యాయని, వీటిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌, మంత్రులు కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించుకోవడానికి ఇక ఇబ్బందులు ఉండవని నాయకగణం పేర్కొంటున్నది.

పార్టీ బలోపేతం, కార్యకర్తల సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించుకోవడానికి అధికార టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ ఆఫీసులను నిర్మించుకున్నది. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లా కేంద్రాల్లో వీటి నిర్మాణం పూర్తయ్యింది. వెయ్యి మందికి పైగా కార్యకర్తలు కూర్చుని సమావేశం జరుపుకునేలా సౌకర్యవంతంగా వీటిని నిర్మించారు. పార్టీ నుంచి రూ.60 లక్షలు అందించగా, అదనపు సౌకర్యాలకు స్థానిక నేతలు మరింత ఖర్చు పెట్టుకున్నారు కూడా. సమావేశ మందిరం, పార్కింగ్‌, వంట గది, స్టోర్‌ రూం, వాచ్‌మెన్‌ గదులు వీటిలో ఉన్నాయి. ఈ నెల 25 నుంచి జిల్లా పార్టీ ఆఫీసులను ప్రారంభించడానికి టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తున్నది. వీటి ప్రారంభోత్సవంతో టీఆర్‌ఎస్‌ సమావేశాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని పార్టీ నాయకులు చెబుతున్నారు.

జిల్లా పార్టీ ఆఫీసులను అన్ని వసతులతో సౌకర్యవంతంగా నిర్మించారు. భవనాల నమూనాకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపిన తరువాతే నిర్మాణాలు మొదలైన విషయం తెలిసిందే. విశాలవంతమైన స్థలంలో వెయ్యి మందికి పైగా సమావేశమయ్యేలా హాలు నిర్మించారు. హాలు, వంట గది, పార్కింగ్‌, వాచ్‌మెన్‌కు ప్రత్యేక గది ఉన్నాయి. అన్నీ అధునాతన హంగులతోనే నిర్మించారు. జిల్లా ఆఫీసుల నిర్మాణానికి రూ.60 లక్షల చొప్పున పార్టీ అధిష్ఠానం అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా జిల్లా పార్టీ బాధ్యులకు చెక్కులు అందించిన విషయం తెలిసిందే. అయితే ఎవరికి వారు తమ జిల్లా పార్టీ ఆఫీసులు బాగుండాలనే లక్ష్యంతో సొంతంగా అదనపు ఖర్చులు పెట్టుకున్నారు. అన్ని సౌకర్యాలు ఉండేలా, అద్భుతమైన నిర్మాణాలు పూర్తయ్యాయి. పార్టీ ఇచ్చిన మొత్తానికి అంతే మొత్తం అదనంగా ఖర్చు అయినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. మేము ఉండే ఆఫీసు బాగుండాలని ఇష్టంగా ఖర్చు పెట్టుకున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి పర్యవేక్షణతో త్వరగా పూర్తి...

పార్టీ ఆఫీసులు త్వరగా పూర్తి కావడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పర్యవేక్షణ కారణమని చెప్పుకోవచ్చు. జిల్లాల పర్యటనకు వచ్చిన సందర్భాల్లో మంత్రి ప్రత్యేకంగా పార్టీ ఆఫీసుల నిర్మాణాలను స్వయంగా పరిశీలించిన విషయం తెలిసిందే. త్వరగా పూర్తి చేయాలని, స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు దగ్గరుండి పనులు పర్యవేక్షించాలని పలు సందర్భాల్లో ఆదేశించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు నిర్మాణాల పురోగతిని పార్టీ నేతలను ఫోన్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హరీశ్‌రావు పార్టీ ఆఫీసు నిర్మాణాలను పరిశీలించి అక్కడ మొక్కలు నాటిన విషయం కూడా విదితమే. స్వయంగా మంత్రి పర్యవేక్షించడంతో జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు త్వరగా పూర్తయినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

ఇక పార్టీ సమావేశాలు ఇక్కడే...

జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌కు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ప్రస్తుతం ప్రైవేట్‌ ఫంక్షన్‌హాలులో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతంలో ఫంక్షన్‌హాలులో కార్యకర్తల సమావేశాలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడేవి. అంతేకాకుండా పట్టణం మధ్యలో స్పీకర్లు ఏర్పాటు చేయడం కూడా ఇబ్బందిగానే ఉండేది. ప్రస్తుతం నిర్మించిన కొత్త పార్టీ ఆఫీసులు పట్టణానికి దూరంగా ఉండడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా ఆఫీసును పట్టణానికి సమీపంలో కంది మండల కేంద్రానికి కొంత దూరంలో నిర్మించారు. ఇక్కడ ఎలాంటి గృహ సముదాయాలు, ఇతర భవనాలు లేవు. అలాగే, మెదక్‌ పట్టణంలో కూడా కొత్త కలెక్టరేట్‌ సమీపంలో ఆఫీసు నిర్మాణం పూర్తయ్యింది. ఇక్కడ కూడా ఆఫీసు నిర్మాణంతో ఇతర వర్గాలకు ఇబ్బందులు ఉండబోవు. సిద్దిపేటలో పట్టణానికి సమీపంలో కొండపాక మండల పరిధిలోకి వచ్చే స్థలంలో కలెక్టరేట్‌కు సమీపంలో ఆఫీసు నిర్మించారు. వీటి ప్రారంభోత్సవం తరువాత ఇక పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమావేశాలు వీటిలోనే ఏర్పాటు చేయనున్నారు. కార్యకర్తలకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించనున్నారు. అనుకూలమైన స్థలాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణం చేసుకున్న నేపథ్యంలో పార్టీ సమావేశాలు ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా జరుగుతాయని పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు..

నిర్మాణం పూర్తయిన టీఆర్‌ఎస్‌ జిల్లా ఆఫీసుల ప్రారంభోత్సవానికి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రావణ మాసం శుభ ముహూర్తం కావడంతో ఈ నెల 25 నుంచి పార్టీ ఆఫీసులను ప్రారంభించడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ మూడు జిల్లాలో నిర్మాణాలు పూర్తయిన విషయం తెలిసిందే. ఇతర జిల్లాలతో పోల్చితే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో త్వరగా పూర్తయినట్లుగా చెప్పుకోవచ్చు. కాగా, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా కావడంతో మూడు జిల్లాలో ఎక్కడైనా పార్టీ ఆఫీసు ప్రారంభిస్తారా..? వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ లేదా జిల్లా ఇన్‌చార్జి మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారా..? వేచి చూడాల్సి ఉన్నది. నిర్మాణాలు పూర్తయిన క్రమంలో ఎప్పుడైనా ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మూడు జిల్లాల పార్టీ నేతలు చెబుతున్నారు.logo