మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 07, 2020 , 23:13:46

పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందాలి

పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందాలి

జగదేవ్‌పూర్‌ : పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తీగుల్‌ గ్రామంలో సర్పంచ్‌ బానుప్రకాశ్‌రావు, ఎంపీటీసీ మంజుల మహేందర్‌రెడ్డిలతో కలిసి డంపింగ్‌ యార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీగుల్‌ గ్రామాన్ని మండలంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. వారం కింద గ్రామానికి వచ్చినప్పుడు చర్చించిన సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసినందుకు కలెక్టర్‌ అధికారులను అభినందించారు. రూ.73 లక్షలతో సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, పాత బావుల పూడ్చడం వంటి పనులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

అందరికీ ‘డబుల్‌ ఇండ్లు’ 

ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇల్లును మంజూరు చేయనున్నదని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు గ్రామంలో కలెక్టర్‌తో కలిసి మొక్కను నాటారు. కార్యక్రమంలో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, డీపీవో సురేశ్‌బాబు, జిల్లా బీసీ సంక్షేమాధికారి సరోజిని, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, ఏపీడీ కౌసల్య, గడా ఎంపీడీవో జయ్‌దేవ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo