సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 14, 2020 , 03:40:28

వచ్చే నెలాఖరు కల్లా మొక్కలు నాటాలి

వచ్చే నెలాఖరు  కల్లా మొక్కలు నాటాలి

l బ్రిడ్జిల వద్ద సైడ్‌ డ్రైన్‌లు పూర్తి చేయాలి

l అధికారులు, గుత్తేదారులు  క్షేత్రస్థాయిలో పర్యటించాలి

l ఆర్థికశాఖ మంత్రి  తన్నీరు హరీశ్‌రావు

(సంగారెడ్డి ప్రతినిధి, నమస్తేతెలంగాణ) : హరితహారంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనంతో జాతీయ రహదారులు కనిపించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో జాతీయ రహదారుల పురోగతిపై అధికారులు, టోల్‌ గేట్ల ప్రతినిధులతో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్‌, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ మొక్కలు నాటడం, రహదారి పనుల కొనసాగింపులో జాప్యం తదితర సమస్యలు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ నత్తనడకన కొనసాగుతున్న జాతీయ రహదారుల పనులను వేగం పెంచాలి. వచ్చే నెలాఖారు కల్లా జాతీయ రహదారులపై మొక్కలు నాటాలి. బ్రిడ్జిల దగ్గర అసంపూర్తిగా ఉన్న సైడ్‌ డ్రైన్‌లను పూర్తి చేసి వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించాలి. ఎన్‌హెచ్‌ఏ అధికారులు, కాంట్రాక్టర్లు పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ప్రాజెక్టు మొత్తంలో ఒక శాతం నిధులు హైవే వెంట మొక్కలు నాటేందుకు ఖర్చు చేయాలి. కానీ ఎన్‌హెచ్‌-9 రహదారి వెంట మొక్కలు నాటడం లేదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.  వెంటనే జాతీయ రహదారి పొడువున మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలి. అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పచ్చదనం విషయంలో రాజీపడకుం డా మొక్కలు నాటి సంరక్షణ చేయాలని సూచించారు. 

బ్రిడ్జిల వద్ద సైడ్‌డ్రైన్‌లు పూర్తి చేయాలి..

కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ చౌరస్తా బ్రిడ్జి వద్ద సైడ్‌డ్రైన్‌లు పూర్తి చేయకపోవడంతో నీరు నిలిచి ట్రాఫిక్‌ స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మంత్రి గుర్తు చేశారు. డిసెంబర్‌ 31వ వరకు సైడ్‌డ్రైన్‌ పనులు పూర్తి చేసి ఇబ్బందులు తొలిగించాలి. అలాగే పెద్దాపూర్‌ గ్రామం వద్ద జాతీయ రహదారిపై సైడ్‌డ్రైన్‌, కవర్‌ కప్స్‌, సర్వీస్‌ రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సదాశివపేట-నిజాంపూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద వెహికల్‌ అండర్‌ పాస్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నాగపూర్‌ హైవే రోడ్డులో నాగులపల్లి వద్ద జాతీయ రహదారి పనులు వేగవంతం చేసి ఆర్‌యూబీ పనులు పూర్తి చేయాలి. రామాయంపల్లి రోడ్డు వద్ద రైల్వే బ్రిడ్జి వద్ద నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాత్కాలిక ప్రాతిపదికన పంపులతో నీటిని తొలగించాలి. సైడ్‌డ్రైన్‌లు నిర్మించి నీరు నిలువకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జాప్తి శివనూర్‌ వద్ద మంజూరైన ఆర్‌యూబీకి సంబంధించిన డిజైన్లు ఎన్‌హెచ్‌ఏ అధికారులకు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ సంస్థకు సూచించారు. రామాయంపేట, చేగుంట,దండుపల్లి, నార్సింగ్‌పల్లి మార్గంలో ఆర్‌యూబీ పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

కంకోల్‌ గ్రామస్తులకు టోల్‌గేట్‌ ఉచితం 

కంకోల్‌ టోల్‌ గేట్‌ వద్ద ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా అదనంగా నాలుగు టోల్‌ వసూలు లేన్లు ఆగస్టు నెలాఖరు నాటికి ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మునిపల్లి మండలం కంకోల్‌ గ్రామస్తులందరికీ టోల్‌గేట్‌ నుంచి ఉచితంగా వెళ్లడానికి చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ తన దృష్టికి తెచ్చారని సంబంధిత కాంట్రాక్టర్‌, గ్రామస్తులను టోల్‌గేట్‌ నుంచి ఉచితంగా పంపేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. టోల్‌ గేట్‌ పరిధిలో 20 కిలోమీటర్ల వరకు అందరికీ పాసులు ఇచ్చి రాకపోకలకు ఇబ్బంది లేకుం డా చూడాలని సూచించారు. అంతే కాకుండా నెలవారి పాసు 50 శాతం తక్కువ ధరకే ఇవ్వడం మంచిదని ప్రతినిధులకు సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ హనుమంతరావు, ఎన్‌హెచ్‌ఏ-9 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పుర్టాడో, కాంట్రాక్టర్ల ప్రతినిధులు, ఇంజినీరింగ్‌, ఆపరేషన్‌ అండ్‌ మెకానికల్‌ టీం సభ్యులు పాల్గొన్నారు.  

రోగనిరోధక శక్తికి  హోమియోపతి 

కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా మానవశరీరంలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు హోమియోపతి మందులు దోహదపడుతాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ ఉచితంగా పంపిణీ చేయనున్న కిట్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తయారు చేసిన మందులను ఎంపీ బీబీ పాటిల్‌ సొంత నిధులతో కొనుగోలు చేసి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లను చేయడం సంతోషకరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి రావొద్దు, ఒక వేళ బయటికి వస్తే తప్పని సరిగా మాస్కులు ధరించాలి. రోగనిరోధకశక్తిని పెంచుకునేందుకు హోమియోపతి మందులు వాడాలని సూచించారు. అనంతరం ఎంపీ బీబీ పాటిల్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ నివారణ చర్య ల్లో ప్రతి ఒక్కరూ రోగనిరోధకశక్తి పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మె ల్సీ ఫరిరొద్దీన్‌, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 రూ. 5 లక్షల విరాళం 

సంగారెడ్డి : కరోనా బాధితులను ఆదుకునేందుకు  సీఎం సహాయనిధికి ఎస్‌బీ ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ పరిశ్రమ యాజమాన్యం విరాళంగా  రూ. 5 లక్షల చెక్కును ఎంపీ బీబీ పాటిల్‌ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్‌ రావుకు అందజేసింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి రవిశర్మను మంత్రి అభినందించారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు అందరూ ఆపన్నహస్తం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.


logo