శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 16, 2020 , 02:41:08

భయం.. నిర్లక్ష్యం.. రెండూ వద్దు

భయం.. నిర్లక్ష్యం..  రెండూ వద్దు

  • అత్యవసరమైతే తప్ప బయట అడుగు పెట్టొద్దు
  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో  సిద్దిపేటలో వంద పడకల కొవిడ్‌ ఐసొలేషన్‌
  • త్వరలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో టెస్టింగ్‌ సెంటర్‌
  • ప్రభుత్వ దవాఖానలో  కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
  • సిద్దిపేటలో కొవిడ్‌ ఐసొలేషన్‌ బ్లాక్‌ ప్రారంభం

‘కరోనా సోకినా అతిగా భయపడవద్దు.. అలా అని నిర్లక్ష్యం కూడా తగదు.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సిద్దిపేటలో 100 పడకల కొవిడ్‌ ఐసొలేషన్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేశాం.. సీఎం కేసీఆర్‌, ఆరోగ్య మంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.. బాధితులకు మెరుగైన వైద్యమందేలా చర్యలు తీసుకుంటున్నారు’.. అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట ఏరియా దవాఖానలో 100 పడకల ప్రత్యేక కొవిడ్‌ ఐసొలేషన్‌ బ్లాక్‌ను జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అవసరమైతే తప్పా అడుగు బయటకు పెట్టవద్దని మంత్రి        ప్రజలను కోరారు. - సిద్దిపేట, నమస్తే తెలంగాణ

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : ‘సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణంలో 100 పడకల సామర్థ్యం గల కొవిడ్‌ ఐసొలేషన్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేశాం.. ఇందులో సాధారణ పడకలు 80.. ఐసీయూ బెడ్లు 20 బెడ్లు ఉన్నాయి.. ప్రతి బెడ్‌కు ఒక ఆక్సిజన్‌ సౌకర్యాన్ని కల్పించాం.. బాధితులకు సేవలందించేందుకు కొవిడ్‌ ఐసొలేషన్‌ బ్లాక్‌కు 28 మంది వైద్యులు.. 150మంది స్టాఫ్‌ నర్సులను ప్రత్యేకంగా నియమించాం’.. అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట ఏరియా దవాఖానలో 100 పడకల ప్రత్యేక కొవిడ్‌ ఐసొలేషన్‌ బ్లాక్‌ను జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఐసొలేషన్‌ బ్లాక్‌లో సౌకర్యాలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ప్రభుత్వ దవాఖానల్లోనే కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందుతున్నదన్నారు. మిగతా రాష్ర్టాల కంటే తెలంగాణలో కొవిడ్‌ మరణాల రేటు చాలా తక్కువ ఉందన్నారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి కొవిడ్‌ ఐసొలేషన్‌ బ్లాక్‌లో ఉంచి వైద్య సేవలందిస్తారన్నారు. వ్యాధి బారిన పడ్డా, లక్షణాలు లేకుంటే హోం ఐసొలేషన్‌లోనే ఉంచి సేవలందేలా చూస్తామన్నారు. తీవ్రతను బట్టి గాంధీ, ఉస్మానియా దవాఖానకు పంపిస్తారన్నారు. ప్రజలు అతిగా భయపడవద్దని, నిర్లక్ష్యం కూడా తగదని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌, ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షిస్తూ, బాధితులకు మెరుగైన వైద్యమందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. కరోనా వచ్చిందని తెలియగానే భయపడి, ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి, ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఒకే రకమైన వైద్య విధానం ఉంటుందన్నారు. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో వంద పడకల దవాఖాన ఏర్పాటు చేస్తున్నదన్నారు. ఐసొలేషన్‌ బ్లాక్‌లో వేడి వాటర్‌తో పాటు ప్రొటీన్లతో కూడిన సంతులిత ఆహారం అందజేస్తారన్నారు. యూజ్‌ అండ్‌ త్రో బెడ్‌షీట్లను ఏర్పాటు చేశారన్నారు. కొవిడ్‌ బ్లాక్‌లోకి ఒక్క బాధితుడిని మాత్రమే అనుమతిస్తారన్నారు. కుటుంబ సభ్యుల మాదిరి డాక్టర్లు స్టాఫ్‌ నర్సులు వారిని చూసుకుంటారన్నారు. కొవిడ్‌ పోరాటంలో సైనికుల మాదిరి ముందు నిలబడి సేవలందిస్తున్న డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, పారిశుధ్య సిబ్బందికి ప్రజలు మోరల్‌ సపోర్టు ఇవ్వాల్సిన అవసరముందన్నారు.

 త్వరలోనే టెస్టింగ్‌ సెంటర్‌

సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో త్వరలోనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు టెస్టింగ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సెంటర్‌ ప్రారంభించేందుకు 70శాతం కావాల్సిన పరికరాలు ఇప్పటికే సమకూర్చామన్నారు. మిగతావి సాధ్యమైనంత తొందరలో సమకూర్చి టెస్టింగ్‌ కేం ద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో ర్యాపిడ్‌ టెస్టులను విరివిగా చేస్తూ వెంటనే ఫలితాలను  ఆరోగ్య సిబ్బంది ఇస్తున్నారన్నారు. మహమ్మా రి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు సంపూర్ణ స హకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

 ఏమ్మా.. బాగున్నారా.. :  ‘ఏమ్మా.. బాగున్నారా’.. అంటూ.. వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, పారిశుధ్య కార్మికులను మంత్రి హరీశ్‌రావు ఆప్యాయంగా పలుకరించారు. బాగా పనిచేయాలని సూచించారు. బాధితులను కుటుంబ సభ్యులుగా భా వించి వైద్య సేవలందించాలన్నారు. ఫేస్‌ ప్రొటక్షన్‌ మాస్క్‌ ఉందా? అంటూ స్టాఫ్‌ నర్సులను ప్రశ్నించారు. లేదని నర్సులు చెప్పడంతో 500 ఫేస్‌ ప్రొటక్షన్‌ మాస్క్‌లు అందిస్తామన్నారు. ఒక వేళ బాధితుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా సరిపడా వైద్యులు, స్టాఫ్‌ నర్సులను పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఆర్డీవో, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ తమిళ అరస్‌, ఆర్‌ఎంవో కాశీనాథ్‌, జడ్పీ సీఈవో, కొవిడ్‌ ఐసొలేషన్‌ బ్లాక్‌ నోడల్‌ అధికారి శ్రవణ్‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.


logo