మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 14, 2020 , 03:38:59

కొత్తగా 58 కరోనా పాజిటివ్‌ కేసులు

కొత్తగా 58 కరోనా పాజిటివ్‌ కేసులు

సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలో సోమవారం కొత్తగా 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో మోజీరాం రాథోడ్‌ తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డిలో 16, జహీరాబాద్‌ 11, సదాశివపేట 4, దోమడుగు 1, బీరంగూడ 3, కొహీర్‌ 1, ఆరూర్‌ 1, ఆర్‌సీపురం 5, పటాన్‌చెరు 3, ఇస్మాయిల్‌ఖాన్‌పేట 1, ముత్తంగి 1, అమీన్‌పూర్‌ 3, కలివెముల 1, ఇంద్రకరణ్‌ 1, జుల్‌కల్‌ 1, బొడంపల్లి 1, కొండాపూర్‌ 1, అనంతసాగర్‌ 1, నల్లవాగు 1, ఓడీఎఫ్‌ 1 మొత్తం 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. 58 మందిలో 54 మంది హోం ఐసోలేషన్‌లో, నలుగురు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారన్నారు. సంగారెడ్డి పట్టణంలో మాస్కులు ధరించకుండా తిరిగే ఐదుగురికి రూ. 5 వేలు జరిమానా విధించినట్లు మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. 

రామచంద్రాపురం : ఆర్సీపురం పరిధిలో పదకొండు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పీహెచ్‌సీ డాక్టర్‌ రజిని సోమవారం తెలిపారు. సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్‌ చేశామన్నారు.   జ్యోతినగర్‌లో 3, బొంబాయికాలనీలో 1, ఎల్‌ఐజీలో 2, సాయికాలనీలో 1, ఉస్మాన్‌నగర్‌లో 1, న్యూఎంఐజీలో 2 కరోనా  కేసులు నమోదయ్యాయని తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు ఉండే కాలనీల్లో బల్దియా, మున్సిపల్‌ అధికారులు సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేయించారు. 

గడ్డపోతారంలో వృద్ధురాలికి కరోనా 

జిన్నారం : గడ్డపోతారం గ్రామంలో వృద్ధురాలు(73)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఐదు రోజుల కింద కూతురికి కరోనా పాజిటివ్‌ రాగా తల్లికి పరీక్షలు చేశారు. తల్లి, కూతురు హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

బోడపల్లిలో యువకుడికి కరోనా 

మునిపల్లి : మండలంలోని బోడపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ శిరీష తెలిపారు. సోమవారం మండల కేంద్రం మునిపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన సదరు వ్యక్తికి వారం రోజులుగా జ్వరం ఉండడంతో జహీరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. నేటి నుంచి బోడపల్లి గ్రామంలో ఇంటింటి సర్వే చేస్తామని, గ్రామస్తులు సహకరించాలని కోరారు.

చేర్యాలలో ఒకరికి... 

చేర్యాల : పట్టణానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చేర్యాల సీహెచ్‌సీలోని పీపీపీ యూనిట్‌ వైద్య సిబ్బంది తెలిపారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సదరు వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో ఈ నెల 9వ తేదీన అడ్మిట్‌ కాగా 11వ తేదీన పరీక్షలు చేసి,  ఆదివారం రాత్రి పాజిటివ్‌గా నిర్ధారించినట్లు పేర్కొన్నారు.

మర్రిముచ్చాలలో ఒకరికి కరోనా 

కొమురవెల్లి : మండలంలోని మర్రిముచ్చాలలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి కార్తీక్‌ సోమవారం తెలిపారు. సదరు వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలించడంతో పాటు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు. సన్నిహితంగా మెలిగినవారి వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

సిద్దిపేటలో ఐదుగురికి పాజిటివ్‌ 

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేట జిల్లాలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సోమవారం జిల్లా కొవిడ్‌-19 నోడల్‌ అధికారి పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. చేర్యాల మండలం మర్రిముచ్చాలలో ఒకరికి, కొండపాక మండలం అంకిరెడ్డిపల్లిలో ఒకరికి, దుబ్బాకలో ఒకరికి, సిద్దిపేట గణేశ్‌నగర్‌లో ఒకరికి, సిద్దిపేట రూరల్‌ మండలం పుల్లూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్‌ చేసినట్లు పేర్కొన్నారు.

ఇబ్రహీంనగర్‌లో తల్లి, కొడుకుకు కరోనా 

చిన్నకోడూరు : మండలంలోని ఇబ్రహీంనగర్‌లో తల్లి, కొడుకుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పీహెచ్‌సీ వైద్యురాలు జ్యోతిసుభ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారన్నారు. అదే రోజు అతడి భార్య, 22 నెలల కుమారుడు నుంచి రక్త నమూనాలను సేకరించామన్నారు. ఆదివారం రాత్రి వారిద్దరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.  

నర్సాపూర్‌ పట్టణంలో వైద్య సిబ్బంది సర్వే

నర్సాపూర్‌ : నర్సాపూర్‌ పట్టణంలో పలువురికి కరోనా వైరస్‌ సోకడం వల్ల సోమవారం వైద్య సిబ్బంది పలు కాలనీల్లో వివరాలు సేకరించారు. గాంధీ విగ్రహం సమీపంతో పాటు ఎన్‌జీవో కాలనీ, ఎస్సీ కాలనీలో సర్వే చేసి పలువురి చేతులకు క్వారంటైన్‌ ముద్రలు వేశారు.

మెదక్‌ జిల్లాలో ఒకరికి కరోనా 

మెదక్‌ : మెదక్‌ జిల్లాలో సోమవారం ఒకే ఒక్క కేసు నమోదైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 83కు చేరింది. ప్రతీ రోజు జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో కరోనా కేసులు నమోదవుతున్నాయని డిఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు పేర్కొన్నారు.  


logo