బుధవారం 12 ఆగస్టు 2020
Siddipet - Jul 05, 2020 , 00:58:25

రైతు సంక్షేమమే లక్ష్యం

రైతు సంక్షేమమే లక్ష్యం

  • l అందుకే రైతు వేదికల  నిర్మాణం
  • l పచ్చని చెట్లతోనే ప్రగతి 
  • l జిల్లాలోనే సంగాపూర్‌ ఆదర్శం
  • l ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్‌రావు
  • l సంగారెడ్డి జిల్లాలో పలు  అభివృద్ధి పనుల  ప్రారంభం
  • l మొక్కలు నాటి నీళ్లు  పోసిన మంత్రి

రాయికోడ్‌ : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న మార్పులు తీసుకొస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం రాయికోడ్‌ మండలం సంగాపూర్‌లో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావులతో కలిసి చిల్డ్రన్స్‌ పార్క్‌, డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాలను మంత్రి ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడారు. పచ్చని చెట్లతోనే ప్రగతి ఉంటుందన్నారు. సంగాపూర్‌లో ఏపుగా పెరిగిన మొక్కలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డిని మంత్రి సన్మానించారు. సంగాపూర్‌ అభివృద్ధికి రూ.25లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఈ నెల 15వ తేదీలోగా పల్లె ప్రగతి పనులు పూర్తి చేయాలన్నారు. సంగాపూర్‌ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు.  ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, జిల్లా, మండల స్థాయి అధికారులు శ్రీనివాస్‌, బాబురావు, నర్సింగ్‌రావు, ఎల్లయ్య, రాజయ్య, ప్రభాకర్‌రెడ్డి, శశికుమార్‌, హరిత, అవినాశ్‌వర్మ, శ్రీకాంత్‌గౌడ్‌, సురేశ్‌, విష్ణు, ఎంపీపీ వెంకట్‌రావుపాటిల్‌, జడ్పీటీసీ మల్లికార్జున్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతకు అన్నింటా అండగా..

మునిపల్లి : ప్రభుత్వం రైతులకు అన్నింటా అండగా  రైతు వేదికలను నిర్మిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మునిపల్లి మండలం కంకోల్‌ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మొక్కలు నాటి మాట్లాడారు. దశాబ్దాల పాటు పాలన కొనసాగించిన ప్రతిపక్ష పార్టీలు చేసింది శూన్యమని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం ఇద్దామన్న ఆలోచన గానీ, రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మిద్దామన్న సోయి గానీ వారికి లేదని మండిపడ్డారు. అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారాలతో విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎవుసాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగుకు శ్రీకారం చుట్టారన్నారు. రాయికోడ్‌ నుంచి మునిపల్లికి వస్తుంటే రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో రైతులు పని చేస్తుంటే సంతోషం కలిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సర్కారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.  మునిపల్లి మండలాన్ని అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా తీర్చిదిద్దుతానని అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. మంత్రి వెంట ఎంపీ బీబీ పాటిల్‌, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, కలెక్టర్‌ హనుమంతరావు, జడ్పీటీసీ మీనాక్షి, సర్పంచ్‌  అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

స్వరాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీట..

వట్‌పల్లి : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యా రంగంలో వెనుకబడగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తూ, కార్పొరేట్‌ స్థాయిలో విద్యనందిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం అందోల్‌ మండలం సంగుపేట వద్ద రూ.2.43 కోట్లతో నిర్మించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రభుత్వ బాలికల వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల వసతిగృహ భవన సముదాయాన్ని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యా విధానంపై  మాట్లాడాల్సి వస్తే, తెలంగాణకు ముందు.. తర్వాత అని చెప్పాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక విద్యా రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మారుమూల పల్లెల్లో సైతం నాణ్యమైన విద్య అందుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపు వల్లే రాష్ట్రంలో ఫారెస్ట్‌, హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌, ఫిషరీస్‌ వంటి కళాశాలలు ఏర్పడి ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. త్వరలో సింగూర్‌లోకి ‘కాళేశ్వరం’ నీళ్లు రానున్నాయని, అందోల్‌,   నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లోని భూములు పచ్చని పంటలతో కళకళలాడుతాయని తెలిపారు. ఎంపీ బీబీ పాటిల్‌, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, కలెక్టర్‌ హనుమంతరావు, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, ఏఎంసీ చైర్మన్‌ మల్లికార్జున్‌, ఎంపీపీ బాలయ్య, జడ్పీటీసీ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo