గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Jul 17, 2020 , 23:12:48

పచ్చదనాన్ని పెంపొందించాలి

పచ్చదనాన్ని పెంపొందించాలి

  •  మాసాయిపేటలో  వర్మీ కంపోస్టు  ఎరువు తయారీపై సంతృప్తి 
  •   రాష్ట్ర పంచాయతీరాజ్‌,  గ్రామీణాభివృద్ధి   కమిషనర్‌ రఘునందన్‌రావు

    వెల్దుర్తి : గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందించి, ఆకుపచ్చగా మార్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధ్ది కమిషనర్‌ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం మాసాయిపేట డంపింగ్‌యార్డును కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వర్మీ కంపోస్టు, ఎరువుల తయారీని డీపీవో హనోక్‌ వారికి  వివరించారు. వర్మీ కం పోస్టు తయారీ బాగుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల్లో విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయని, విద్యుత్‌ను జాగ్రత్తగా వాడుకోవడంతో పాటు ఆదా చేయాలన్నారు. వచ్చే రెండు, మూడేండ్లకు సరిపడా మొక్కలను నర్సరీల్లో పెంచాలని సూచించారు. కమిషనర్‌ వెంట జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, పీడీ శ్రీనివాసరావు, ఎంపీపీ స్వరూప నరేందర్‌రెడ్డి, ఎంపీడీవో జగదీశ్వరాచారి, సర్పంచ్‌ మధుసూదన్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ నాగరాజు, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, నాయకులు ఉన్నారు. 

డంపింగ్‌యార్డులు భేష్‌

కొల్చారం : మొక్కలు నాటడంతోనే సరిపోదని వాటిని కాపాడాలని కమిషనర్‌ రఘునందన్‌రావు సూచించారు. కొల్చారం మండల పరిధిలోని చిన్నాఘణాపూర్‌ ఐబీ సమీపంలోని హరితవనంలో కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి మొక్కలను నాటారు. ఏటిగడ్డ మందాపూర్‌లో డంపింగ్‌యార్డును పరిశీలించారు. తడి, పొడిచెత్త సేకరించే తీరును అడిగి తెలుసుకున్నారు.  కంపోస్టు, ఎరువుగా మార్చే తీరును పరిశీలించిన సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డిని ప్రశంసించారు.  అనంతరం  రైతు వేదిక నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హనో క్‌, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల, సర్పంచ్‌లు ఇందిరాప్రియదర్శినీ, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీవో వామనరావు, తహసీల్దార్‌ సహదేవ్‌, ఉపసర్పంచ్‌ లక్ష్మీనారాయణగౌడ్‌, ఏపీవో మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రైతు వేదికల పురోగతిపై ఆరా..

 మెదక్‌ : ప్రభుత్వం రైతుల కోసం నిర్మిస్తున్న రైతు వేదికల పురోగతి ఎంత వరకు వచ్చింది.. స్థలాల సేకరణ జరిగిందా..? వాటికి ఎంత స్థలంలో ఎంత వ్యయంతో నిర్మాణాలు చేపడుతున్నారనే వివరాలను జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి, పంచాయతీరాజ్‌ ఈఈ వెంకటేశ్వర్లలను కమిషనర్‌ రఘునందన్‌రావు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం మెదక్‌ జిల్లాలోని వెల్దుర్తి మండలం మాసాయిపేట, చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి, మెదక్‌ మండలం రాజ్‌పల్లి, కొల్చారం మండలం చిన్నఘణాపూర్‌, ఎట్టిగడ్డ మందాపూర్‌ గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, నర్సరీలను ఆకస్మికంగా ఆయన పరిశీలించారు. మొక్కలు నాటడంతోనే సరిపోదని వాటిని కాపాడాలన్నారు. ఇప్పటి వరకు నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏటిగడ్డ మందాపూర్‌లో నూతనంగా నిర్మించిన  వర్మీ కంపోస్టు తయారీ యూనిట్‌ను పరిశీలించారు. ఆయన వెంటన జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీపీవో హనోక్‌, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీఏవో పరశురాంనాయక్‌, పీఆర్‌ ఈఈ వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, చిన్నశంకరంపేట జడ్పీటీసీ మాధవి, కొల్చారం మం డలం జడ్పీటీసీ మేఘమాల, జిల్లాలోని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. 


logo