శనివారం 08 ఆగస్టు 2020
Siddipet - Jul 03, 2020 , 02:57:59

మహమ్మారికి ముగ్గురు బలి

మహమ్మారికి ముగ్గురు బలి

  • n ఉమ్మడి జిల్లాలో ఒక్క రోజే ముగ్గురి మృతి

కంది/గుమ్మడిదల/మెదక్‌: కరోనా మహమ్మారికి గురువారం ముగ్గురు బలయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉత్తర్‌పల్లిలో మహిళ, గుమ్మడిదల మండల కేంద్రంలో వృద్ధుడు, మెదక్‌ జిల్లా కేంద్రంలో రిటైర్డ్‌ ఉద్యోగి మృత్యువాత పడ్డారు. కంది మండలం ఉత్తర్‌పల్లిలో ఓ మహిళకు కరోనా సోకగా, ఆమెను గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆమె మృతి చెందింది. సంగారెడ్డి రూరల్‌ ఎస్సై శ్రీకాంత్‌, తహసీల్దార్‌ రమాదేవీల ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి కుటుంబ సభ్యులను అధికారులు హోంక్వారంటైన్‌లో ఉంచారు.  సర్పంచ్‌ బాలయ్య ఆధ్వర్యంలో మృతి చెందిన మహిళ వీధివైపు ఎవరూ వెళ్లకుండా డప్పు చాటింపు వేయించారు. క్వారంటైన్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులను కూడా అందజేశారు.

గుమ్మడిదలలో వృద్ధుడు..

గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు(70) అనారోగ్యంతో ఉండడంతో పది రోజుల క్రితం దవాఖానకు తరలించారు. గురువారం ఆ వృద్ధుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులు, పీహెచ్‌సీ డాక్టరు వై.లక్ష్మి వెల్లడించారు. అలాగే ఆ వృద్ధుడిని కలిసిన వారిలో ఐదుగురిని గుర్తించారు. మిగిలిన వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం ఆ వ్యక్తుల రక్త నమూనాలను సేకరించనున్నట్లు డాక్టర్‌ తెలిపారు.

మెదక్‌లో రిటైర్డ్‌ ఉద్యోగి..

మెదక్‌ పట్టణానికి చెందిన ట్రాన్స్‌కో రిటైర్డ్‌ ఉద్యోగికి నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో వెంటనే అతన్ని సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించారు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. జిల్లాలో గురువారం వరకు మొత్తం 42 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు.

ఒక్కరోజే 31 కేసులు

సంగారెడ్డి మున్సిపాలిటీ : సంగారెడ్డి జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌ తెలిపారు. సంగారెడ్డిలో 8, సదాశివపేట 6, జహీరాబాద్‌ 7, పటాన్‌చెరు 1, ఆర్సీపురం 1, బీరంగూడ 5, అమీన్‌పూర్‌లో 3తో పాటు మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

సిద్దిపేట జిల్లాలో ఒకటి..

సిద్దిపేట కలెక్టరేట్‌ : కొండపాక మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా కొవిడ్‌-19 నోడల్‌ అధికారి పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి, హోంక్వారంటైన్‌లో ఉంచామన్నారు. 

రామాయంపేటలో మరొకటి..

రామాయంపేట : పట్టణంలో మరో వ్యక్తికి కరోనా వచ్చింది. గురువారం హైదరాబాద్‌లోని కిమ్స్‌ దవాఖానలో టెస్టులు చేసుకోగా, నిర్ధారణ అయ్యింది. సంబంధిత వ్యక్తి అక్కడి నుంచి నేరుగా గాంధీ దవాఖానలో అడ్మిట్‌ కానున్నట్లు తెలిసింది. రామాయంపేటలోని సదరు వ్యక్తి ఉన్న కాలనీకి ఆరోగ్య సిబ్బంది చేరుకుని బిల్డింగ్‌లో ఉన్న 20 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.logo