శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 16, 2020 , 23:15:13

బాల్య వివాహాలను అరికట్టాలి

బాల్య వివాహాలను అరికట్టాలి

  • కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌ : జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, తండాల్లో బాల్య వివాహాలను అరికట్టాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. గురువారం మెదక్‌ కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలతో జరిగే అనర్థాలను గ్రామాల్లో ఆడపిల్లల తల్లిదండ్రులకు వివరించాలన్నారు. చిన్న తనంలోనే వివాహం చేస్తే వారి మానసిక స్థితి ఎదుగకపోవడం, ఇతర సమస్యలు వస్తాయని కలెక్టర్‌ అన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాల గురించి గ్రామాలు, తండాల్లోని విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఎన్ని చేపట్టారని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రసూల్‌బీని కలెక్టర్‌ అడిగారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తి స్థాయిలో నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో సఖీ సెంటర్‌ను నిర్వహిస్తున్నామన్నారు. గర్భిణులు, బాలింతలు, బాలికలతో పాటు చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో రసూల్‌ బీ, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్‌డీవో శ్రీనివాస్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, డీఎస్పీ కృష్ణమూర్తి, ఐసీడీఎస్‌ సీడీపీవోలు పద్మావతి, హేమభార్గవి, స్వరూప, సూపర్‌వైజర్లు, సఖీ సెంటర్‌ బాధ్యులు పద్మలత, కరుణశీల, కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు.

నెల రోజుల్లో రైతు వేదిక నిర్మాణాలను పూర్తి చేయాలి

రైతు వేదిక నిర్మాణాలను ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. మెదక్‌ పట్టణంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించుకునేందుకు రైతు వేదికలను త్వరగా నిర్మించి వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. జిల్లాలో ఆయా క్లస్టర్లకు సంబంధించిన  సామగ్రి ఇప్పటికే వచ్చాయని, వాటి నిర్మాణ పనులు  జరుగుతున్నాయని తెలిపారు. అనుకున్న సమయానికి రైతు వేదికల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్‌ సూచించారు. మండల స్థాయి ప్రత్యేకాధికారులు, అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని, పనులు నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఆయా మండలాల్లో తహసీల్దార్లు రైతు వేదికల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించాలన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాంనాయక్‌, ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

చిన్నశంకరంపేటలో..

చిన్నశంకరంపేట : రెండు నెలల్లో  రైతు వేదిక భవన నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు  కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచించారు. చిన్నశంకరంపేటతో పాటు గవ్వలపల్లిలో రైతు వేదిక భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ వెంట మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజు, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు ఉన్నారు.


logo