గురువారం 13 ఆగస్టు 2020
Siddipet - Jul 05, 2020 , 23:58:25

జోరుగా సాగుతున్న వ్యవసాయ పనులు

జోరుగా సాగుతున్న వ్యవసాయ పనులు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో నీటి వనరులు జలకళను సంతరించుకుంటుండగా.. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. వర్షాలు పడుతుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కొందరు రైతులు వరినాట్లు వేసే పనిలో ఉండగా.. ఇంకొందరు పత్తి కలుపు తీయడం, పంట చేన్లకు మందులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా డిమాండ్‌ ఉన్న పంటలను రైతులు సాగుచేశారు. ప్రధానంగా పత్తి, కందులు, వరి పంటలను సాగుచేశారు. నియంత్రిత పద్ధ్దతిలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 13,99,337 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇంకా సాగు పెరగనున్నది. సిద్దిపేట జిల్లాలో 4,99,963 ఎకరాలు, మెదక్‌ జిల్లాలో 2,60,560 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 6,38,814 ఎకరాల్లో వరి, పత్తి, కందులు తదితర పంటలను సాగుచేశారు. మూడు రోజుల నుంచి  కురుస్తున్న వర్షాలకు రైతులు వరినాట్లు వేస్తున్నారు. పత్తి పంట మొదటి దశ కలుపుతీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరికొంత మంది రైతులు ఎరువులు చల్లుతున్నారు. ఆయా మండల కేంద్రాలతో పాటుగా ప్రధాన గ్రామాల్లో అధికారులు ఎరువులు సిద్ధంగా ఉంచారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మండల వ్యవసాయాధికారులు (ఏవోలు) నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.  

రైతుబంధుతో ధీమా.. 

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతులకు రైతుబంధు సాయాన్ని అందించింది. ఇంకా మిగిలిపోయిన రైతులు ఉంటే వారి డేటాను సేకరించి, ఆ రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రైతుబంధు డబ్బులను నేరుగా వారి ఖాతాల్లో  వేసేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నది. రైతుబంధు డబ్బులతో రైతులు ఎరువులు కొనుగోలు చేసి తమ పంట చేన్లకు వేస్తున్నారు. మరి కొంతమంది రైతులు తమ పత్తి చేలల్లో కలుపుతీత పనులు చేపడుతున్నారు. వారికి రైతుబంధు డబ్బులు ఆసరాగా మారాయి. రైతులు ప్రతి రూపాయిని వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటున్నారు. వ్యవసాయ శాఖ పోర్టల్‌లో పేరున్న రైతులందరికీ రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 2,74,364 మంది రైతులకు, మెదక్‌ జిల్లాలో 2,04,706 మంది, సంగారెడ్డి జిల్లాలో 2,85,145 మంది రైతులకు రైతుబంధు సాయం అందింది.  


logo