గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Jul 09, 2020 , 23:57:10

గోదారి గంగమ్మ రాకతో జలకళ

గోదారి గంగమ్మ రాకతో జలకళ

  • సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నం..   n సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు..    n చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లకు జలకళ
  • ఎనిమిది మండలాల్లో నిండిన 82 చెరువులు, 67 చెక్‌డ్యామ్‌లు    n పెరుగుతున్న భూగర్భజలాలు   n జోరుగా వ్యవసాయ పనులు..
  • ఆనందంలో రైతులు, కూలీలు    n కులవృత్తుల వారికి జీవనోపాధి n వలస ప్రజల తిరుగుముఖం 

 గోదారి గంగమ్మ రాకతో సిద్దిపేట జిల్లాలోని అనేక చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు జలకళను సంతరించుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్లకు గోదావరి జలాలు విడుదల చేశారు. ఆ రిజర్వాయర్ల నుంచి చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లను నింపారు. దీంతో అన్ని ప్రాంతాల్లో ఎటుచూసినా గోదావరి జలాలు కనిపిస్తున్నాయి. 82 చెరువులు, 67 చెక్‌డ్యామ్‌లు పూర్తిస్థాయి నీటితో ఉట్టిపడుతున్నాయి. తటాకాలకు నీళ్లు రావడంతో వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు. బోరు, బావుల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తున్నారు. రైతులు, కూలీలు, కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ముద్దాడంతో సిద్దిపేట జిల్లాలో నీటి వనరులు జలకళను సంతరించుకుంటున్నాయి. జిల్లాలో 82 చెరువులు, 67 చెక్‌డ్యాంలను గోదావరి జలాలతో నింపారు. దీంతో ఆయకట్టు రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా నిండని చెరువులు సైతం ప్రస్తుతం జలకళతో ఉట్టిపడుతున్నాయి. సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న గోదావరి నీళ్లను సిద్దిపేట జిల్లాకు తీసుకువచ్చారు. ఎండిపోయిన చెరువులకు ఆ నీటిని మళ్లించి బతుకుకు భరోసా కల్పించారు. చెరువు ఆదరువు అంటారు. చెరువు నిండితే ఊరందరికి ఉపాధి దొరుకుతుంది. దీంతో వలసపోయిన వాళ్లంతా సొంతూళ్లకు తిరిగి వస్తున్నారు. వచ్చిన వారు చాలామంది ఎవుసం పనులు చేసుకుంటున్నారు. కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతున్నది. భూగర్భ జలాలు పెరుగడంతో పెద్ద ఎత్తున పంటలు   సాగుచేస్తున్నారు. 

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టారు. రికార్డు స్థాయిలో రిజర్వాయర్ల నిర్మాణంతో పాటుగా ప్రధాన కాల్వల నిర్మాణాలను ప్రభుత్వం పూర్తిచేసింది. డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్లకు గోదావరి జలాలు విడుదల చేశారు. ఆ రిజర్వాయర్ల నుంచి చెరువులు, కుంటలకు, చెక్‌డ్యాంలకు నీటిని వదిలారు. దీంతో అన్ని ప్రాంతాల్లో ఎటుచూసినా గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయతో చెరువులను పునరుద్ధరించింది. పూడిక తీయడంతో తటాకాల్లో నీటినిల్వ సామర్ధ్యం పెరిగింది. కట్ట విస్తరణ, అలుగులు, తూములు మరమ్మతులు పనులు చేశారు. దీంతో చెరువులు మంచిగై ఇవాళ గోదావరి జలాలతో మురిసిపోతున్నాయి. ప్రస్తుతం నీటిని విడుదల చేసిన 8 మండలాల్లో 1,056 చెరువులు ఉండగా.. 82 చెరువులను నింపారు. 347 చెక్‌డ్యాంలు ఉండగా.. 67 చెక్‌డ్యాంలను నింపారు. చెరువులకు నీళ్లు రావడంతో సిద్దిపేట జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను నింపుతున్నారు. మూడేండ్ల నుంచి ఈ ప్రాంతంలో ఏటా రెండుసార్లు చెరువులను నింపుతున్నారు. ప్రతిసారి అలుగులు పారుతుండడంతో బోరు, బావుల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ఈ ప్రాంత గ్రామాల వ్యవసాయ విధానం పూర్తిగా మారిపోయింది.

జలాల రాకతో..

కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి మే 29న సీఎం కేసీఆర్‌ చినజీయర్‌ స్వామితో కలిసి గోదావరి జలాలను విడుదల చేశారు. ఏప్రిల్‌ నెల 24న రంగనాయక సాగర్‌లోకి గోదావరి జలాలను రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు విడుదల చేశారు. రంగనాయక సాగర్‌ నుంచి తుక్కాపూర్‌, అక్కారం, మర్కూక్‌ పంప్‌హౌస్‌ల ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి నీళ్లు వచ్చాయి. జూన్‌ 24న కొండ పోచమ్మ రిజర్వాయర్‌ నుంచి జగదేవ్‌పూర్‌ కెనాల్‌ ద్వారా యాదాద్రి జిల్లాకు ప్రభుత్వ విప్‌ గొంగడి సునీత, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి గోదావరి జలాలను విడుదల చేశారు. మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ పనులు 70శాతం మేర పూర్తయ్యాయి. డిసెంబర్‌ నాటికి పూర్తిచేసేలా పనులు చేపడుతున్నారు. సిద్దిపేట -రాజన్న సిరిసిల్ల జిల్లాలో సరిహద్దులో ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌ ద్వారా సుమారు 30వేల ఎకరాలకు సాగునీరందనుంది. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ వద్ద నిర్మించిన రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ ద్వారా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలతో పాటు యాదాద్రి, మేడ్చల్‌ జిల్లాలకు ప్రయోజనం కలుగనున్నది. ఈ రిజర్వాయర్‌తో సుమారు 2,85,250 ఎకరాలకు సాగునీరందనుంది. 

నీటి వనరులకు జలకళ..

సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, మానకొండూరు నియోజకవర్గాల్లోని  82 చెరువులు,67 చెక్‌డ్యాంలు పూర్తిగా నిండాయి. సంతోషంతో రైతులు గంగమ్మ తల్లికి జలహారతి కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. పెద్ద చెరువులు నిండడంతో రైతులు సంబురపడిపోతున్నారు. పదేండ్లుగా నిండని చెరువులు ఇవ్వాళ గోదావరి జలాలతో నిండుకుండలా మారాయి. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు మండలంలో 11 చెరువులు, 25 చెక్‌డ్యాంలు నిండాయి.నంగునూరు మండలంలో 31 చెరువులు, 17 చెక్‌డ్యాంలు, సిద్దిపేట అర్బన్‌ మండలంలో 09 చెరువులు, 09 చెక్‌డ్యాంలు, సిద్దిపేట రూరల్‌ మండలంలో 02 చెరువులు, నారాయణరావుపేట మండలంలో 13 చెరువులు, 14 చెక్‌డ్యాంలు, బెజ్జంకి మండలంలో 11 చెరువులు, 02 చెక్‌డ్యాంలు మర్కూక్‌ మండలంలో ఒక చెరువు, దుబ్బాక మండలంలో 04 చెరువులు నిండాయి. తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌ ద్వారా నీటిని ఇటీవల విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారింది. ఎటుచూసినా రిజర్వాయర్లు ఉండడంతో గోదావరి జలాలతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో ఎవుసం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

సాగునీటి గోస తీరినట్లే..

కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి మాఊరి పెద్ద చెరువును నింపారు. చెరువు కిందనే నాకు రెండెకరాల భూమి ఉంది. ఇప్పటి దాకా ఉట్టిగనే ఉంచిన. ఎంతో దూరం నుంచి నీళ్లు తెచ్చి ఇక్కడ చెరువులు నింపుతున్న సీఎం సార్‌కు కృతజ్ఞతలు. మాకు ఇగ సాగు నీళ్ల గోస తీరినట్లే.  

- కొంతం సత్యనారాయణ, రైతు, చేబర్తి   

రుణపడి ఉంటాం.. 

నాకు మూడెకరాల భూమి ఉంది. ఇన్నేండ్లు సాగునీళ్లు లేక ఎకరం చొప్పున వరి, పత్తి చేసేవాళ్లం. రంగనాయకసాగర్‌తో రెండు చెరువులు నిండినయ్‌. ఉన్న భూమంతా సాగు చేస్తాం. మా ఊర్లో చెరువులు ఇట్ల నిండుతాయని ఎప్పుడూ అనుకోలే. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు సార్‌లు పట్టుబట్టి నీళ్లు తెచ్చి ఇక్కడ చెరువులు, కుంటలు నింపారు వారికి. రైతులమంతా రుణపడి ఉంటాం.  

 - పటేండ్ల వసంత, రైతు, గుర్రాలగొంది  

ఇక చేతినిండా పని..

ఇన్నేండ్లు నీళ్ల వసతి లేకుండే.. వానకాలం మాత్రమే పత్తి పంట సాగు చేశాను. సీఎం కేసీఆర్‌ సార్‌ చెరువులన్నింటినీ నింపిండు. బావులు, బోర్లలో పుష్కలంగా నీళ్లచ్చినయ్‌. ఇక ఎప్పటికీ చేతినిండా పని ఉంటది. పాండురంగ సాగర్‌ పక్కన నాకు మూడెకరాల భూమి ఉంది. సంబురంగా ఏడాదంతా ఎవుసం పనిచేసుకుంటాం. 

- రేణుకా, ఎర్రవల్లి    


logo