ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 12, 2020 , 01:31:20

జీలుగ పంటతో మేలు

జీలుగ పంటతో మేలు

  • సాగుకు రైతుల ఆసక్తి
  • భూసారం పెరుగుతుందంటున్న వ్యవసాయ శాఖ అధికారుల  

పెద్దశంకరంపేట: మండలంలోని రైతులు జీలుగపంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. జీలుగ పంటతో భూసారం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో సూచనలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కొన్నేండ్లుగా పంట దిగుబడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వానకాలంలో రైతులు ఎంతో ఆసక్తిగా జీలుగ సబ్సిడీ విత్తనాలను కొనుగోలు చేసి పంటలను సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. మండలపరిధిలోని మల్కాపురం, వీరోజిపల్లి, రామోజిపల్లి, జూకల్‌, మూసాపేట, బూర్గుపల్లి, గొట్టిముక్కుల, జంబికుంట గ్రామాల్లో భూసారం పెంచుకునేందుకు జీలుగను సాగు చేస్తున్నారు. వరిపంట సాగుకు ముందు జీలుగ, జనుము పచ్చిరొట్ట వాడకంతో అధిక దిగుబడులు పొందవచ్చని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులతో ప్రచారం చేయించింది. దీనివల్ల పంటకు చీడ పురుగులు సోకే అవకాశం ఉండకపోవడం, అధిక దిగుబడిరావడంతో పంటలు విత్తే ముందు దుక్కిలో దీనిని కలియ దున్నుతారు. దీనివల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. 

సబ్సిడీపై జీలుగ విత్తనాలు  

ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందజేయడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ వానకాలంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలి. జీలుగ పంటను భూమిలో కలియ దున్నితే భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుంది.   - రాంప్రసాద్‌, ఇన్‌చార్జి ఏడీఏ


logo