సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 16, 2020 , 23:15:40

జల వనరులకు జీవం

జల వనరులకు జీవం

ఉమ్మడి మెదక్‌ నెట్‌వర్క్‌ : అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలవనరుల్లో నీళ్లు చేరాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. దీంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నీటి వనరులు నిండుకుండలా మారాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. నీళ్లను చూసి రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నది. సాగుకు ఇక ఢోకా లేదని మురిసిపోతున్నది.

గంగమ్మకు పూజలు

దౌల్తాబాద్‌ : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి. గురువారం ఉప్పరపల్లి ఉప్పరచెరువు నిండి అలు పారుతుండగా, గ్రామ సర్పంచ్‌ చిత్తారి గౌడ్‌ ఆధ్వర్యంలో కొబ్బరి కాయకొట్టి పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  చెరువులు, కుంటలు నిండుతుండంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘నల్లవాగు’కు పోటెత్తుతున్న వరద

సిర్గాపూర్‌ : సంగారెడ్డి జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగుకు వరద పొటెత్తడంతో నీటిమట్టం పెరుగుతున్నది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన సిర్గాపూర్‌, కంగ్టి మండలాల ప్రాంతంతో పాటు, పక్కనే ఉన్న కర్ణాటక ప్రాంతంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా వరద పరవళ్లు తొక్కింది. దాంతో ప్రాజెక్టులో నీటి మట్టం 1483.20 అడుగులకు చేరుకుందని ప్రాజెక్టు ఏఈఈ సూర్యకాంత్‌ గురువారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1493 అడుగులు ఉందని చెప్పారు. ప్రస్తుతం 514 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నట్లు ఏఈఈ తెలిపారు.logo