శుక్రవారం 07 ఆగస్టు 2020
Siddipet - Jul 12, 2020 , 23:20:59

ఆపత్కాలంలో అభయం

ఆపత్కాలంలో అభయం

కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ, పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. వైరస్‌ బారిన పడిన వారిని చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన, ఇతర ప్రైవేట్‌ దవాఖానలకు తరలిస్తున్నారు. కరోనా బాధితులకు జిల్లాల్లోనే వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు 100 పడకలతో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ దవాఖానలో ప్రత్యేక కొవిడ్‌-19 చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఈనెల 15న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, మెడికల్‌ సిబ్బంది ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. - సిద్దిపేట కలెక్టరేట్‌

జిల్లాలో ఇప్పటి వరకు కరోనా అనుమా లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్‌ను వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సేకరించి, పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపేవారు. బాధితులకు చికిత్స సైతం హైదరాబాద్‌లో అందిస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌లో ప్రభుత్వ దవాఖానల్లో ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశారు. ఇటీవల జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కేసులు బయట పడుతుండటంతో ప్రభుత్వం వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న దవాఖానల్లో కరోనా బాధితులకు చికిత్స అందించాలని నిర్ణయించింది. దీంతో సిద్దిపేట మెడికల్‌ కళాశాలలోని జిల్లా జనరల్‌ దవాఖానలో ప్రత్యేకంగా 100 పడకలతో కొవిడ్‌-19 చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నూతన మెడికల్‌ కళాశాల భవనంలో కరోనా టెస్ట్‌లు చేసేందుకు పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలు చేసేందుకు 8 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఆవసరమైన వైద్య పరికరాలు ఇప్పటికే సిద్దిపేటకు చేరుకున్నాయి. దీంతో అధికారులు ఈనెల 15న చికిత్స కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిసేట మెడికల్‌ కళాశాల దవాఖానలో ఇంతకు ముందు ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ కేంద్రంలో, 20 బెడ్స్‌తో పాటు 10 పడకల ఐసీయూ ఉంది. దవాఖాన ఏర్పాటు ద్వారా 100 పడకల ఐసొలేషన్‌ బెడ్‌తో పాటు ఆత్యవసర చికిత్స కోసం మరో 10 ఐసీయూ బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. కరోనా బాధితుల కోసం ఈ కేంద్రంలో 35 వెంటిలేటర్లు ఉన్నాయి. చికిత్స కోసం జనరల్‌ ఫిజీషియన్‌ ప్రేమ్‌సాగర్‌ ఆధ్వర్యంలో 27 మందితో వైద్యబృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం చికిత్స సమయంలో బాధితులు తీసుకోవాల్సిన ఆహారం, శానిటేషన్‌, తీసుకోల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు రోగులకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. దవాఖానలో చికిత్స కోసం సరిపడా పీపీఈ కిట్లు, N-95 మాస్క్‌లు అందుబాటులో ఉంచారు. జడ్పీ సీఈవో శ్రవణ్‌కుమార్‌ను ప్రత్యేకంగా కొవిడ్‌-19 నోడల్‌ అధికారిగా నియమించారు. డాక్టర్‌ కాశీనాథ్‌ను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. కరోనా బారిన పడిన వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా మానసిక వైద్యులతో కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి..

ఈనెల 15న కొవిడ్‌-19 ప్రత్యేక దవాఖాన ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశాం. నూతన భవనంలో పరీక్ష కేంద్రం, కళాశాల దవాఖానలో 100 పడకలు, 20 ఐసీయూ పడకలు ఏర్పాటు చేశాం. వైద్య సేవలు అందించేందుకు సిబ్బందిని పూర్తిగా సమాయత్తం చేశాం. - డాక్టర్‌ తమిళ ఆరసు, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల సిద్దిపేట


logo