ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 08, 2020 , 23:00:10

మిట్టపల్లి మహిళలు అందరికీ ఆదర్శం

మిట్టపల్లి మహిళలు అందరికీ ఆదర్శం

‘టీఆర్‌ఎస్‌ రైతు ప్రభుత్వం.. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం.. మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం.. రైతుల కష్టాలు తీర్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఎక్కడా లేని పథకాలను అన్నదాతలకు అందిస్తున్నారు’.. అని మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. బుధవారం కొండపాక మండలం కుకునూర్‌పల్లిలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు మొక్కలు నాటారు. డీసీసీబీ నూతన శాఖతో పాటు ఏటీఎంను ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ.40లక్షల రుణాల చెక్కులు అందజేశారు. సిద్దిపేటలో కంది పప్పు కేంద్రాన్ని ప్రారంభించి, మహిళలను అభినందించారు. సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో రైతువేదికల పనుల పురోగతిపై సమీక్షించిన ఆయన, సిద్దిపేటకు రెండు రోజుల్లోగా కొవిడ్‌ పరీక్షా కేంద్రం తెప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రంగనాయకసాగర్‌ పర్యవేక్షక ఇంజినీర్‌ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

కొండపాక : టీఆర్‌ఎస్‌ రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతుల కష్టాలు తీర్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఎక్కడా లేని పథకాలను రైతులకు అందిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం హరితహారంలో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లిలోని రాజీవ్‌ రహదారి డివైడర్‌, రోడ్డుకు ఇరువైపులా సుమారు 1200 మొక్కలు నాటే కార్యక్రమంలో  ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొని నాటారు. గ్రామంలో ఏర్పాటు చేసిన డీసీసీబీ నూతన బ్యాంకుతో పాటు ఏటీఎంను ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ.40లక్షల రుణాల చెక్కులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘మేము పాలకులం కాదు.. ప్రజా సేవకులం’.. అని అన్నారు. డీసీసీబీ బ్యాంకుల ద్వారా రైతులకు, మహిళలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. పరిసర గ్రామాల ప్రజలు డీసీసీబీ బ్యాంకు సేవలను సద్వినియోగం  చేసుకోవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను  సంరక్షించాలని కోరారు. ప్రతి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలకాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరిత తెలంగాణ లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రజలకు మంచి ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు ప్రతి గ్రామంలో విలేజ్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కుకునూర్‌పల్లి గ్రామాభివృద్ధి కోసం మహిళా సమాఖ్య భవనం, అంగన్‌వాడీ కేంద్రం, పెద్దమ్మ ఆలయ ప్రహరీ, షాపింగ్‌ కాంప్లెక్స్‌, డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కుకునూర్‌పల్లి గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌ పోల్కంపల్లి జయంతి విజ్ఞప్తి చేయగా, విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కోఆపరేటివ్‌ డైరెక్టర్‌ బక్కి వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు దేవిరవీందర్‌, జడ్పీటీసీ అశ్విని, ఎంపీపీ సుగుణ, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, పీఎన్‌ఆర్‌ ట్రస్ట్‌ అధినేత నరేందర్‌, సర్పంచ్‌లు జయంతి, చిట్టి మాధురి, కోల శ్రీనివాస్‌, వసంత, ఎంపీటీసీలు, రైతుబంధు మండల కన్వీనర్‌ దుర్గయ్య, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అమర్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌, గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి నూనె కుమార్‌యాదవ్‌, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  మిట్టపల్లి మహిళలు స్త్రీశక్తిని చాటారు

సిద్దిపేట కలెక్టరేట్‌ : ‘మిట్టపల్లి స్వయం సహాయక బృందాల మహిళలు స్త్రీశక్తిని చాటారు.. మన మిట్టపల్లి పప్పుల పేరిట పప్పు తయారీ చేపట్టారు.. రానున్న రోజుల్లో వారికి మరింత సహకారం అందిస్తాం’.. అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎంపీపీ కవిత ప్రవీణ్‌రెడ్డి, జడ్పీటీసీ ప్రవళిక, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాంతో కలిసి సిద్దిపేట రైతుబజారులో పప్పు విక్రయ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులకు పప్పు ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీజన్‌ వారీగా రైతుల నుంచి ప్రభుత్వం మద్దతు ధరకు కందులు కొని, పప్పు దినుసులు తయారు చేస్తున్నారన్నారు. 6 కిలోల పప్పు రూ.500కే అందిస్తున్నారన్నారు. మహిళలకు ఉపాధి లభించడంతో పాటు నాణ్యమైన పప్పును తక్కువ ధరకు ప్రజలకు అందిస్తున్నారన్నారు. అందుకే వీరి కోసం రైతుబజారులో స్టాల్‌ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచు వంగ లక్ష్మి ఎంపీటీసీలు పాల్గొన్నారు.

 టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ నాయకులు

జగదేవ్‌పూర్‌ : ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు సమక్షంలో ఎంపీపీ బాలేశంగౌడ్‌, ఎంపీటీసీ కవితాశ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం కొడకండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన మేజర్‌ గ్రామపంచాయతీ జగదేవ్‌పూర్‌ ఉపసర్పంచ్‌ బింగిమల్లేశం పలువురు నాయకులు మహిపాల్‌, అలీ, శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి మంత్రి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్‌ మాదాసు అన్నపూర్ణశ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌  మండలాధ్యక్షుడు గుండారంగారెడ్డి, స్థానిక పీఏసీఎస్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, గ్రామాధ్యక్షుడు కొంపల్లి శ్రీను, నాయకులు, మహేశ్‌, హరిప్రసన్నరెడ్డి, వెంకట్‌రెడ్డి, బుద్ధ నాగరాజు తదితరులు ఉన్నారు.

వానకాలం పంట కోతల్లోపు..

సిద్దిపేట కలెక్టరేట్‌ : వానకాలం పంట కోతలకు ముందే రైతువేదికల నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో రైతువేదికల నిర్మాణ పనుల పురోగతిపై జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌తో కలిసి సమీక్షించారు. ఈ పనులను అత్యంత ప్రాధాన్యత అంశంగా రైతుబంధు అధ్యక్షులు, వ్యవసాయ అధికారులు భావించాలన్నారు. జిల్లాలో చేపట్టనున్న రైతువేదికల నిర్మాణ పనులు రెండు రోజుల్లో ప్రారంభం కావాలన్నారు. రైతువేదికల నిర్మాణం పూర్తయ్యేందుకు 60 రోజుల క్యాలెండర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 లోగా అన్ని వేదికల నిర్మాణాలు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశామని, పనుల వేగంతో పాటు నాణ్యతతో నిర్మాణం చేపట్టాలన్నారు.

  రెండు రోజుల్లోగా కొవిడ్‌ -19 పరీక్షా కేంద్రం తెప్పించేలా..

సిద్దిపేటకు రెండు రోజుల్లోగా కొవిడ్‌ -19 పరీక్షా కేంద్రం తెప్పించేలా కావాల్సిన చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ యోగితారాణా, డీఎంఈ చంద్రశేఖర్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ నెల 15 లోపు సిద్దిపేట మెడికల్‌ కళాశాల దవాఖానలో కొవిడ్‌ -19 పరీక్షా కేంద్రం అందుబాటులోకి తేవాలని జిల్లా వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. కొవిడ్‌ -19 కోసం వంద పడకల దవాఖానను రెండు రోజుల్లో ప్రారంభించుకోవాలని మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ తమిళ ఆరస్‌కు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కొవిడ్‌ నోడల్‌ అధికారిగా జడ్పీ సీఈవో శ్రావణ్‌ను నియమించినట్లు తెలిపారు. కొవిడ్‌ -19 శిక్షణ కోసం 18 మంది వైద్య సిబ్బంది హైదరాబాద్‌ వెళ్లాలని వైద్యాధికారులకు ఆదేశించారు. త్వరలోనే కొవిడ్‌ బాధితులతో స్వయంగా మాట్లాడి వారి బాగోగులను, స్థితిగతులను అడిగి తెలుసుకుంటానన్నారు. వైద్యం అందలేదనే మాట రావొద్దని అధికారులకు సూచించారు. 

రెండు రోజుల్లో ప్లాంటేషన్‌ ప్రారంభించండి..

చిన్నకోడూరు : రంగనాయకసాగర్‌సాగర్‌ బండ్‌, ఖాళీ స్థలాల్లో మొదటి విడుతలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రెండు రోజుల్లో ప్రారంభించి, నెలరోజుల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.  బుధవారం రంగనాయకసాగర్‌ పర్యవేక్షక ఇంజినీర్‌ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంపై జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఈఎన్సీ హరిరామ్‌, వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్‌, ఉద్యానవన, డీఆర్డీవో అధికారులు సంయుక్తంగా ఉపాధి హామీ కింద ప్లాంటేషన్‌ పనులు చేయాలన్నారు. రంగనాయకసాగర్‌ బండ్‌, జలాశయం ఆనుకొని ప్లాంటేషన్‌కు 100 ఎకరాల అనువైన స్థలం ఉందని కలెక్టర్‌ తెలిపారు. సెక్టార్ల వారీగా విభజించి 38 వేల మొక్కలు నాటవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మొక్కలు నాటే కార్యక్రమంపై మార్గదర్శనం చేశారు. మొదట 25 ఎకరాల్లో ప్లాంటేషన్‌ చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, ఆర్డీవో అనంతరెడ్డి, డీఎప్‌వో శ్రీధర్‌, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రామలక్ష్మి, ఉద్యానవన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ భగవాన్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆనంద్‌, డీఆర్‌డీఏ ఏపీడీ కౌసల్యదేవి, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఇరిగేషన్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
logo