ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 19, 2020 , 23:00:53

జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

 జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

చదువుకునే విద్యార్థి ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని సీఎం కేసీఆర్‌ ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో మంచి భోజనాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్‌, తాజాగా ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనిని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు. దీంతో పేద విద్యార్థులకు అర్ధాకలితో చదువుకొనే బాధ నుంచి విముక్తి కలుగనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 20వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. స్కూల్‌ విద్యార్థులకు మాదిరిగా వారికీ సన్నబియ్యంతో ఆహారం వడ్డించనున్నారు. గుడ్డు, పండ్లు వంటి పౌష్టికాహారం అందిస్తారు.

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో పౌష్టికాహారాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్‌, తాజాగా ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులకూ మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనిని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం గ్రామాలు విడిచి మండలం, పట్టణ కేంద్రాలకు విద్యార్థులు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్ధాకలితో విద్యనభ్యసిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో నిరుపేద విద్యార్థుల్లో ఆనందం నెలకొంది. ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా సుమారుగా 20వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనున్నది. 

కాలే కడుపులకు ...                                                                                 

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సన్నబియ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన భోజనం పెడుతున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి దీనిని ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు వర్తింపజేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 20 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రథమ సంవత్సరం 2,618 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 2,446 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు డిగ్రీకి వెళ్తుంటారు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలోకి వస్తుంటారు. దీంతో విద్యార్థుల సంఖ్య మారుతుంటుంది. 7 డిగ్రీ కళాశాలలు ఉండగా, వీటిలో 5,289 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మెదక్‌ జిల్లాలో 16 జూనియర్‌ కళాశాలు ఉండగా.. 5వేల మంది విద్యార్థులు, 2 డిగ్రీ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 1130మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 20 జూనియర్‌ కళాశాలలు ఉండగా, ప్రథమ సంవత్పరంలో 4,407 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 3,901 మంది చదివారు. 7 డిగ్రీ కళాశాలలు ఉండగా.. ప్రథమ సంవత్సరంలో 3,500 మంది, ద్వితీయ సంవత్సరంలో 3,500 మంది, మొత్తం 7,000 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరు కాకుండా కొత్తగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో, డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు ఉంటారు. ఇంటర్‌ పూర్తిచేసిన వారు డిగ్రీలో చేరుతుంటారు. డిగ్రీ పూర్తి చేసి (తృతీయ సంవత్సర విద్యార్థులు) వెళ్లిపోతుంటారు. దీంతో విద్యార్థుల సంఖ్య మారనున్నది.  

సొంతంగా అమలు చేస్తున్న మంత్రి, ఎమ్మెల్యేలు.. 

ప్రభుత్వ నిర్ణయంతో సర్కారు కళాశాలలు మరింతగా బలోపేతం కానున్నాయి. మూడేండ్ల నుంచి సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో సొంత ఖర్చులతో ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. గ్రామాల్లో పాఠశాల స్థాయి విద్య పూర్తికాగానే ఇంటర్‌ చదువు కోసం మండల కేంద్రానికి లేదా పట్టణ కేంద్రానికి విద్యార్థులు రావాల్సిందే. కొంత మంది విద్యార్థులు ప్రైవేట్‌ కళాశాలలకు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు. నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఉదయం ఇంటి నుంచి వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకు అర్ధాకలితో ఉంటున్నారు. అర్ధాకలితో విద్యను అభ్యసించడం కష్టంగా మారింది. దీంతో కొంతమంది విద్యార్థులు మధ్యలోనే కళాశాల నుంచి ఇంటికి వెళ్లిపోతున్నారు. ఫలితంగా ఆ ప్రభావం వారి చదువుపై పడుతున్నది. దీనిని దృష్టిలో పెట్టుకొని పాఠశాల స్థాయి విద్యార్థుల మాదిరిగానే ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.  

విద్యార్థులకు పౌష్టికాహారం.. 

పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి. విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. పిల్లల్లో పౌష్టికాహార లోపం తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత శాతం పెరుగుతున్నది. విద్యార్థులకు వివిధ రకాల కూరగాయలతో పాటు గుడ్డు, పండ్లతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం ప్రారంభం కానుండడంతో కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.logo