మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 07, 2020 , 23:08:31

ఆదర్శ గ్రామాలుగా.. మారుద్దాం

ఆదర్శ గ్రామాలుగా.. మారుద్దాం

సిద్దిపేట రూరల్‌ /నారాయణరావుపేట :  ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు, గ్రేవ్‌ యార్డు నిర్మాణాలను పూర్తి చేసి స్వచ్ఛ సిద్దిపేట దిశగా అడుగులు వేద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్‌, నారాయణరావుపేట మండలాల్లోని అభివృద్ధి పనుల పురగోతిపై ప్రజాప్రతినిధులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీవోలు, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఐకేపీ సీఏలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉన్నప్పుడే స్వచ్ఛ గ్రామాలుగా మార్పు జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. ఈ నెలాఖారులోపు మండలాల్లోని ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు, గ్రేవ్‌ యార్డు, రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 15 లోపు నారాయణరావుపేట మండలంలోని 10 గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణాలను పూర్తి చేసి వర్మీ కంపోస్ట్‌ ఎరువును తయారు చేయాలన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలంలో 12 గ్రామాలకు 9 గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనుల్లో వేగం పెంచేలా ఎంపీడీవో, ఎంపీవోలు బాధ్యత తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పూర్తిస్థాయి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి ఓడీఎఫ్‌ దిశగా గ్రామాలు అడుగులు వేయాలన్నారు.

సీజనల్‌ వ్యాధులపై ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు ఇంటింటా అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసే దిశగా ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అందుకు అవసరమైన స్థల సేకరణ చేయాలన్నారు. ప్రతి ఇంటికి పండ్ల, పూల మొక్కలు అందించాలన్నారు. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో చేపల చెరువుల నిర్మాణాలు చేపట్టాలని ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. చేపల చెరువులు నిర్మించుకున్న గ్రామాలకు ఉచితంగా చేప పిల్లలను ఇచ్చేలా మత్స్య శాఖ అధికారులకు తెలుపుతామన్నారు. మల్బరీ సాగు లాభదాయకంగా ఉంటుందని, రైతులకు మల్బరీ సాగు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి గ్రామంలో గొర్లషెడ్డు, పశువుల పాకలు నిర్మించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  


logo