శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 07, 2020 , 23:34:53

ఎకరంలో.. లక్షకుపైగా సంపాదన

ఎకరంలో.. లక్షకుపైగా సంపాదన

తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదన రావాలనే ఉద్దేశంతో వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలతో పాటు భిన్నంగా నిమ్మతోట పెంచుతూ ఏటా మంచి సంపాదనను పొందుతున్నాడు ఓ రైతు. ఏడాదికోసారి సేంద్రియ ఎరువులు వేసి, డ్రిప్‌ ద్వారా నిమ్మతోటను సాగుచేసి, పండించిన కాయలను గజ్వేల్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నాడు. తక్కువ శ్రమతో 20 ఏండ్లుగా మంచి దిగుబడిని సాధిస్తూ ఆదర్శ రైతుగా పిలిపించుకుంటున్నాడు రైతు తోకల రామచంద్రారెడ్డి. 

గజ్వేల్‌ రూరల్‌ :  గజ్వేల్‌ మండలం సింగాటం గ్రామానికి చెందిన రైతు తోకల సాయిరెడ్డి 20 ఏండ్ల క్రితం తన పొలంలోని అర ఎకరంలో సుమారు 50 వరకు నిమ్మ మొక్కలను పెట్టాడు. ప్రారంభంలో కొద్దిపాటి కాతనే కాసినప్పటికీ, ప్రస్తుతం ఒక్కో నిమ్మచెట్టు ఏడాదికి 5వేల వరకు కాయలను కాస్తున్నది. పదేండ్ల్ల పాటు వ్యవసాయంలో రాణించిన సాయిరెడ్డి, అనారోగ్యం కారణంగా తన కొడుకు రామచంద్రరెడ్డికి వ్యవసాయ పనులు అప్పగించాడు. రామచంద్రరెడ్డి వ్యవసాయంతో పాటు అర ఎకరంలో ఉన్న నిమ్మచెట్లకు నిత్యం డ్రిప్‌ ద్వారా నీళ్లను పెడుతూ, ఏటా రెండుసార్లు తన పశువుల నుంచి వచ్చే సేంద్రియ ఎరువులను చెట్లకు వేస్తున్నాడు. 

ఏడాదిలో ఏప్రిల్‌, సెప్టెంబర్‌ మాసంలో రెండుసార్లు ఒక్కో చెట్టుకు 5వేల వరకు కాత వస్తున్నది. వాటిని గజ్వేల్‌లోని వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌లో వ్యాపారులకు విక్రయిస్తున్నాడు. సీజన్‌లో 100 కాయలకు రూ.150 వరకు రాగా, ఆన్‌ సీజన్‌లో 100 కాయలకు రూ.60 మాత్రమే వస్తాయని, రెండు కాతలతో మంచి లాభమే వస్తుందన్నాడు రైతు. ఏడాదిలో రెండుసార్లు కూలీలతో చెట్ల మధ్యలో కలుపు తీసి, ఎరువులు వేసి వాటిని సంరక్షిస్తున్నాడు. ఏటా రెండు కాతలకు గాను తనకు సుమారుగా రూ.60 వేల వరకు లాభం వస్తోందని. 20 ఏండ్ల కిందట పెట్టిన మొక్కలతో ఎంతో లాభం వస్తుందంటున్నాడు.

ఖర్చులేని పంట.. 

నిమ్మ తోటల పెంపకంతో రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వస్తుంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే ఎన్నో ఏండ్లు లాభాలను పొందవచ్చు. ఏటా రూ.60వేల వరకు లాభం వస్తున్నది. నిమ్మ తోటనే కాకుండా ఇతర పంటలను సాగుచేస్తున్నా. - తోకల రామచంద్రారెడ్డి, రైతు, సింగాటం


logo